Share News

Hyderabad: పిల్లల గుండెలో ఆ ఇద్దరు.. గదిలో బందీగా ఒకరు ..

ABN , Publish Date - Jun 28 , 2024 | 03:23 AM

ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ అంటారో భావకవి! కల్లాకపటం తెలియని పిల్లలూ ఇంతే! చక్కగా అర్థమయ్యేట్టు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల పట్ల మాటలకందని గొప్ప బంఽధాన్ని ఏర్పరుచుకుంటారు.

Hyderabad: పిల్లల గుండెలో ఆ ఇద్దరు.. గదిలో బందీగా ఒకరు ..

  • బదిలీపై వెళుతున్న ఇద్దరు టీచర్ల పట్ల పిల్లల్లో భావోద్వేగం

  • గేటు మూసివెళ్లనీయకుండా అడ్డగింత

  • జనగామ జిల్లా శామీర్‌పేట స్కూల్లో ఘటన

  • మరో ఘటనలో పూటుగా తాగొచ్చినటీచర్‌

  • ఆయన్ను గదిలో బంధించిన చిన్నారులు

  • కొత్తగూడెం జిల్లాలో ఘటన

4.jpg

జనగామ కల్చరల్‌/ఇల్లెందు టౌన్‌: ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ అంటారో భావకవి! కల్లాకపటం తెలియని పిల్లలూ ఇంతే! చక్కగా అర్థమయ్యేట్టు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల పట్ల మాటలకందని గొప్ప బంఽధాన్ని ఏర్పరుచుకుంటారు. ఆ ఉపాధ్యాయులు ఇక తమ బడికి రారు అని తెలిసినప్పుడు భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంటారు. మరి.. పాఠాలు చెప్పకుండా మద్యం తాగొచ్చిన ఉపాధ్యాయులుంటే? తరగతి గదిలో పెట్టి బంధించేందుకూ వెనుకాడరు! ఓ చోట.. మరో పాఠశాలకు బదిలీ అయిన ఇద్దరు ఉపాధ్యాయులను ఆ బడి పిల్లలు వెళ్లనీయకుండా మారాం చేస్తే.. మరోచోటేమో పూటుగా తాగొచ్చి.. ఆ మత్తులో తమను ఇష్టంవచ్చినట్లుగా తిడుతున్న ఉపాధ్యాయుడిని గదిలో పెట్టి బంధించారు చిచ్చర పిడుగులు! ఉపాధ్యాయుల తీరు పట్ల పిల్లల మనసుల్లో ముద్రపడే భావాలకు ప్రతిబింబాలుగా ఉన్న రెండు ఘటనలూ గురువారం ఒకేరోజు జరగడం మరో విశేషం! జనగామ రూరల్‌ మండలం శామిర్‌పేట ప్రాథమిక పాఠశాలలో సుధీర్‌ రెడ్డి అనే ఉపాధ్యాయుడు 13 ఏళ్లుగా, ఫాతిమా మేరీ అనే ఉపాధ్యాయురాలు ఆరేళ్లుగా పనిచేస్తున్నారు.


ఇటీవల జరిగిన పదోన్నతులలో భాగంగా సుధీర్‌రెడ్డి బచ్చన్నపేట మండలం కొన్నె ఉన్నత పాఠశాలకు, ఫాతిమా మేరీ పాలకుర్తి మండలం చెన్నూరు ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. ఈ ఇద్దరు టీచర్లూ ఇక తమ బడికి రారనే విషయాన్ని అక్కడ ఒకటో క్లాసు నుంచి ఐదో క్లాసు దాకా చదువుతున్న చిన్నారులు తెలుసుకున్నారు. అందరూ కలిసి ఆ ఇద్దరు టీచర్ల దగ్గరకు వెళ్లారు. మీరు మమ్మల్ని, మా బడిని వదిలి పోవొద్దూ అంటూ బతిమాలుకున్నారు. టీచర్లు సర్దిచెబుతూ బయటకు వెళ్లబోతుంటే.. పిల్లలంతా కన్నీళ్లు పెట్టుకుంటూ బడి గేటు మూసివేసి ‘మిమ్మల్ని పోనిచ్చేది లేదు’ అంటూ అడ్డుకున్నారు. తమ పట్ల అలా ఉబికొచ్చిన చిన్నారుల మనసులోని ఆప్యాయతకు ఆ ఇద్దరు టీచర్ల మనసు కరిగి కళ్లు చెమ్మగిల్లాయి. పిల్లలను దగ్గరకు తీసుకొని బుజ్జగించిన ఆ టీచర్లు ‘మళ్లీ ఈ స్కూలుకే వస్తాం’ అంటూ చెప్పి బరువైన హృదయాలతో వీడ్కోలు తీసుకున్నారు.


ఇక కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని ఇల్లెందులపాడులోని పాఠశాలలో కాల్వ సుధాకర్‌ అనే ఉపాధ్యాయుడు బడికి తాగొచ్చాడు. ఆ మత్తులో తరగతి గదిలో విద్యార్థులను అసభ్యకరమైన పదజాలంతో తిట్టాడు. ఆ ఉపాధ్యాయుడు రోజూ బడికి తాగొచ్చి.. ఇలానే వ్యవహరిస్తుండటంతో విసుగెత్తిన పిల్లల్లో కొందరు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను వెంటబెట్టుకొచ్చారు. పిల్లలంతా తరగతి గది బయటకొచ్చేసి, ఆ ఉపాధ్యాయుడిని లోపలే ఉంచి తల్లిదండ్రుల సహకారంతో గదికి తాళం వేసి నిర్బంధించారు. 4 గంటలు గడిచాక సమాచారం అందుకున్న ఇల్లెందు ఎంఈవో పిల్లి శ్రీనివాసరావు, ఓ విచారణ అధికారిని పంపారు. తల్లిదండ్రుల నుంచి వివరాలు తీసుకొని ఉపాధ్యాయుడు కాల్వ సుధాకర్‌పై చర్య తీసుకుంటామని ఎంఈవో చెప్పారు. ఆ తర్వాతే ఉపాధ్యాయుడిని పిల్లలు విడుదల చేశారు.

Updated Date - Jun 28 , 2024 | 03:23 AM