Dr Chandrasekhar Pemmasani: ‘సమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా’
ABN , Publish Date - Sep 16 , 2024 | 09:02 AM
సమాజం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కష్టపడే తత్వం, మంచి బుద్ది, జ్ఞానం, సరిపడినంత ధనం, ధైర్యం కలిగిన తనలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి అవసరమైన సాయం చేయకుంటే సమాజం బాగుపడదనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన వివరించారు.
వాషింగ్టన్, సెప్టెంబర్ 16: సమాజం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కష్టపడే తత్వం, మంచి బుద్ది, జ్ఞానం, సరిపడినంత ధనం, ధైర్యం కలిగిన తనలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి అవసరమైన సాయం చేయకుంటే సమాజం బాగుపడదనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన వివరించారు.
అమెరికాలోని అర్వింగ్‌లో డాలస్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తన విజయం కోసం ఎంతో మంది కృషి చేశారన్నారు. అందుకే ఈ విజయం తనది కాదని.. ఇది అందరి విజయమని ఆయన అభివర్ణించారు.
ప్రతీ సోమవారం నుండి శుక్రవారం వరకు తాను ఢిల్లీలో ఉంటానని తెలిపారు. శని, ఆదివారాల్లో మాత్రం గుంటూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తాను శక్తి మేర ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తన కార్యాలయం https://www.mygunturmp.in/ పేరిట ఒక వెబ్ సైట్‌ను రూపొందించిందన్నారు. ఎవరికీ ఏ సమస్య ఉన్నా.. ఈ వెబ్‌సైట్ ద్వారా అర్జీ సమర్పించాలని ప్రజలకు ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆ అర్జీని పరిశీలించి పరిష్కరించేందుకు తన కార్యాలయ సిబ్బంది తోడ్పడతారని ఆయన పేర్కొన్నారు.
ఎన్నారైల సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 3 మాసాల్లోనే ప్రభుత్వ పని తీరుతోపాటు అధికారుల పని తీరును సైతం ఆకళింపు చేసుకునే అవకాశం తనకు దొరికిందన్నారు. టెలీ కమ్యూనికేషన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతుందని ఆయన తెలిపారు.
అలాగే యూఎస్‌లో పెమ్మసాని చంద్రశేఖర్‌తో తమకున్న అనుబంధాన్ని ఆయన మిత్రులు డా. పూదోట సునీత, డా. కోటి నడింపల్లి, చంద్ర నాగినేని, శ్రీధర్ పత్తిపాటిలు పంచుకున్నారు. ఈ ఆత్మీయ అభినందన సభలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం చివరిలో ఘట్టమనేని సింధూజ శిష్య బృందం చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.