CM Revanth Reddy: మన్మోహన్ జీవితం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:52 AM
మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అలా సాకారమైన తెలంగాణకు తానిప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నానని తెలిపారు.

వీడియో సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీ
దేశం ఎప్పటికీ మన్మోహన్ సేవలను
గుర్తుంచుకుంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి
ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ సాకారం.. దేశం ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: రేవంత్
మాజీ ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి సహా పలువురు నేతల నివాళి
ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్: జూపల్లి కృష్ణారావు
గొప్ప ఆర్థికవేత్త.. దార్శనికుడు: దామోదర రాజనర్సింహ
దేశ అభ్యున్నతికి దారులు వేసిన నేత: జగ్గారెడ్డి
గాంధీభవన్‌లో మన్మోహన్‌కు నేతల నివాళులు
న్యూఢిల్లీ/హైదరాబాద్, డిసెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అలా సాకారమైన తెలంగాణకు తానిప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నానని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్థివ దేహానికి సీఎం రేవంత్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ ేసవలను గుర్తు చేసుకున్నారు. ‘‘మన్మోహన్‌సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీతోపాటు దేశానికి తీరని లోటు. మన్మోహన్ తీసుకొచ్చిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ దేశాన్ని బలోపేతం చేశాయి. సమాచార హక్కు, విద్యాహక్కు, ఆహార భద్రత చట్టాలు, నరేగా, న్యూక్లియర్ డీల్ ఆయన ప్రవేశపెట్టినవే. తెలంగాణ రాష్ర్టాన్ని కూడా మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే ఏర్పాటు చేశారు. ఆయన వల్ల ఈ దేశం ఎంతో ప్రగతి సాధించింది. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ లోటు ఎవరూ భర్తీ చేయలేనిది.
ఈ దేశం మన్మోహన్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. కాగా, సీఎం రేవంత్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, అనిల్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తదితరులు మన్మోహన్ పార్థివదేహానికి నివాళులర్పించారు. దేశ రూపురేఖలను మార్చేసిన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్త, దార్శనికుడు అని మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. మన్మోహన్‌తో తమ తండ్రి, దివంగత వెంకటస్వామికి మంచి అనుబంధం ఉండేదని ఎమ్మెల్యేలు జి.వినోద్, జి.వివేక్ అన్నారు.
దేశం విశిష్ట వ్యక్తిని కోల్పోయింది..
దేశం ఒక విశిష్ట వ్యక్తిని కోల్పోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డితో కలిసి ఎంపీ కార్యాలయంలో మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్‌ది అని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. అవినీతి మరక అంటని గొప్ప రాజకీయ నాయకుడు మన్మోహన్‌సింగ్ అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కొనియాడారు. శుక్రవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన మన్మోహన్ సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కాగా, తాను కాంగ్రెస్ ఓబీసీ కన్వీనర్‌గా ఉన్న సమయంలో తనకు మన్మోహన్‌సింగ్‌తో కలిసి పని చేసే అవకాశం దక్కిందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు గుర్తు చేసుకున్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి వీహెచ్‌తోపాటు పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. వీరిలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావు, శోభారాణి, మెట్టు సాయికుమార్, లక్ష్మణ్ యాదవ్, చరణ్ కౌశిక్, బొల్లు కిషన్, సూర్య నాయక్, కోట నీలిమ తదితరులు ఉన్నారు. కాగా, మన్మోహన్‌సింగ్ మృతి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వారం రోజులు సంతాప దినాలుగా పాటిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలతోపాటు జనవరి 3వరకు టీపీసీసీ ఆద్వర్యంలో ప్రకటించిన అన్ని రాజకీయ కార్యక్రమాలను రద్దు చేసినట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రకటించారు.
దార్శనికుడు మన్మోహన్: జగ్గారెడ్డి
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో తన మేధస్సును ధార పోసి ఆర్థిక అభ్యున్నతికి దారులు వేసిన దార్శనికుడు మన్మోహన్‌సింగ్ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దమని పేర్కొన్నారు. ఎదిగిన కొద్దీ ఎలా ఒదిగి ఉండాలో చాటి చెప్పిన మహనీయుడని, దేశ రాజకీయాల్లో అజాత శత్రువు అని కొనియాడారు. మన్మోహన్ మరణంతో దేశం ఒక గొప్ప ఆర్థిక పితామహుడిని, క్రమశిక్షణ కలిగిన నాయకుణ్ణి కోల్పోయిందన్నారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు, విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చిన నేతగా మన్మోహన్ సింగ్ గుర్తుండిపోతారన్నారు. అటు కేంద్ర ఆర్థిక మంత్రిగా తర్వాత దేశ ప్రధానిగా ఆయన చేసిన ేసవలను దేశం ఎప్పటికీ మరిచిపోదని తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు.