Share News

Telangana : కేసీఆర్‌ను విచారించాలి

ABN , Publish Date - May 29 , 2024 | 03:45 AM

‘‘మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కేసీఆర్‌ అంగి, లాగు చించుకుని రోడ్డుమీద తిరుగుతూ ఏం చెప్పినా పట్టించుకోను. సాంకేతిక నిపుణుల సలహా మేరకే మరమ్మతుల విషయంలో ముందుకు వెళతాను. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేసీఆర్‌ అనాలోచితంగా ఎందుకు వ్యవహరించారో తెలియదు.

Telangana : కేసీఆర్‌ను విచారించాలి

ఆయనకు లై డిటెక్టర్‌ పరీక్షలూ చేయాలి

అప్పుడే కాళేశ్వరం విషయాలు బయటకొస్తాయి

జ్యుడీషియల్‌ విచారణ ఆ 3 బ్యారేజీలకే పరిమితం

ఫోన్‌ ట్యాపింగ్‌ను పట్టించుకుంటే కక్షసాధింపు అంటారు

దీనిపై వాళ్లు సీబీఐ విచారణను డిమాండ్‌ చేయట్లేదేం!?

రాష్ట్ర చిహ్నంలో రాచరికానికి చెందిన గుర్తులు ఉండవు

రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యత పూర్తిగా అందెశ్రీదే

కీరవాణి విషయాంలోనూ పూర్తిగా ఆయన ఇష్టప్రకారమే

ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠి సందర్భంగా సీఎం రేవంత్‌

మట్టి నాణ్యత పరీక్షలు ఒకచోట చేసి.. మేడిగడ్డ బ్యారేజీని మరోచోట కట్టారు. ఈ విషయాలేవీ రికార్డుల్లో లేవు. బ్యారేజీల దగ్గర భూమిలో ఏముందో పరీక్షలు జరిపితే తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి.

జ్యుడీషియల్‌ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకే పరిమితం. ప్రాజెక్టుల నిర్మాణ అంచనాలను గత సర్కారు పెంచిన తీరుపై దృష్టి పెడితే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగదు. విచారణకు ఆదేశిస్తే పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు చేయించలేం. బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది.

- సీఎం రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘‘మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కేసీఆర్‌ అంగి, లాగు చించుకుని రోడ్డుమీద తిరుగుతూ ఏం చెప్పినా పట్టించుకోను. సాంకేతిక నిపుణుల సలహా మేరకే మరమ్మతుల

విషయంలో ముందుకు వెళతాను. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేసీఆర్‌ అనాలోచితంగా ఎందుకు వ్యవహరించారో తెలియదు.

ఆయనకు లై డిటెక్టర్‌ పరీక్ష చేస్తే తప్ప అసలు విషయాలు బయటికి రావు. ఇందుకు కేసీఆర్‌ను ఇంటరాగేషన్‌ చేయాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

అసెంబ్లీకి వచ్చి ఈ విషయాలు చెబుతారేమోనని అనుకుంటే ఆయన రావట్లేదని తప్పుబట్టారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ తీరును తాను పట్టించుకుంటే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే

విమర్శలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావులు సీబీఐ విచారణకు ఎందుకు డిమాండ్‌ చేయట్లేదని ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించడానికి మంగళవారం ఢిల్లీకి వచ్చిన ఆయన.. తుగ్లక్‌ రోడ్‌లోని తన అధికారిక నివాసంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం అక్కడే మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

ఈఎన్‌సీ మురళీధర్‌రావు పోతూ పోతూ అన్ని ఆధారాలనూ పట్టుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకేమైనా ఉంటే ఆయన తన మనుషులతో తెప్పించుకుంటున్నారని, సంబంధిత ఫైళ్లను చింపివేయాలని చెబుతున్నాడని మండిపడ్డారు. తప్పు జరిగిందని చర్యలు తీసుకోబోతే ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు ఒకరినొకరు కాపాడుకుంటున్నారని, ఎవరూ ఏ విషయం చెప్పట్లేదని తప్పుబట్టారు. ‘‘మట్టి నాణ్యత పరీక్షలు ఒకచోట చేసి.. మేడిగడ్డ బ్యారేజీని మరోచోట కట్టారు. ఈ విషయాలేవీ రికార్డుల్లో లేవు. బ్యారేజీల దగ్గర భూమిలో ఏముందో పరీక్షలు జరిపితే తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి’’ అని వెల్లడించారు.


మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, నీళ్లను తాత్కాలికంగా లిఫ్ట్‌ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని పురమాయించానని చెప్పారు. బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలని ఎన్‌డీఎ్‌సఏ అధికారులు చెబుతున్నారని, వాటిని మూస్తే బ్యారేజీలు కూలే పరిస్థితులున్నాయని అంటున్నారని వివరించారు. మేడిగడ్డలో నీళ్లు ఎత్తి అన్నారంలో పోయాలని కేసీఆర్‌ అంటున్నారని, కానీ, అన్నారంలో ఉన్న నీళ్లనే సముద్రంలోకే వదిలేశారని గుర్తు చేశారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసిన తర్వాత అన్నారం గేట్లు ఎత్తితే మళ్లీ మేడిగడ్డకే వస్తాయని చెబుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇప్పటి వరకూ ఎత్తిపోసిన మొత్తం 52 టీఎంసీల నీళ్లను సముద్రంలోకి తిరిగి వదిలారని గుర్తు చేశారు.

మేడిగడ్డ బ్యారేజీలో జరిగింది కేసీఆర్‌ 32 పళ్లలో ఒక పన్ను రాలిపోవడం కాదని, వెన్నెముక విరగడంతో సమానమని అన్నారు. ‘‘జ్యుడిషియల్‌ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకే పరిమితం. ప్రాజెక్టుల నిర్మాణ అంచనాలను గత కేసీఆర్‌ సర్కారు పెంచిన తీరుపై దృష్టి పెడితే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగదు. విచారణకు ఆదేశిస్తే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులు చేయించలేం. బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది’’ అని వ్యాఖ్యానించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ వెలుగులోకి వచ్చిందిలా..

గత ఏడాది డిసెంబరు చివరిలో బదిలీలు చేపట్టామని, ఎస్‌ఐబీలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న అధికారులు కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు, ల్యాప్‌టా్‌పలు మిస్సింగ్‌ అయినట్లు గుర్తించారని, ఆ మేరకు పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన తర్వాత విచారణ సమయంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వెలుగులోకి వచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు తాను పాల్పడబోనని పునరుద్ఘాటించారు. ఐఎ్‌సఐ ఉగ్రవాదులు, దేశరక్షణకు ముప్పు కలిగించే వ్యక్తులపై ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతూ ఉండవచ్చని, ఆ విషయం తనకు తెలియదని చెప్పారు.


హార్డ్‌ డిస్క్‌లు, సర్వర్లను ధ్వంసం చేయడంతో ఉగ్రవాదులకు సంబంధించిన విలువైన సమాచారం పోయిందన్నారు. ఏపీలో వందమంది అధికారులను ఎన్నికల కమిషన్‌ గోడకేసి కొట్టినట్లు చేసిందని, కానీ, తమ ప్రభుత్వ హయాంలో ఆరోపణలకు కూడా తావివ్వలేదని, ఎన్నికల తీరుపై బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు కూడా ఆరోపణలు చేయలేదని వ్యాఖ్యానించారు. గతంలో 100 యూనిట్లు వాడితే ఇప్పుడు 140 యూనిట్ల దాకా విద్యుత్‌ వినియోగం పెరిగిందని రేవంత్‌ తెలిపారు. ఫలితంగా, ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పెరగడం, చెట్లు పడిపోవడంతో విద్యుత్తు సరఫరాలో అవాంతరాలు తలెత్తుతూ ఉండవచ్చని, అంతే తప్ప విద్యుత్తు కోతలు లేవని స్పష్టం చేశారు.


చిహ్నంలో రచరిక గుర్తులుండవు

తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం సహా రాచరికానికి సంబంధించిన గుర్తులేవీ ఉండవని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘రాచరికానికి వ్యతిరేకంగా కొట్లాడిన చరిత్ర తెలంగాణ ప్రజలది. ప్రభుత్వ చిహ్నం తెలంగాణ ప్రజల పోరాటాలు, త్యాగాలను ప్రతిబింబించేలా ఉంటుంది. సమ్మక్క-సారక్క, నాగోబా జాతర, పిల్లలమర్రి వంటివి చిహ్నాలుగా పెట్టేందుకు ఉన్నాయి కదా’’ అని ప్రశ్నించారు.

తెలంగాణ అంటే పోరాటాలు, త్యాగాలకు ప్రతీకని, అంతే తప్ప రాజులు గుర్తుకు రారని చెప్పారు. చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉంటే పాలకుల మనస్తత్వం కూడా అలాగే ఉంటుందని అభిప్రాయపడ్డారు. చిహ్నం రూపకల్పన బాధ్యతను కళాకారులకే వదిలేశానని, అందులో జోక్యం చేసుకోవడానికి తానేమీ 80 వేల పుస్తకాలు చదవలేదని వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్ర గీతాన్ని రూపొందించే బాధ్యతను కవి అందెశ్రీకి వదిలేశాను.


మ్యూజిక్‌ కంపోజింగ్‌ ఎవరితో చేయించుకుంటారో ఆయనిష్టం. కీరవాణి విషయంలో విమర్శలు ఎదుర్కొంటారో, సమర్థించుకుంటారో అందెశ్రీ ఇష్టం. నేనైతే విమర్శించను. సమర్థించను’’ అని రేవంత్‌ తేల్చి చెప్పారు. అందెశ్రీ ఎలా చేయాలో చెప్తే కాళేశ్వరం కథలా తయారవుతుందని చమత్కరించారు.

గీతాన్ని రూపొందించడంలో వంద శాతం నిర్ణయాధికారం అందెశ్రీదేనన్నారు. జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించడమే తన బాధ్యతని, జూన్‌ 2లోపు దానికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశానని తెలిపారు.

అలాగే, తెలంగాణ తల్లి, లోగోను రూపొందించే బాధ్యతలు ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీకి చెందిన వ్యక్తికి ఇచ్చానని, ఆయనది నిజామాబాద్‌ అని తెలిపారు. ఎవరెవరిని కూర్చోబెట్టి పని చేయించుకుంటారో

ఆయనిష్టమన్నారు. ‘‘తెలంగాణ మీడియా చానళ్లలో చాలా వరకు ఉత్తరాది వారిని కెమెరామెన్‌లుగా నియమించుకుంటారు. పోగ్రాంను కవర్‌ చేసేది వాళ్లే కదా’’ అని చమత్కరించారు.

Updated Date - May 29 , 2024 | 03:47 AM