JNTU: యూనివర్సిటీనా.. లేక ఆటోనగరా..
ABN , Publish Date - Dec 12 , 2024 | 08:10 AM
ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలకు కొలువుగా నిలవాల్సిన జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ(Jawaharlal Nehru Technological University) ప్రాంగణం కొన్నాళ్లుగా భారీ ట్రక్కులు, కంటెయినర్లకు పార్కింగ్ స్థలంగా మారింది.
- జేఎన్‌టీయూ క్యాంపస్‌లో వందకు పైగా ట్రక్కులు, కంటెయినర్‌ల పార్కింగ్
- ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, ఉద్యోగులు
- భారీ వాహనాలను లోపలికి ఎలా అనుమతిస్తారంటున్న విద్యార్థి సంఘాలు
హైదరాబాద్ సిటీ: ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలకు కొలువుగా నిలవాల్సిన జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ(Jawaharlal Nehru Technological University) ప్రాంగణం కొన్నాళ్లుగా భారీ ట్రక్కులు, కంటెయినర్లకు పార్కింగ్ స్థలంగా మారింది. ఇటీవల యూనివర్సిటీలోకి హెవీ వెహికల్స్ పెద్ద సంఖ్యలో వస్తుండడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: నార్సింగ్‌లో ఆధునిక వ్యవసాయ మార్కెట్..
భారీ వాహనాలను వర్సిటీలోకి ఎలా అనుమతిస్తారంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ప్రశ్నిస్తే తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని ఉద్యోగులు, ఉన్నతాధికారులు సైతం మిన్నకుండిపోతున్నారు. ఇంతకీ మనం ఉన్నది మేధావులను తయారుచేసే జేఎన్‌టీయూ క్యాంప్‌సలోనా.. లారీలకు మరమ్మతులు నిర్వహించే ఆటోనగర్‌లోనా.. అని ఒకరికొకరు ప్రశ్నించుకుంటున్నారు. క్యాంప్‌సలో భిన్నమైన పరిస్థితులు నెలకొనడం పట్ల వారంతా ఆందోళన చెందుతున్నారు.
టీజీపీఎస్సీకి కాస్తంత చోటిస్తే..
పోటీ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేఎన్‌టీయూను సాంకేతిక సహకారం కోరింది. గతేడాది గ్రూప్ 1 పరీక్షలను యూనివర్సిటీ ఆచార్యుల సహకారంతో నిర్వహించేందుకు అప్పటి వైస్‌చాన్స్‌లర్ కట్టా నర్సింహారెడ్డి అనుమతించారు. ఒకసారి అవకాశం దొరికింది కదా అని టీజీపీఎస్సీ అధికారులు గ్రూప్1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3.. తదితర పరీక్షలన్నింటికీ యూనివర్సిటీ ప్రాంగణాన్ని తమ సొంతమన్నట్లుగా వాడేస్తున్నారన్న భావన విద్యార్థుల్లో ఏర్పడింది.
పోటీ పరీక్షలకు వినియోగించే ఓఎంఆర్ షీట్ల బండిల్స్‌ను నిల్వచేసేందుకు జేఎన్‌టీయూ ప్రాంగణాన్ని గోడౌన్‌గా మార్చేయడం పట్ల వర్సిటీ ఆచార్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓఎంఆర్ బండిల్స్‌ను రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు తరలించే నిమిత్తం వందకు పైగా ట్రక్కులు, కంటెయినర్‌లను తీసుకొచ్చి వర్సిటీ ప్రాంగణంలో పార్క్ చేశారు. క్యాంప్‌సలో విద్యార్థులు నడిచే రహదార్లకు ఇరువైపులా భారీ వాహనాలను నిలిపారు.
వేతనం ఇక్కడ.. విధులు అక్కడ..
జేఎన్‌టీయూ క్యాంపస్‌లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిలో సగం కంటే ఎక్కువమందిని టీజీపీఎస్సీ విధులకు తీసుకోవడంతో విద్యార్థులకు చదువు చెప్పేవారు కరువయ్యారు. వివిధ విభాగాల్లోని ప్రయోగశాలల్లో పనిచేసే టెక్నీషియన్స్‌ను కూడా టీజీపీఎస్సీ అధికారులు వదలకపోవడంతో దాదాపు అన్ని విభాగాల విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు దూరమయ్యారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌ను గ్రూప్ పరీక్షలన్నింటికీ కన్వీనర్‌గా నియమించడంతో సుమారు 8 వేలమంది విద్యార్థులకు ప్రిన్సిపాల్ రెండు నెలలుగా అందుబాట్లో ఉండడం లేదని పలుమార్లు విద్యార్థులు ఆందోళనకు దిగిన సందర్భాలున్నాయి.
టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్న మరొక మాజీ ప్రొఫెసర్ వర్సిటీ కాలేజీలో ఎమిరెటిస్ ప్రొఫెసర్‌గా రూ.లక్షకు పైగా వేతనం తీసుకుంటూ.. విధులు మాత్రం టీజీపీఎస్సీలో నిర్వహిస్తున్నారని అధ్యాపక సంఘాలు ఆరోపిస్తున్నాయి. యూనివర్సిటీ వాతావరణం కలుషితమవుతున్న తీరు సమంజసంగా లేదని వర్సిటీ ఇన్‌చార్జి వీసీకి, రిజిస్ట్రార్, రెక్టార్లకు తెలిసినప్పటికీ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆక్షేపిస్తున్నారు. జేఎన్‌టీయూలో వాహనాల పార్కింగ్ విషయమై రిజిస్ట్రార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్ ద్వారా వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాట్లోకి రాలేదు.
ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే
ఈవార్తను కూడా చదవండి: హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనల్లో.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై అనుమానాలు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్: కవిత
ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్ అవార్డు
Read Latest Telangana News and National News