TG Assembly: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ నేతలు రోజుకో వేషం..
ABN , Publish Date - Dec 18 , 2024 | 08:24 AM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోజుకో వేషంతో అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు. నిన్న (మంగళవారం) నల్ల చొక్కలు వేసుకుని వచ్చిన నేతలు.. ఈరోజు ఆటో డ్రైవర్ల వేషంలో అసెంబ్లీకి రానున్నారు. రోజుకో గెటప్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Winter Budget Sessions) నాలుగో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. తర్వాత ప్రభుత్వం సభలో రెండు కీలక బిల్లులు (Two key Bills) ప్రవేశపెట్టనుంది. తెలంగాణ పేమెంట్స్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ భూ భారతి బిల్ 2024 ను సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు బిల్లులపై చర్చించి శాసనసభ ఆమోదం తెలుపనుంది. కాగా ఈరోజు అసెంబ్లీలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పినపై లఘు చర్చ జరుగుతుంది.
రోజుకో వేషం..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోజుకో వేషంతో అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు. నిన్న (మంగళవారం) నల్ల చొక్కలు వేసుకుని వచ్చిన నేతలు.. ఈరోజు ఆటో డ్రైవర్ల వేషంలో అసెంబ్లీకి రానున్నారు. రోజుకో గెటప్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వస్తున్నారు. మొదటి రోజు అదానీ, రాహుల్ గాంధీ టీ షర్ట్స్‌తో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న నల్ల చొక్కాలు ధరించి, బేడీలతో అసెంబ్లీకి వచ్చారు. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలు ధరించారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని ఈరోజు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయనున్నారు.
తలసాని ఇంట్లో బ్రేక్ ఫాస్ట్
కాగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని తన నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బ్రేక్ ఫాస్ట్ ఇస్తున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వాటర్ట్స్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం అసెంబ్లీకి వెళతారు. అయితే నేతలు ఆటోలో అసెంబ్లీకి వెళ్ళనున్నారు.
సభలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్...
బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల కాలంలో చేసిన అప్పులపై, ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై మంగళవారం అసెంబ్లీలో అధికార, విపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. గంటకుపైగా ఈ అంశంపై వాడివేడిగా వాదోపవాదాలు నడిచాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో ఎఫ్ఆర్బీఎం రుణాలతోపాటు, ఆ పరిధిలోకి రాని రుణాల గురించి విపక్ష బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నలు సంధించారు. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టి సభలో లేకపోవటంతో భట్టిని రప్పించాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఆ తర్వాత సభలోకి వచ్చిన భట్టి.. 2023 డిసెంబరు నుంచి 2024 నవంబరు 30 దాకా ఎఫ్ఆర్బీఎం రుణాలు రూ.52,118 కోట్లు తీసుకోగా, కార్పొరేషన్లు/ఎ్సపీవీలు తీసుకున్న ఎఫ్ఆర్బీఎం యేతర రుణాలు రూ.61,991 కోట్లు అని తెలిపారు. ఎఫ్ఆర్బీఎం యేతర రుణాల్లో భాగంగా గ్యారెంటీ ఇచ్చిన అప్పులు రూ.51,277 కోట్లు కాగా, డ్రా చేసిన మొత్తం రూ.51,891 కోట్లు అని వెల్లడించారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందిస్తూ.. ఏడాదికాలంలో (మంగళవారం నాటికి) కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,27,208 కోట్ల అప్పులు చేసిందన్నారు. ఈ లెక్కన ఐదేళ్లలో అప్పు రూ.6 లక్షల కోట్లు దాటనుందని, పదేళ్లలో తాము రూ.4.17 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని చెప్పారు. రుణాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని, అవసరమైతే ఆడిటర్లను పిలిచి చర్చ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ, ‘అప్పులపై కావాలంటే మళ్లీ శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పాత కథలు చెబితే వినం. గతంలో మీరే రూల్స్ రూపొందించారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దు. నినాదాలు ఇవ్వొద్దు అని రాసుకున్నారు. ఆ నిబంధనలు మీరే పాటించరా? మీ హయాంలో చేసిన అప్పులకు అసలు/వడ్డీ కలిపి రూ.66 వేల కోట్లు కట్టాం. రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని చెబితే మాపై ప్రివిలేజ్ మోషన్ వేస్తారా? మీది భూస్వామ్య మనస్తత్వం’ అని మండిపడ్డారు. మాకు నీతులు చెబుతారా అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అప్పులపై సభ బయట మాట్లాడినందుకే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం, దానిపై ఆవేశం ఎందుకంటూ ప్రశ్నించారు
ఈ వార్తలు కూడా చదవండి..
గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో వెలుగులోకి కొత్త నిజాలు
కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విందు
వచ్చే ఎన్నికల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News