KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!
ABN, Publish Date - Aug 06 , 2024 | 03:48 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆ పార్టీ అధినాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు
వారికి ప్రజా క్షేత్రంలోనే బుద్ధి చెబుతాం: కేటీఆర్
ఢిల్లీ న్యాయ నిపుణులతో బీఆర్‌ఎస్ బృందం భేటీ
హైకోర్టులో ఆలస్యమైతే సుప్రీంకెళ్లొచ్చని సూచన
కవిత బెయిల్ పిటిషన్‌పై
విచారణ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆ పార్టీ అధినాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామన్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో మకాం వేశారు. గతంలో ఒకసారి హరీశ్‌రావుతో కలిసి ఢిల్లీకి వచ్చి మూడు రోజులు న్యాయ నిపుణులతో చర్చించారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఢిల్లీ వేదికగానే న్యాయ పోరాటం చేస్తామని గత నెల 9న మీడియాతో చెప్పారు. త్వరలోనే మళ్లీ ఢిల్లీ వచ్చి రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తామని కేటీఆర్ తెలిపారు. చెప్పినట్లుగానే నెల రోజులు తిరక్కముందే మరోసారి ఢిల్లీ వచ్చారు. ఈ సారి కేటీఆర్‌తోపాటు హరీశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్‌రావు ఉన్నారు. శనివారం సాయంత్రమే ఢిల్లీకి వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు ఆది, సోమవారాలు పూర్తిగా ఎమ్మెల్యేల ఫిరాయింపులపైనే దృష్టి కేంద్రీకరించారు.
అందులో భాగంగానే సోమవారం రాజ్యాంగ నిపుణులు చెట్పట్ ఆర్యమా సుందరాన్ని కలిశారు. మణిపూర్‌కు సంబంధించిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని ఆర్యమా సుందరం బీఆర్‌ఎస్ బృందానికి తెలిపారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఎక్కువకాలం నాన్చలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు స్పీకర్‌కు చేసిన ఫిర్యాదు, సంబంధిత పత్రాలను బీఆర్‌ఎస్ నేతలు న్యాయ నిపుణులకు అందించారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో తప్పనిసరిగా ఉప ఎన్నికలు వస్తాయన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామన్నారు.
Updated Date - Aug 06 , 2024 | 03:48 AM