Share News

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికాలో ప్రభాకర్‌రావు పిటిషన్‌

ABN , Publish Date - Nov 29 , 2024 | 07:06 PM

సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావును విచారించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయంలో దర్యాప్తు అధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి.. న్యాయశాఖతో సంప్రదింపులు జరిపాక ఈ మేరకు అనుమతినిచ్చినట్లు తెలిసింది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికాలో ప్రభాకర్‌రావు పిటిషన్‌

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ పిటిషన్‌లో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో తాను పనిచేశానని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. రాజకీయంగా తనను ప్రభుత్వం వేధిస్తుందని పిటిషన్‌లో ప్రభాకర్ రావు తెలిపారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో తాను కొట్టుమిట్టాడుతున్నానని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఫ్లోరిడాలో తన కుమారుని వద్ద ఉంటున్నానని చెప్పారు. మరోవైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. చికాగోకు ఛానల్ ఎండీ శ్రవణ్ రావు చేరుకున్నారు. ప్రస్తుతానికి చికాగోలో శ్రవణ్ రావు అడ్రస్‌ను పోలీసులు కనుగొన్నారు.


అమెరికాలో చికిత్స ..

కాగా.. సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావును విచారించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయంలో దర్యాప్తు అధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి.. న్యాయశాఖతో సంప్రదింపులు జరిపాక ఈ మేరకు అనుమతినిచ్చినట్లు తెలిసింది. వీరిద్దరూ విశ్రాంత అధికారులు కాగా.. మిగతా ముగ్గురు-- ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న సర్వీసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. విశ్రాంత అధికారుల ప్రాసిక్యూషన్‌కు మాత్రమే అనుమతి లభించినట్లు తెలుస్తోంది. కాగా.. క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రభాకర్‌రావు అమెరికాలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.. తాను ఇప్పట్లో భారత్‌కు రాలేనని, అవసరమైతే వీడియో, టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని పేర్కొంటూ దర్యాప్తు అధికారులకు ఈ-మెయిల్‌ పంపారు.


సీఐడీ రెడ్ కార్నర్ నోటీసులు..

ప్రభాకర్‌రావు‌, శ్రవణ్ కుమార్‌కు సీఐడీ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత అమెరికాకు ప్రభాకర్ రావు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉన్న ఆయనను ఇండియాకు రప్పించేందుకు సీఐడీ ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. ముందుగా ప్రభాకర్ రావు‌కు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది.

రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన విషయాన్ని సీబీఐకి సీఐడీ అధికారులు తెలిపారు. సీబీఐ నుంచి ఇంటర్ పోల్‌కి సీఐడీ అధికారులు సమాచారం అందజేశారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు సీఐడీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రభాకర్ రావు పైన నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ప్రభాకర్ రావుని హాజరుపరచాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని సిట్‌కు ప్రభాకర్ రావు తెలిపారు. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావుని హైదరాబాద్‌కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికాతో సిట్‌కు ఉన్న ఒప్పందాల ప్రకారం ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాకర్ రావు ఒకవేళ విచారణకు హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్..

ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్) మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు అమెరికా (America)లో గ్రీన్‌కార్డు (Green Card) మంజూరయింది. అమెరికాలో స్థిరపడిన కుటుంబసభ్యుల ద్వారా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలియవచ్చింది. కొన్ని రోజుల క్రితమే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయింది. ప్రభాకర్‌రావుకు గ్రీన్ కార్డు మంజూరు విషయం తెలిసి.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రీన్‌కార్డు లభించడం.. కేసు దర్యాప్తునకు ప్రభావం చూపే అవకాశముంది. కేసు దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావుపై పోలీసులు ఎల్ఓసీ జారీచేశారు. మరోవైపు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కలర్ నోటీస్ జారీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.


ప్రభాకర్‌రావుకు గ్రీన్‌ కార్డుతో ఎంత కాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు ఉంటుంది. దీంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే ఆయన పాస్‌పోర్టు రద్దు కావడంతో.. అమెరికాలోని భారత ఎంబసీ ద్వారా అక్కడి అధికారులకు చేరవేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది.


పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు ..

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం బయటపడిన తర్వాత ప్రభాకరరావు అమెరికా వెళ్లిపోయారు. ఈ ఏడాది మార్చి 10న ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ రమేష్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మార్చి 11న అమెరికా వెళ్లిన ప్రభాకర్‌రావు అక్కడే ఉన్నారు. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్‌ చేయడంతో సంచలనం రేపింది. ఆ తర్వాత ప్రభాకర్‌రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చిన తర్వాత కోర్టులో ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. అప్పటి నుంచి ప్రభాకర్‌ను అమెరికా నుంచి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు.


ప్రభాకర్‌రావుకు లుక్‌అవుట్‌ నోటీసు

అయితే తాను వైద్యచికిత్స నిమిత్తం అమెరికా వెళ్లానని ప్రభాకరరావు చెప్పారు. తాను ఇల్లినాయిస్‌ అరోరాలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన వీసా గడువు దాటినా ప్రభాకర్ రావు హైదరాబాద్ రాలేదు. గడువును మరో ఆరునెలలకు పొడిగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రభాకర్‌రావుపై లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయించే ప్రయత్నం చేశారు. ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును సైతం రద్దు చేశారు. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ ద్వారా అమెరికా పోలీసులకు చేరవేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు గ్రీన్‌కార్డు వచ్చింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలన్నదానిపై పోలీసులు ఆలోచన చేస్తున్నారు.

Updated Date - Nov 29 , 2024 | 07:11 PM