BRS: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కారులోంచి కమలంలోకి..
ABN , Publish Date - Mar 11 , 2024 | 09:22 AM
న్యూఢిల్లీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ముంగిట బీఆర్‌ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవడంతో గులాబీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్న వేళ.. ఆదివారం ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుని బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చారు.

బీజేపీలోకి సీతారాం నాయక్, నగేష్, జలగం వెంకట్రావ్, శానంపూడి
ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలోకి సీతారాం నాయక్, నగేష్, జలగం వెంకట్రావ్, శానంపూడి
లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్: ఎంపీ లక్ష్మణ్
నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ.. లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు
రాష్ట్రం నుంచి ఐదారుగురిని ప్రకటించే అవకాశం.. రేపు తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రాక
న్యూఢిల్లీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ముంగిట బీఆర్‌ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవడంతో గులాబీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్న వేళ.. ఆదివారం ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుని బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి నడిచిన మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్.. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ ఎంపీ గొడం నగేశ్.. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్.. కాంగ్రెస్ కంచుకోట, ఒకప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో తొలిసారిగా బీఆర్‌ఎస్‌కు విజయాన్ని అందించిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరారు. వీరితోపాటు పెద్దపల్లికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గోమాస శ్రీనివాస్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్ వారికి కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ ఉద్యమకారులను పక్కన పెట్టేశారని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని గిరిజన తెగలన్నీ అభివృద్ధి చెందాయని అన్నారు. ఖమ్మం అభివృద్ధి కోసమే బీజేపీలో చేరానని జలగం వెంకట్రావ్ తెలిపారు. బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను విస్మరించిందని, మైనింగ్ యూనివర్సిటీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. భద్రాచలం రామాలయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. మోదీ దూరదృష్టి నచ్చి బీజేపీలో చేరానని సైదిరెడ్డి తెలిపారు. ఆదివాసీ గూడేల అభివృద్ధి మోదీతోనే సాధ్యమని నగేశ్ అన్నారు. దేశమంతా మోదీ పాలనను కోరుకుంటోందని, తెలంగాణ ప్రజలు సైతం అదే ఆశిస్తున్నారని గోమాస శ్రీనివాస్ తెలిపారు.
బీజేపీ మరింత బలపడుతుంది: చుగ్
తెలంగాణలో పదేళ్లుగా కేసీఆర్ అరాచక పరిపాలన సాగించారని తరుణ్‌చుగ్ విమర్శించారు. తండ్రి, కొడుకు, కూతురు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఐదుగురు కీలక నేతల చేరికతో రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కారే కొలువుదీరుతుందని తెలిపారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని చెప్పారు.
నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా 543 స్థానాలకు గాను ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. మిగిలిన స్థానాలకు సంబంధించి ఇప్పటికే కోర్ కమిటీ సమావేశాలు నిర్వహించింది. సోమవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మరో ఎనిమిది స్థానాలపై శనివారం ఢిల్లీలో చర్చ జరిగింది. అయితే, రెండో జాబితాలో తెలంగాణకు సంబంధించి ఐదారు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన నలుగురి పేర్లు రెండో జాబితాలో ఉంటాయని తెలిసింది. ఆదిలాబాద్ నుంచి సిటింగ్ ఎంపీ బాపూరావును కాదని మాజీ మంత్రి నగేశ్‌కు సీటు ఖరారు చేసినట్టు సమాచారం. మహబూబాబాద్ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఖమ్మం నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, నల్లగొండ నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేర్లు రెండో జాబితాలో ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు పెద్దపల్లిలో గాయకుడు మిట్టపల్లి సురేందర్ పేరు దాదాపుగా ఖరారైనట్టేనని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా అదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి టికెట్ తనదేనని శ్రీనివాస్ చెబుతుండగా.. ఆ స్థానం తనకే దక్కుతుందని సురేందర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండో జాబితాలోనే మహబూబ్‌నగర్ స్థానాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అక్కడ డీకే అరుణ, జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరి పేరును ఇప్పటికే ఫైనల్ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెదక్ నియోజకవర్గం నుంచి బలమైన నేతను నిలబెట్టాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. వరంగల్ నుంచి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఆ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్, పార్టీ సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, శ్రీధర్ వంటి నేతలు పోటీ చేయాలని ఆశిస్తున్నారు.
సైదిరెడ్డి చేరికపై తీవ్ర అసంతృప్తి..
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై బీజేపీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సైదిరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని జాతీయ నాయకత్వానికి లేఖ రాశారు. ఒకవేళ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే తాము సహకరించబోమని తేల్చిచెప్పారు. కాగా, బీజేపీ సీనియర్ నేత మేడ్చల్–మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడు హరీశ్ రెడ్డి తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
రేపు తెలంగాణకు అమిత్ షా
హైదరాబాద్, మార్చి 10(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంపీరియల్ గార్డెన్స్‌లో పార్టీ సోషల్ మీడియా వారియర్స్‌తో సమావేశమవుతారు. 2 గంటలకు ఎల్బీ స్టేడియంలో పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పైస్థాయి నాయకులతో నిర్వహించనున్న సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సభ ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 12 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.