RamojiRao: దివికేగిన అక్షరయోధుడు.. రామోజీరావుకు జీడబ్ల్యూటీసీఎస్, తానా నివాళి
ABN , Publish Date - Jun 09 , 2024 | 06:01 PM
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం, తానా సంయుక్తంగా ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతిపట్ల నివాళులు అర్పించాయి.
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం, తానా సంయుక్తంగా ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Cherukuri RamojiRao) మృతిపట్ల నివాళులు అర్పించాయి. రామోజీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరాయి. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్ (GWTCS) అధ్యక్షులు కృష్ణ లాం మాట్లాడుతూ అక్షరాన్ని ఆయుధంగా మలిచి, సమాజాన్ని చైతన్యపరచి ప్రశ్నించే, పోరాడేతత్వాలను బోధించారని అన్నారు. ప్రతి అక్షరాన్ని ప్రజాపక్షం చేసి అరాచక, నిరంకుశ శక్తులపై అలుపెరుగని పోరాటం చేసి ఒక చారిత్రక విజయాన్ని అందించారని కొనియాడారు.
గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ అనేక రంగాల్లో చారిత్రక విజయాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిన రామోజీరావు, ఎన్టీఆర్‌లకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతి పేరు పెట్టడం వెనుక ఆయన ప్రేరణ ఉందని అన్నారు. అమరావతే రాజధాని అంటూ రైతులు చేపట్టిన ఉద్యమానికి తన కలాన్ని, గళాన్ని వినిపించి బాసటగా నిలిచారని అన్నారు. రామోజీ, అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలను రాజధాని నడిబొడ్డులో పెట్టాలని, ఒక ప్రాంతానికి రామోజీరావు పేరు పెట్టాలని తీర్మానించారు.
తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ చింతా మాట్లాడుతూ రామోజీరావు తెలుగువారు కావటం మనందరికీ గర్వ కారణమని అన్నారు. కాలుమోపిన ప్రతి రంగంలో ఆయన విజయ సూత్రం కృషి, క్రమశిక్షణతో కూడిన కార్యాచరణ అని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని భాను మాగులూరి సమన్వయ పరిచారు. సురేఖ చనుమోలు, శ్రీనివాస్ చావలి, రమాకాంత్ కోయ, సుధీర్ కొమ్మి, రవి అడుసుమిల్లి, సుశాంత్ మన్నే, ఉమాకాంత్, చక్రవర్తి పయ్యావుల, రమేష్ అవిర్నేని, వీర్రాజు, సీతారామారావు, రమేష్ గుత్తా, మురళి, ప్రభు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Latest NRI News and Telugu News