Share News

TG News: హైదరాబాద్ రావాలంటేనే భయపడుతున్న డ్రగ్ సప్లయర్స్..

ABN , Publish Date - Aug 03 , 2024 | 01:56 PM

తెలంగాణలో డ్రగ్స్‌పై పోలీసుల వరుస దాడులతో సప్లయర్స్ హైదరాబాద్ రావాలంటేనే భయపడుతున్నారు. డ్రగ్స్ కావాలంటే బెంగళూరు వచ్చి తీసుకెళ్లడంటూ పెడ్లర్స్ చెబుతున్నారు.

TG News: హైదరాబాద్ రావాలంటేనే భయపడుతున్న డ్రగ్ సప్లయర్స్..

హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్‌పై పోలీసుల వరుస దాడులతో సప్లయర్స్ హైదరాబాద్ రావాలంటేనే భయపడుతున్నారు. డ్రగ్స్ కావాలంటే బెంగళూరు వచ్చి తీసుకెళ్లడంటూ పెడ్లర్స్ చెబుతున్నారు. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బెంగళూరులో ఉన్న కింగ్ పిన్‌ను పట్టుకోవడానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెళ్లారు. డ్రగ్స్ కావాలనే వారికి తాము కనిపించకుండా డ్రగ్స్ ముఠా సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే రెండు గంటల తర్వాత డ్రగ్స్ ఎక్కడ పెట్టారో వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా చెత్త డబ్బాలో రెడ్ కలర్ కవర్‌లో, చెట్టు కింది భాగంలో బ్లూ కలర్ కవర్‌లో, రోడ్డు పక్కనే ఉన్న బండి కింద పెట్టాము అని స్మగ్లర్లు చెబుతున్నారు.


డ్రగ్స్ కొనే వారికి తమ మొహం కనబడకుండా నిందితులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎస్ఆర్ నగర్ డ్రగ్ నిందితులను పట్టుకోవడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలను డ్రగ్ భూతం పట్టి పీడిస్తోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు హైదరాబాద్‌లో నిన్నటికి నిన్న మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. ఓ రేవ్ పార్టీ కేసును విచారిస్తున్న సమయంలో బెంగుళూరు నుంచి నగరానికి మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా గురించి తెలిసినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. అనంతరం దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.


ఇటీవల మాదాపూర్‌లోని క్లౌడ్ నైన్ అపార్ట్మెంట్‌లో ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.. రేవ్ పార్టీలో 20మందిని అదుపులోకి తీసుకుని విచారించి అనంతరం వారిలో నాగరాజు యాదవ్‌తోపాటు మరో నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించే క్రమంలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఎస్.ఆర్.నగర్‌లో హాస్టల్స్ కేంద్రంగా గంజాయి, డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ చెప్పారు. వెంకట్ బాయ్స్ హాస్టల్లో సోదాలు నిర్వహించినప్పుడు మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. మొత్తానికి పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతో డ్రగ్ సప్లయర్స్ హైదరాబాద్ రావాలంటేనే భయపడుతున్నారు.

Updated Date - Aug 03 , 2024 | 01:56 PM