ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య
ABN , Publish Date - Dec 07 , 2024 | 10:50 PM
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య అందిస్తున్నట్లు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఇందారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు కష్టపడి కాదు, ఇష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

జైపూర్, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య అందిస్తున్నట్లు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఇందారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు కష్టపడి కాదు, ఇష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఉపాధ్యాయలు బోధిస్తున్న తీరు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం ఎలా ఉంది అని వాకబు చేశారు. పాఠశాలలో ఏవైనా సమస్యలున్నాయా, వసతులపై ఆరా తీశారు. అనంతరం పాఠశాలలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టాయిలెట్లు, సైన్స్‌ల్యాబ్, తరగతి గదులు, మధ్యాహ్న భోజన పథకం అమలు, వంటశాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులతో కరచాలనం చేసి ఓటమి, గెలుపులు సహజమని, వాటిని పట్టించుకోకుండా క్రీడల్లో భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా విద్యాధికారి యాదయ్య, మండల విద్యాధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సుమన్ ఉన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి
భీమారం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను సందర్శించారు. మూత్రశాలలు, పాఠశాలల పరిసరాలను, తాగునీటి వసతిని పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో పాఠాలను బోధించాలని సూచించారు. మండలానికి జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యాశాఖ చైర్మన్‌కు యువకులు విన్నవించారు. డీఈవో యాదయ్య, సెక్టోరియల్ అధికారులు సత్యనారాయణమూర్తి, చౌదరి, ఇన్‌చార్జీ హెచ్‌ఎం శ్రీనివాస్, తిరుపతి ఉన్నారు.
విద్యార్థులతో మాట్లాడిన మురళి
కోటపల్లి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి శనివారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, కళాశాల, బాలికల హాస్టల్, కేజీబీవీ పాఠశాలలను సందర్శించారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. ముందుగా మోడల్ స్కూల్‌కు వచ్చిన ఆయన పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య, హాజరు శాతంపై వివరాలు నమోదు చేసుకున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై పాఠశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్‌తోపాటు ఉపాధ్యాయులను అడిగారు. అదనపు గదులు, ల్యాబ్ సమస్యలను విద్యా కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్ళారు. 6వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులతో ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి పాఠ్యాంశాన్ని చదివించారు. బేస్‌లైన్ టెస్టులు పెట్టాలని ఆదేశించారు. విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని, 7వ తరగతి విద్యార్థులకు సైతం పదో తరగతి మాదిరిగానే పరీక్షలు పెట్టాలని, ఉత్తీర్ణులు కానట్లయితే మరో రెండు నెలలు ప్రత్యేకంగా బోధించి పరీక్షలు పెట్టి ఉత్తీర్ణత సాధించాకే పై తరగతులకు పంపిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం బాలికల హాస్టల్‌ను పరిశీలించిన ఆయన విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. కేజీబీవీ పాఠశాలను సందర్శించిన 6వ తరగతి విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. డీఈవో యాదయ్య, డీఐఈవో అంజయ్య, సెక్టోరల్ అధికారులు చౌదరి, సత్యనారాయణమూర్తి, మోడల్ స్కూల్‌ప్రిన్సిపాల్ రాజశేఖర్, ఎంఈవో వెంకటేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.