బేరసారాల బదిలీలు....!
ABN , Publish Date - Dec 15 , 2024 | 10:30 PM
నేను.. ఫలానా జిల్లాలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. నేను ఈ జిల్లాకు మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడ పనిచేసే వారు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించండి... అంటూ కొందరు ఉపాధ్యాయులు వాట్సాప్‌లో పోస్టులు పెడుతున్నారు. జీవో 317తో నష్టపోయిన ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వడంతో ఆశావహుల్లో ఆనందం నెలకొంది.

మంచిర్యాల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): నేను.. ఫలానా జిల్లాలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. నేను ఈ జిల్లాకు మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడ పనిచేసే వారు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించండి... అంటూ కొందరు ఉపాధ్యాయులు వాట్సాప్‌లో పోస్టులు పెడుతున్నారు. జీవో 317తో నష్టపోయిన ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వడంతో ఆశావహుల్లో ఆనందం నెలకొంది. తమకు నచ్చిన ప్రదేశం నుంచి ఎవరైనా మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్‌కు అంగీకారం తెలిపితే తగిన నజరానా అందిస్తామని కొందరు ఉపాధ్యాయులు రాయబేరాలు సాగిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. పనిలో పనిగా.. కొందరు ఉపాధ్యా యులే దళారుల అవతారం ఎత్తి, ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చి కమీషన్ జేబులో వేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
జీవో నెంబరు 317 నష్టపోయిన ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో పరస్పర బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల మధ్య బేరాలు కుదురుతున్నాయి. జీవో 317లో స్థానికతను కాకుండా సీనియారిటీ పరిగణనలోకి తీసుకొని జిల్లాలు కేటాయించడంతో అప్పుడు సీనియర్లు కోరుకున్న సొంత జిల్లాల్లో కొనసాగుతుండగా, జూనియర్ ఉపాధ్యాయులు ఇతర జిల్లాలు, మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవోలు 243 (స్పౌజ్), 244 (మెడికల్), 245 (పరస్పర) బదిలీ లకు ఈనెల 30 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యా యులు బేరాలు కుదుర్చుకుంటున్నట్లు వివిధ ఉపా ధ్యాయ సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న మెసేజ్‌లను బట్టి తెలుస్తోంది.
చేతులు మారనున్న కోట్లాది రూపాయలు
2022లో జరిగిన పరస్పర బదిలీల తరహాలోనే ఇప్పుడు కూడా పెద్ద మొత్తంలో చేతులు మారనున్నట్లు విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. అప్పుడు నిర్వహించిన పరస్పర బదిలీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు చేతులు మారగా, ప్రస్తుతం అంతకంటే ఎక్కువ మొత్తంలో ముట్టజెప్పేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆనాడు గరిష్టంగా మంచిర్యాల జిల్లాలో బదిలీకి రూ.10 లక్షలు పలుకగా, ఇప్పుడది రూ.15 లక్షల వరకు చేరుకునే అవకాశాలు న్నట్లు ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2017 డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు వారి సొంత జిల్లాలకు తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపుతుండటం, స్పౌజ్ కేటగిరీల్లో అవకాశం దొరకని పరిస్థితి ఉన్నవారు పరస్పర బదిలీలకు ప్రయత్నాలు ప్రారంభించడంతో ఈసారి అధిక డిమాండ్‌కు తెరలేచినట్లు ప్రచారం జరుగుతోంది.
డీఈవో కార్యాలయాలే అడ్డాలు....?
పరస్పర బదిలీలకు బేరాలు కుదుర్చుకునేందుకు డీఈవో కార్యాలయాలే అడ్డాలుగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న పోస్టులను చూస్తున్న ఆశావహులు డీఈవో కార్యాల యాల వద్దకు వస్తే ఓ మాట మాట్లాడు కుందామని ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది సైతం బదిలీలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆశావహుల మధ్య మధ్యవర్తిత్వం జరుపుతూ కమీషన్లను మాట్లాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మంచిర్యాల, నిర్మల్‌కు డిమాండ్....
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలకే పరస్పర బదిలీల డిమాండ్ అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లాకు స్పౌజ్, మెడికల్, పరస్పర బదిలీలకు సుమారు 150 మందికిపైగా ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోను న్నట్లు సమాచారం. నిర్మల్ జిల్లాకు కూడా పెద్ద సంఖ్య లోనే దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో ఉన్న వివిధ ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో ఆశావహులు, వారి వివరాలను పోస్టు చేస్తున్నారు. వారు ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లాలో, అందుకు అనుగుణంగా ఉన్న వారి వివరాలను తెలు సుంటూ వారికి నేరుగా ఫోన్లు చేస్తున్నారు. మరికొందరైతే తాము ఏ జిల్లాలకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, తమకే నేరుగా ఫోన్ చేసి లేదా కలిసి మాట్లాడుకోవాలని వాట్సాప్ గ్రూపుల్లోనే పోస్టులు పెడుతున్నట్లు తెలుస్తోంది.
రిటైర్‌మెంట్ దగ్గరలో ఉన్నవారి ఆసక్తి....
పరస్పర బదిలీలకు ముఖ్యంగా ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నవారు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరో యేడాది, రెండేళ్లలో ఉద్యోగ విరమణ పొందనున్న కొందరు ఉపాధ్యాయులు ఫోన్లు చేస్తూ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. స్పౌజ్, మెడికల్ కేటగిరీల్లో తగినన్నీ పోస్టులు లేకపోవడంతో పరస్పర బదిలీలకే ఉపాధ్యాయులు ఎక్కువగా ఆసక్తి చూపుతు న్నట్లు సమాచారం. రిటైర్‌మెంట్ దగ్గరలో ఉన్నందున ఆసిఫాబాద్ లాంటి జిల్లాకు వెళ్లేందుకు కూడా సిద్ధపడు తున్నట్లు సమాచారం. రిటైర్‌మెంట్ దశలో మంచిర్యాల లాంటి ప్రాంతాన్ని వదిలితే పెద్ద మొత్తంలో గిట్టుబాటయ్యే అవకాశాలు ఉండటంతో ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.