Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పేరు లేదు: హరీశ్‌రావు
ABN, Publish Date - Jul 23 , 2024 | 05:13 PM
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ పేరు లేదని, రాష్ట్రానికి గుండు సున్న ఇచ్చారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) మండిపడ్డారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.
హైదరాబాద్: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ పేరు లేదని, రాష్ట్రానికి గుండు సున్న ఇచ్చారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) మండిపడ్డారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. ఈ రోజు (మంగళవారం) హరీష్ రావు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ఏపీకి అన్ని నిధులు ఇచ్చినందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే.. తెలంగాణలో కూడా 9 వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని.. వాటికి ఎందుకు నిధులు విడుదల చేయటం లేదని కేంద్రాన్ని నిలదీశారు.
మరోవైపు.. రేవంత్ సర్కార్‌పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శాసన సభ సమయాన్ని కూడా వాళ్ల పథకాల్లాగే ఎత్తేస్తున్నారని దుయ్యబట్టారు. నాలుగు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ముగించాలని చూస్తున్నారని హరీష్ ఎద్దేవా చేశారు. గతంలో వీరే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉండాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నిరుద్యోగుల ఎజెండా పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున తాము అడిగామని.. ఇదే విషయాన్ని తెలంగాణ గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు.
ఈ గవర్నమెంట్ వచ్చాక దారుణాలు, దొంగతనాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆరు గ్యారెంటీల మీద చర్చ పెట్టాలని తాము అడిగామని చెప్పారు. రుణమాఫీ మీద మొదటి సంతకం అన్నారని... ఇప్పుడు అందరికీ ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రం మొత్తం విష జ్వరాలు ఉన్నాయన్నారు. లోకల్ సమావేశాలకు ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వటం లేదని.. మొత్తం 9 అంశాల మీద చర్చ పెట్టాలని అడిగామని హరీశ్‌రావు గుర్తుచేశారు.
Updated Date - Jul 23 , 2024 | 05:43 PM