Nagarjuna Sagar: బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం మంత్రి జూపల్లి
ABN , Publish Date - Jun 09 , 2024 | 04:36 AM
రాష్ట్రంలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
నాగార్జునసాగర్, జూన్ 8: రాష్ట్రంలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో 274 ఎకరాల్లో నిర్మితమైన బుద్ధవనం ప్రాజెక్టును శనివారం ఆయన నాగార్జునసాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డిలతో కలిసి సందర్శించారు. బుద్ధవనంలో బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం బుద్ధవనంలో కలియదిరిగారు. మహాస్తూపం లోపల కాసేపు ధ్యానం చేశారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
ప్రపంచానికి బౌద్ధ వారసత్వాన్ని, సంస్కృతిని చాటి చెప్పాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. నాగార్జునసాగర్‌ను పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చేస్తే ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పాటు దిశగా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నూతన ప్రతిపాదనలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.