Hyderabad: విస్తరణకు వేళాయె!
ABN, Publish Date - Jul 02 , 2024 | 02:45 AM
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నెల 5 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేబినెట్‌లో కొత్తగా ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ లోపే నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది.
గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
ఒకట్రెండు రోజుల్లో విస్తరణ అని సమాచారం
ఈ నెల 5 లోపే కొత్త మంత్రుల ప్రమాణం స్వీకారం!
నేడో రేపో ఢిల్లీకి రేవంత్.. ఖర్గే, రాహుల్‌తో భేటీ
మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్‌పై తుది నిర్ణయం!
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నెల 5 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేబినెట్‌లో కొత్తగా ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ లోపే నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా 5వ తేదీలోపే జరుగుతుందని అంటున్నారు. సీఎం రేవంత్ గవర్నర్ రాధాకృష్ణన్‌తో సమావేశం కావడం కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి మంగళ, లేదా బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీకి కొత్త చీఫ్ నియామకంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీతో చర్చించేందుకే సీఎం ఢిల్లీకి వెళుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా వెళుతున్నట్లు, ఈ భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొంటారని చెబుతున్నారు. ఈ భేటీలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ అంశాలపై కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్, భట్టివిక్రమార్క, ఉత్తమ్, దీపాదాస్ మున్షీ ఇప్పటికే రెండు దఫాలు సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే.
ప్రతిపాదిత పేర్లపై అభిప్రాయ సేకరణ..
పీసీసీ కొత్త చీఫ్ కోసం ఎమ్మెల్సీ మహే్‌షకుమార్‌గౌడ్, ఎంపీ బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తదితరుల పేర్లపై చర్చించి షార్ట్ లిస్ట్ చేశారు. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, ఎడ్మ బొజ్జు, నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలు నాయక్ తదితరుల పేర్లపై కేసీ వేణుగోపాల్‌తో జరిగిన భేటీల్లో చర్చించారు.
ఆ సమావేశాల తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన దీపాదాస్ మున్షీ.. రాష్ట్రంలోని పలువురు ముఖ్యనేతలను కలిసి టీపీసీసీ కొత్త చీఫ్‌గా ప్రతిపాదిత పేర్లపై అభిప్రాయాలు సేకరించారు. కేసీ వేణుగోపాల్‌తో జరిపిన చర్చలు, రాష్ట్ర ముఖ్యనేతల అభిప్రాయాల ఆధారంగా ఖర్గే, రాహుల్.. టీపీసీసీకి కొత్త చీఫ్, మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్‌లో ఈ నియామకాలపై చర్చలు జరిపిన నేపథ్యంలో ఆశావహులంతా ఆ నాలుగు రోజులూ ఢిల్లీలోనే మకాం వేశారు. అధిష్ఠానంతో మరోసారి భేటీ జరగనుండడంతో వారంతా మళ్లీ ఢిల్లీకి చేరుకుంటున్నారు.
గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ..
సీఎం రేవంత్ సోమవారం గవర్నర్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం జరగనుందని, ఆషాఢం లోపే వారితో ప్రమాణ స్వీకారం చేయించాలనీ గవర్నర్‌ను సీఎం కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లకు టీజేఎస్ అధినేత కోదండరాం, మీడియా రంగం నుంచి అమీరుల్లాఖాన్ పేర్లను సిఫారసు చేస్తూ మంత్రిమండలి గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సిఫారసుకు ఆమోదం తెలిపే అంశంపైనా గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది.
Updated Date - Jul 02 , 2024 | 02:45 AM