ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు,,

ABN, Publish Date - Jun 29 , 2024 | 02:50 AM

కాంగ్రెస్‌ పార్టీ బీ ఫామ్‌ మీద గెలిచిన వారికే క్యాబినెట్‌ మంత్రి పదవులు దక్కుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ ఒకేసారి ఉంటాయని, వాటిపై చర్చలు జరుగుతున్నాయని, ఆ రెండు అంశాలకు సంబంధించి పేర్లతో కూడిన జాబితాను అధిష్ఠానానికి అందించామని చెప్పారు.

  • పాతబస్తీ విద్యుత్తు బిల్లుల వసూలు అదానీకి..

పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూలు బాధ్యతను అదానీ కంపెనీకి అప్పగించాం. అక్కడ భూగర్భ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరాం. కేంద్రం ఆస్తులను కారుచౌకగా అదానీకి అప్పగించడాన్నే రాహుల్‌ తప్పుపడుతున్నారు. అంతేతప్ప అదానీతో వ్యాపారం చేయొద్దని ఎప్పుడూ అనలే. అదానీ దగ్గర డబ్బులున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నాడు. అందుకే ఆహ్వానించా. - సీఎం రేవంత్‌

  • పార్టీ బీ ఫాంపై గెలిచిన వారికే చోటు

  • పీసీసీ చీఫ్‌ నియామకం, విస్తరణ ఒకేసారి

  • 3, 4 రోజుల్లో రుణ మాఫీ మార్గదర్శకాలు

  • అసెంబ్లీ తర్వాతే రైతు బంధు, పింఛన్ల పెంపు

  • మళ్లీ సీఎం అవుతానని కేసీఆర్‌ కలలు!

  • అందుకే విద్యుత్తు కమిషన్‌పై ఆ విమర్శలు

  • ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్‌

  • కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాలె యాదయ్య

  • ఢిల్లీలో పార్టీ కండువా కప్పిన ఆహ్వానించిన సీఎం

న్యూఢిల్లీ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ బీ ఫామ్‌ మీద గెలిచిన వారికే క్యాబినెట్‌ మంత్రి పదవులు దక్కుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ ఒకేసారి ఉంటాయని, వాటిపై చర్చలు జరుగుతున్నాయని, ఆ రెండు అంశాలకు సంబంధించి పేర్లతో కూడిన జాబితాను అధిష్ఠానానికి అందించామని చెప్పారు. సామాజిక సమీకరణలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని, పీసీసీ చీఫ్‌ మహిళ కావచ్చు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కావచ్చునని వ్యాఖ్యానించారు. అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్‌ పదవి మహిళకు ఇస్తే బాగుంటుంది కదా!? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. మీరు అడిగారని అధిష్ఠానానికి చెబుతానులే అని నవ్వుతూ బదులిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్‌ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘మూడు, నాలుగు రోజుల్లో రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేస్తాం.


రెండు లక్షలలోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తాం. రుణమాఫీకి రేషన్‌ కార్డుకు సంబంధం లేదు. పాస్‌ పుస్తకం ఉంటే సరిపోతుంది’’ అని స్పష్టత ఇచ్చారు. తమ తొలి ప్రాధాన్యం రుణ మాఫీ అని, అసెంబ్లీ తర్వాత రైతు బంధు అమలు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత పింఛన్‌ పెంపు చర్యలు చేపడతామన్నారు. ‘‘కల్వకుర్తి ఏరియాలో నేషనల్‌ హైవే భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. దీనిపై సబ్‌ కమిటీ వేశాం. అది సమగ్ర నివేదిక ఇచ్చిన తర్వాత అసెంబ్లీ చర్చిస్తాం. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా చూడాలనేదే మా ఉద్దేశం’’ అని వివరించారు. రైతుబంధు కింద రూ.75 వేల కోట్లు ఇచ్చానని కేసీఆర్‌ చెబుతున్నారని, అందులో రూ.25 వేల కోట్లు అనర్హులకే ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారని, సంక్షేమం అనేది పేదలకు, మధ్య తరగతికి చెందాలని, కానీ, ఫాంహౌజ్‌లో ఉన్నోళ్లకూ రైతు బంధు ఇచ్చారని తప్పుబట్టారు.


కక్ష సాధించను

ఫిరాయింపులు ఒక్క తెలంగాణలోనే ప్రత్యేకం కాదని, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు ఫిరాయించారని, నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీ విలీనం చేసుకుందని సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. ‘‘అధికారాలను దుర్వినియోగం చేయను. కక్షసాధింపు చర్యలకు పాల్పడను. అధికారులతో సమర్థంగా పని చేయించుకుంటాను. డీజీపీని కూడా నేను మార్చలేదు. కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది’’ అని వివరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై విచారణ జరుగుతోందని, దర్యాప్తు చేసిన తర్వాత నిజానిజాలన్నీ కోర్టులకే చెప్పాలని అధికారులకు సూచించానని తెలిపారు. ధరణిపై అధ్యయనం తర్వాత అసెంబ్లీలో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.


జిల్లాలను తగ్గిస్తామని చెప్పలేదు

కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని లేదా జిల్లాలను తగ్గిస్తామని తాను చెప్పలేదని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ‘‘మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల డీలిమిటేషన్‌పై సుప్రీం కోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ వేస్తానని చెప్పాను. సదరు నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిపి నిర్ణయాలు తీసుకుంటాం. అంతే తప్ప.. జిల్లాలను కుదిస్తానని నేను చెప్పలేదు. అలాగే, జిల్లాలను పెంచుతానని కూడా చెప్పలేదు’’ అని వివరించారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలు పెద్దగా, మరికొన్ని చిన్నగా ఉన్నాయని, వాటిని హేతుబద్ధీకరించినప్పుడు పెరగొచ్చు.. తగ్గొచ్చునని వ్యాఖ్యానించారు. మండలాలను ఇష్టానుసారంగా విభజించారని, చిన్న పల్లెలను కూడా కేసీఆర్‌ రెవెన్యూ డివిజన్‌ చేశారని, మండల కేంద్రానికి ఒక ప్రాతిపదిక లేదని, వీటిపై బడ్జెట్‌ సమావేశాల్లో చర్చ పెడతామని తెలిపారు.


కాళేశ్వరంతో ఆర్థిక నష్టమే

‘‘కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆర్థిక నష్టమే. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడాం. ఆలోపే ఎన్నికలు వచ్చాయి. మరోసారి చర్చించాలి’’ అని సీఎం రేవంత్‌ తెలిపారు. కాళేశ్వరం లక్షన్నర కోట్ల రూపాయల ప్రాజెక్టు అని, ఇప్పటికే లక్ష కోట్లు ఖర్చు పెట్టారని, ఇంకో యాభై వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు.


వడ్డీల భారాన్ని తగ్గించే పనిలో పడ్డాం

‘‘తెలంగాణ అప్పు రూ.7 లక్షల కోట్లు. మరికొన్ని చిన్నా చితకా రుణాలు కలిపితే ఇంకో లక్ష కోట్లు ఉంటుంది. మొత్తం కలిపితే రూ.8 లక్షల కోట్ల అప్పు. శ్వేతపత్రంలో ఆ లక్ష కోట్లు పెట్టలేదు. గత ప్రభుత్వం 7 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు తెచ్చింది. అందుకే ఇప్పుడు రుణ భారం తగ్గేలా రుణాల వడ్డీని తగ్గించుకునే పనిలో పడ్డాం. ఒక్క శాతం వడ్డీ తగ్గినా రూ.700 కోట్లు ఆదా అవుతుంది. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నాం’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. అప్పులు తీసుకొచ్చి ఆస్తులు కల్పించానని కేసీఆర్‌ చెబుతున్నారని, కానీ, వాస్తవంలో అవి ఎక్కడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చినప్పుడు అప్పులకు వడ్డీలుగా ఏడాదికి రూ.6,500 కోట్లు చెల్లించేవాళ్లమని, పదేళ్ల కేసీఆర్‌ పాలన తర్వాత నెలకు రూ.7000 కోట్లు కట్టాల్సి వస్తోందని తెలిపారు.


కేంద్ర బడ్జెట్‌ పెట్టిన వెంటనే రాష్ట్ర బడ్జెట్‌

జూలై చివరి వారంలో కేంద్ర బడ్జెట్‌ ఉండే అవకాశం ఉందని, కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే రాష్ట్ర బడ్జెట్‌ పెట్టాలని అనుకుంటున్నామని సీఎం రేవంత్‌ తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు పరిశీలించిన తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ‘‘ప్రజలను మభ్యపెట్టేలా కాకుండా వాస్తవికతతో కూడిన బడ్జెట్‌ పెడతాం. ఒకప్పుడు బడ్జెట్‌లో రాబడి, వ్యయానికి మధ్య వ్యత్యాసం 5 శాతం మాత్రమే ఉండేది. కానీ, కేసీఆర్‌ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అంచనాలకు, రాబడికి మధ్య 30 శాతం వ్యత్యాసం ఉండేది. పేపర్లలో బడ్జెట్‌ భారీగా ఉండేది. కానీ, వాస్తవం వేరేలా ఉండేది. అందుకే, మేం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన బడ్జెట్‌ పెట్టాలని అధికారులకు సూచించా. గత బడ్జెట్‌ కూడా అలాగే పెట్టాం. గతంలో కేసీఆర్‌ రూ.2.95 లక్షల కోట్ల బడ్జెట్‌ పెట్టారు. మా అధికారులు రూ.3 లక్షల కోట్లకు మించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తీరా లెక్కలన్నీ చూస్తే రూ.2.60-2.70 లక్షల కోట్ల మధ్యలోనే రాబడి వస్తోంది. అందుకే, రూ.2.75 లక్షల కోట్ల బడ్జెట్‌ పెట్టాం. ఈసారి కూడా అలాగే వాస్తవికతకు దగ్గరలోనే ఉంటుంది’’ అని వివరించారు. కేంద్ర బడ్జెట్‌ కంటే ముందే వినతులు ఇస్తే ఫలితం ఉంటుందని వరుసగా మంత్రులను కలుస్తున్నామని, వినతులు ఇస్తున్నామని, ప్రధాని, హోం మంత్రిని తప్ప మిగిలిన అందరినీ కలిశామని చెప్పారు.


ఉచిత బస్సుతో రాష్ట్రానికి రాబడి పెరిగింది

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్రానికి రాబడి పెరిగిందని, దేవాలయాల వంటి వాటికి ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్‌ చెప్పారు. ‘‘మహిళలకు ఉచిత బస్సుతో ఆర్టీసీకి మేలు జరిగింది. లాభం వస్తోంది. నెలకు రూ.350 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తున్నాం. తద్వారా, నో లాస్‌, నో ప్రాఫిట్‌ స్థితికి తీసుకు రాగలిగాం. గతంలో జీతాలకు దిక్కులు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది’’ అని వివరించారు. కొన్ని రోజుల్లోనే ఆర్టీసీ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.


కేసీఆర్‌ కలలు కంటున్నారేమో

‘‘మళ్లీ నేను ముఖ్యమంత్రి అవుతానని కేసీఆర్‌ కలలు కంటున్నాడేమో. ఆయన చెప్పినట్టే జరుగుతుందని అనుకుంటున్నాడేమో? అందుకే విద్యుత్తు కమిషన్‌ పట్ల అలా వ్యవహరిస్తున్నాడు’’ అని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. మీకు చేతనైతే కమిషన్‌ వేసి విచారించాలని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి అడిగారని, అట్లనే కమిషన్‌ వేశామని, దాని పని అది చేసుకు వెళుతుంటే.. దానిని రద్దు చేయాలని కేసీఆర్‌ అంటున్నారని తప్పుబట్టారు. రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేవని, కావాల్సినంత విద్యుత్తు కొనుగోలు చేస్తున్నామని, అనివార్యమైన అంతరాలు, మెయింటినెన్స్‌ పనుల కారణంగా సరఫరాలు అంతరాయం వస్తూ ఉండవచ్చని వివరించారు.


ఉభయ సభల ప్రొరోగ్‌.. గవర్నర్‌ ఉత్తర్వులు

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాలను గవర్నర్‌ రాధాకృష్ణన్‌ ప్రొరోగ్‌ (నిరవధిక వాయిదా) చేశారు. ఈమేరకు రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు. శాసనసభ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు, శాసన మండలి 9 నుంచి 15వ తేదీ వరకు ఐదు రోజుల పాటు భేటీ అయ్యాయి. అనంతరం వాయిదా పడ్డాయి. మళ్లీ ఆరు నెలల్లోప తదుపరి సమావేశాలను ప్రారంభించాలంటే ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేయాల్సి ఉంటుంది. ఈ దృష్ట్యా ఫిబ్రవరిలో జరిగిన ఉభయసభల సమావేశాలను 27 నుంచి ప్రొరోగ్‌ చేస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటించారు.

Updated Date - Jun 29 , 2024 | 05:17 AM

Advertising
Advertising