Hyderabad: వైద్య విద్యపై నేరుగా పర్యవేక్షణ..
ABN, Publish Date - Jun 20 , 2024 | 04:16 AM
నాణ్యమైన వైద్య విద్యను అందించడమే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా ప్రైవేటు కాలేజీలపై హెల్త్ యూనివర్సిటీ పర్యవేక్షణ ఉండగా.. ఇక నుంచి సర్కారే పర్యవేక్షించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
హెల్త్ వర్సిటీ ప్రమేయం ఉండదు
అదనపు ఫీజులు తీసుకుంటే చర్యలు
స్టైపెండ్ ఇవ్వకుంటే ఊరుకునేది లేదు
ప్రైవేట్ వైద్య కాలేజీల యాజమాన్యాలతో భేటీలో మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): నాణ్యమైన వైద్య విద్యను అందించడమే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా ప్రైవేటు కాలేజీలపై హెల్త్ యూనివర్సిటీ పర్యవేక్షణ ఉండగా.. ఇక నుంచి సర్కారే పర్యవేక్షించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. సచివాలయంలో బుధవారం ప్రైవేటు మెడికల్, డెంటల్ కళాశాలల యాజమాన్యాలు, కాలేజీల డీన్లు, ప్రిన్సిపాల్స్‌తో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య విద్యకు తెలంగాణ బెస్ట్ డెస్టినేసన్‌గా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.
విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పీజీ విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వకుంటే ఊరుకోబోమన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యకు పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు వైద్య విద్య కళాశాలల యజమానులు, డీన్లు, ప్రిన్సిపాల్స్ సర్కారుకు పలు సూచనలు చేయగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు. ఏబాస్ హాజరు విధానం అమలులో కొన్ని కాలేజీలు అవకతవకలకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.
Updated Date - Jun 20 , 2024 | 04:16 AM