CM Revanth Reddy: చేసి చూపించాం..
ABN, Publish Date - Aug 16 , 2024 | 02:38 AM
‘రుణ మాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా గడ్డపై నుంచి ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపుతామని మేం చెబితే..
2 లక్షల హామీ నెరవేర్చాం.. సిగ్గుంటే రాజీనామా చెయ్ హరీశ్!
ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు మేం సిద్ధం.. మరి మీరు?
కేసీఆర్, కేటీఆర్ , హరీశ్‌లలో ఎవరొస్తారు?
గోదావరి, కృష్ణా నీళ్లతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం
4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తాం
ప్రజలు అండగా నిలిస్తే బీఆర్‌ఎస్, బీజేపీని బొందపెడతాం
ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
భద్రాద్రి జిల్లా పూసుగూడెంలో సీతారామ ప్రారంభం
పాల్గొన్న భట్టి విక్రమార్క, తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి
ఖమ్మం, కొత్తగూడెం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/వైరా: ‘రుణ మాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా గడ్డపై నుంచి ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపుతామని మేం చెబితే.. చేయలేరని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ చేసిండు. మేము మాట నిలబెట్టుకుంటే రాజీనామా చేస్తానని చెప్పిండు. ఇప్పుడు మేం పూర్తిగా మాఫీ చేశాం.. వెంటనే హరీశ్ రాజీనామా చేయాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిగ్గు, శరం లేకుండా విమర్శలు చేస్తున్న హరీశ్.. చీము, నెత్తురు ఉంటే రాజీనామా చేయాలన్నారు. సిద్దిపేటలో మళ్లీ ఎలా గెలుస్తాడో చూస్తామన్నారు.
రాజీనామా చేయకపోతే ఏట్లో దూకాలని.. అప్పుడు సిద్దిపేటకు పట్టిన చీడ, పీడ వదులుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీలను బొందపెట్టడం ఖాయమని.. ఆ సంగతి తాను చూసుకుంటానని, ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీతారామ పంప్‌హౌజ్ మోటార్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో గురువారం ‘సాగుకు జీవం.. రైతుకు ఊతం’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతకుముందు భద్రాద్రి జిల్లా పూసుగూడెంలో సీతారామ పంప్‌హౌజ్‌ను ఆయన ప్రారంభించారు. వైరాలో మాట్లాడుతూ.. ఈ సభలో మొత్తం 2 లక్షలలోపు రుణాలున్న రైతులకు రూ.31 వేల కోట్లు మాఫీ చేసినట్లు ప్రకటించారు. కృష్ణా, గోదావరి జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు.
సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్లయినా ఖర్చుపెట్టి 2026 ఆగస్టు 15 నాటికి పూర్తి ఆయకట్టుకు నీరందిస్తామని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం మోసం చేసిందని, తాము అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలన, కాంగ్రెస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, వ్యయాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, డిప్యూటీ సీఎం భట్టి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ వస్తారని, బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్, బిల్లా-రంగాల్లో ఎవరు వస్తారో తేల్చుకోవాలని సవాల్ చేశారు. ఏ చౌరస్తాలోనైనా, ఏ సెంటర్‌లోనైనా చర్చకు సిద్ధమని పేర్కొన్నారు.
జూలై 18 నుంచి కేవలం 27 రోజుల్లో రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ 8 నెలల్లోనే నెరవేర్చామని వివరించారు. బీఆర్‌ఎస్ దివాళా తీసి బస్టాండ్లలో అడుక్కుతినే స్థాయికి వచ్చినా ఇంకా మారలేదని ధ్వజమెత్తారు. ప్రజలనే దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు, అసత్యాలతో తిరుగుతున్న బిల్లా రంగాలు అవాకులు చవాకులు పేలుతున్నారని, 17 ఎంపీ స్థానాల్లో ఓడిపోయి, ఏడుచోట్ల డిపాజిట్లు రాని బీఆర్‌ఎ్‌సను బంగాళాఖాతంలో బొందపెడదామని పిలుపునిచ్చారు. సర్వాధికారం చెలాయించినవారు నేడు ఫామ్‌హౌజ్‌ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. వారిపై సానుభూతి చూపితే కాల నాగులకు పాలుపోసినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌కు దడవం.. మోదీకి బెదరం
‘‘బీజేపీని 8 లోక్‌సభ స్థానాల్లో గెలిపిస్తే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చింది. ఆ పార్టీని కూడా ప్రజలు బొంద పెట్టడం ఖాయం. కేసీఆర్‌కు దడవం. మోదీకి బెదరం. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలేసి జైలుకు పంపిన, చంటి బిడ్డల తల్లులపై కర్కశంగా పోలీసులతో దాడులు చేయించిన చరిత్ర బీఆర్‌ఎ్‌సది. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందించేందుకు రూ.18 వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే రూ8 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీరందించలేకపోయారు.
మేం 2026 ఆగస్టు 15 నాటికి పూర్తిచేసి 7 లక్షల ఎకరాలకు నీరందిస్తాం. నెల జీతాలు చెల్లించలేని దుస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాం. 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు కల్పించాం. డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. గ్రూప్-1, 2, 3, ఇతర నియామకాల ద్వారా ఈ ఏడాది 65 వేల ఉద్యోగాలు కల్పించబోతున్నాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.
హరీశ్.. అభినందించకున్నా.. అవమానించొద్దు
బీఆర్‌ఎస్ వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న తమను హరీశ్ అభినందించకపోయినా ఫర్లేదని.. అవమానించేలా మాట్లాడొద్దని సీఎం సూచించారు. ప్రాజెక్టులను 80, 60, 40, 20 శాతం పూర్తయినవిగా గుర్తించి ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలిపారు. తాము ఇక్కడికి నీళ్లు చల్లుకోవడానికి రాలేదని, గోదావరి తల్లే తమను నీటితో తడుపుతోందని అన్నారు. హరీశ్ అవసరమైతే సీతారామ జలాలను చల్లుకోవాలని సూచించారు. రాలేకపోతే రెండు సీసాల్లో కేసీఆర్, హరీశ్‌కు పంపాలని మంత్రి తుమ్మలకు సూచించారు. ఆ నీటిని ఎలా కలుకొపుంటారో వారికి తెలుసునని ఎద్దేవా చేశారు.
సీతారామలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 40 శాతం పనులే జరిగాయని, ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదన్నారు. రూ.10 వేల కోట్ల పని ఉండగా 90 శాతం పనులు పూర్తయినట్లు ఎలా చెబుతున్నారని హరీశ్‌ను సీఎం ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏనాడూ నీళ్ల కోసం రోడ్డెక్కని మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియలు ఇప్పుడు ధర్నాలు చేయడం చూస్తుంటే తమ ప్రభుత్వం తప్పకుండా నీళ్లిస్తుందనే నమ్మకం ప్రజల్లో కలుగుతుందన్నారు.
సాగర్ రాకపోయినా ఖమ్మం రైతులకు ఇబ్బంది ఉండదు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ కుటుంబం ఆగం చేసిందని, ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కమీషన్లు దండుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ బాగోతం బయటపడుతుందనే సీతారామకు డీపీఆర్ ఇవ్వలేదన్నారు. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ఎత్తిపోతల పంప్‌హౌజ్ స్విచాన్ చేసి నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో పైలాన్‌ను ఆవిష్కరించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నాగార్జున సాగర్ నీరు రాకపోయినా ఖమ్మం జిల్లా ఆయకట్టుకు ఇబ్బంది లేకుండా గోదావరి జలాలను వైరా జలాశయానికి అనుసంధానం చేశామన్నారు. ఏన్కూర్ లింక్ కెనాల్ పనులను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి, ఉత్తమ్ యుద్ధప్రాతిపధిక పూర్తి చేయించారని ప్రశంసించారు. కేసీఆర్ ప్రాజెక్టులకు రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మాత్రం నీళ్లు ఇవ్వలేకపోయారన్నారు. నాలుగేళ్లుగా పంపుహౌ్‌సకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదన్నారు. కేసీఆర్, హరీశ్ బోగస్ మాటలు చెప్తారు కాబట్టే ఆ పార్టీ నేతలు నీళ్ల కోసం ఆందోళన చేయలేదని ఎద్దేవా చేశారు.
మానస పుత్రిక అంటూ సవతి ప్రేమ చూపారు: భట్టి
సీతారామ ప్రాజెక్టును మానసపుత్రికగా చెప్పుకొంటున్న కేటీఆర్, హరీశ్‌రావులు దశాబ్ద కాలంలో చుక్క నీరు కూడా అందించలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో రూ.వేల కోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయని, ఉత్తమ్‌తో కలిసి చర్చకు వస్తానని, కేసీఆర్, హరీశ్ సిద్ధంగా ఉన్నారా? అని వైరా సభలో సవాల్ విసిరారు. వైఎస్ శంకుస్థాపనలు చేసిన ఇందిరా, రాజీవ్ సాగర్‌ల డిజైన్లు మార్చి మొత్తం ప్రాజెక్టునే కనుమరుగు చేశారని ఆరోపించారు. రూ.22 వేల కోట్లు దోపిడీ చేసేందుకు.. రైతాంగాన్ని మోసం చేశారని మండిపడ్డారు. ఆరోపించారు.
చరిత్ర ఎరుగని రుణమాఫీ ఇది: తుమ్మల
మంత్రి తుమ్మల మాట్లాడుతూ దేశ చర్రితలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒకే పంట కాలంలో నెల వ్యవధిలో ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణ మాఫీ చేసిన చరిత్ర లేదన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రేవంత్, భట్టి పట్టుబట్టి మాఫీ చేసి చూపించారని కొనియాడారు. రూ.2 లక్షలకు పైగా రుణాలున్న రైతులు అదనంగా ఉన్న డబ్బు చెల్లించిన వెంటనే వారికి రుణమాఫీ జరుగుతుందన్నారు. సీతారామ ద్వారా కృష్ణా జలాతో గోదావరి జలాలను అనుసంధానం చేయడం ఖమ్మం జిల్లా రైతుల అదృష్టమని పేర్కొన్నారు. సీతారామను నాలుగు నెలల్లోనే పూర్తి చేయడం కోసం రూ.600 కోట్లు కేటాయించి జలయజ్ఞమే నిర్వహించామన్నారు.
కష్టనష్టాలు ఎదురైనా హామీల అమలు: పొంగులేటి
కృష్ణా, గోదావరి జలాలను ఖమ్మంకు తీసుకురావాలనే లక్ష్యంతో వైఎ్‌సఆర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుళ్లు, కుతంత్రాలతో వ్యవహరించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్షలను సీఎం రేవంత్‌రెడ్డి నెరవేర్చారన్నారు. రైతును రాజును చేస్తామన్న రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ హామీని అమలు చేశారని తెలిపారు. అన్ని సమస్యలను అధిగమించి రూ.2లక్షల రుణమాఫీ అమలు చేశామన్నారు.
సీతారామ ప్రారంభోత్సవం నా అదృష్టం: ఉత్తమ్
సీతారామ ద్వారా ఖమ్మంను సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పంప్ హౌజ్ ప్రారంభంలో పాల్గొనడం తన అదృష్టం అభివర్ణించారు. వచ్చే ఏడాదికి ఖమ్మంలో 7 లక్షల ఎరాలకు నీరిస్తామని చెప్పారు. రుణ మాఫీ ఘనత దేశ చరిత్రలో లిచిపోతుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్ష మాఫీ ప్రకటించి ఐదేళ్లు సాగదీసి రైతులను మోసం చేసిందని విమర్శించారు.
Updated Date - Aug 16 , 2024 | 04:53 AM