NRI: సింగపూర్‌లో కిరణ్ ప్రభ దంపతులు.. ఆహ్లాదకరంగా ముఖాముఖీ కార్యక్రమం..
ABN , Publish Date - Dec 18 , 2024 | 09:45 PM
ప్రముఖ టాక్ షో ప్రయోక్త కిరణ్ ప్రభ సింగపూర్‌లో సందడి చేశారు. సింగపూర్‌కు చెందిన శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ దంపతులతో ఇష్టాగోష్టి, ఆత్మీయ అభినందన సమావేశం జరిగింది. స్థానిక సరిగమ బిస్ట్రో రెస్టారెంట్, లిటిల్ ఇండియాలో బుధవారం మధ్యాహ్నం ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది.
ప్రముఖ టాక్ షో ప్రయోక్త కిరణ్ ప్రభ సింగపూర్‌లో సందడి చేశారు. సింగపూర్‌కు చెందిన శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ దంపతులతో ఇష్టాగోష్టి, ఆత్మీయ అభినందన సమావేశం జరిగింది. స్థానిక సరిగమ బిస్ట్రో రెస్టారెంట్, లిటిల్ ఇండియాలో బుధవారం మధ్యాహ్నం ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కిరణ్ ప్రభ మాట్లాడారు. సమయాభావం వల్ల ఒక్క 12 గంటలు మాత్రమే సింగపూరులో అవకాశం దొరికినా, అందరూ ఆఫీసులకు వెళ్ళే వారం మధ్యలో సమయం అయినా కూడా అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
కౌమిది వెబ్ మాగజైన్ మొదలు పెట్టి 17 సంవత్సరాలుగా నడుపుతున్నామని అన్నారు. దాదాపు 1300 టాక్ షోలను కూడా నిర్వహించామన్నారు. ఒక్క తెలుగు భాషలో తప్ప వేరే ఏ భాషలో కూడా ఇన్ని విభిన్న రంగాలను ఎంచుకుని రకరకాల సబ్జక్ట్ లలో ఒక్క మనిషి ఇన్ని టాక్ షోలను చేసింది లేదని తెలిపారు. ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా, తెలుగు భాష మీద అభిమానంతో మాత్రమే చేస్తున్న కార్యక్రమం అని వివరించారు. ఎంతో మంది వింటున్న కార్యక్రమం కాబట్టి మాట్లాడే ప్రతి పదం నిజ నిర్ధారణతో, ఖచ్చితత్వం ఉండేలా చూసుకుంటానని వివరించారు. ఇక, కౌముది పత్రిక నిర్వహణలో భార్య కాంతి కిరణ్ సహాయ సహకారాలను కొనియాడారు. ఆ తర్వాత ఆ కార్యక్రమానికి వచ్చిన ఆహుతుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
సుబ్బు వి పాలకుర్తి నిర్వహించిన ఈ కార్యక్రమములో, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ.. ``కిరణ్ ప్రభతో గత 3 సంవత్సరాలుగా పరిచయం ఉన్నప్పటికీ వారిని సింగపూర్ లో ఇలా ఇష్టాగోష్టి కార్యక్రమములో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు వారిని పరిచయం చేసిన తానా సాహిత్య సంఘం అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ కి ధన్యవాదములు. వర్కింగ్ డే అయినా 30 మందికి పైగా ఈ కార్యక్రమములో పాల్గొనడం అది కేవలం కిరణ్ ప్రభ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం`` అని అన్నారు.
ఈ కార్యక్రమములో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు జవహర్ చౌదరి, రంగా రవికుమార్, సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ, శంకర్ వీరా, ధనుంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రామాంజనేయులు చామిరాజు, పాతూరి రాంబాబు, సునీల్ రామినేని, కోణాళి కాళీ కృష్ణ సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, సాంకేతిక సహకారం అందించారు. 30 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమములో పాల్గొన్న అతిథులందరికి సరిగమ బిస్ట్రో రెస్టారంట్ వారు భోజనాలు ఏర్పాటు చేశారు.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..