IND vs AUS: తెలుగు కుర్రాడికి బంపర్ ఆఫర్.. ఏకంగా టెస్టుల్లోకి ఎంట్రీ
ABN , Publish Date - Oct 23 , 2024 | 12:51 PM
ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం మరో ఇద్దరు ఆల్ రౌండర్ల కోసం బీసీసీఐ గాలిస్తోంది. వీరిలో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తో పాటు మరో తెలుగు తేజం పేరు కూడా బలంగా వినిపిస్తోంది.
ముంబై: న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ముగియగానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనకు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. నవంబర్ 8 నుంచి ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు నితీశ్‌ను పక్కనపెట్టి, ఆసీస్ పర్యటనలో భారత్-ఏ తరఫున బరిలోకి దించనున్నట్టు సమాచారం. దీంతో మన తెలుగోడికి టెస్టుల్లో ఏమేరకు ప్రాధాన్యం ఇస్తారనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.
పాండ్యా నో అంటే..
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కొంతకాలంగా రెడ్ బాల్ ప్రాక్టీస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం కొన్ని వైరల్‌గా మారాయి. కానీ, పాండ్యా ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనుభవం తక్కువ కావడం వల్ల అతడు అందుబాటులో ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. అందుకే ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం మరో ఇద్దరు ఆల్ రౌండర్ల కోసం బీసీసీఐ గాలిస్తోంది. వీరిలో నితీశ్ రెడ్డితో పాటు మరో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు తర్వాత శార్దూల్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28వ తేదీన ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది.
అతడే బెస్ట్ ఆప్షన్..
విశాఖపట్నానికి చెందిన నితీశ్ దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రా క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి సత్తా చాటాడు. 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో నితీశ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి ‘పేస్ ఆల్‌రౌండర్’ పాత్రకు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా Aతో తలపడబోయే భారత్ A జట్టుకు అతడు ఎంపికయ్యాడు. మీడియం పేస్‌తోపాటు మిడిలార్డర్‌లో మంచి ఆటతీరు కనబరుస్తూ మేనేజ్‌మెంట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. హార్దిక్ పాండ్య, శార్దూల్ పటేల్ వంటి వారు ఈ పర్యటనలో లేకుంటే వారి స్థానంలో నితీశ్ కుమారే బెస్ట్ ఆప్షన్ అని అంతా భావిస్తున్నారు.130 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్ లోనూ నితీశ్ కు మంచి నైపుణ్యం ఉండటంతో నితీశ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.