TG: కాకతీయ కళాతోరణం.. చార్మినార్ తొలగింపు!
ABN , Publish Date - May 30 , 2024 | 03:43 AM
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఖరారైంది. రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. ఈ రెండు అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరామ్, రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్న రుద్ర రాజేశం తదితరులతో సమావేశమై చర్చించారు.
ఆ రెండు గుర్తులు సామాన్యులపై పెత్తనం చేసే ఆన వాళ్లుగా అభిప్రాయం.. 1969 తొలిదశ ఉద్యమ స్మృతులకు స్థానం
పోరాటపటిమ జ్వలించేలా రాజముద్ర.. వ్యవసాయం ప్రతిబింబించేలా ఏర్పాటు
సర్వమతాలకు ప్రతీకగా ఒక గుర్తు.. రాష్ట్ర అధికారిక చిహ్నం, గీతం ఖరారు
4 గంటలపాటు సీఎం భేటీ.. పాల్గొన్న భట్టి, కోదండరాం, అందెశ్రీ, కీరవాణి
చిహ్నంలో మార్పులపై బీఆర్‌ఎస్ ఆగ్రహం
రాష్ట్ర గీతాన్ని తెలంగాణ వారితోనే స్వరకల్పన చేసి పాడించాలని డిమాండ్
గతంలో పాడినవారు ఆంధ్రా వ్యక్తే కదా అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఖరారైంది. రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. ఈ రెండు అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరామ్, రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్న రుద్ర రాజేశం తదితరులతో సమావేశమై చర్చించారు. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తొలగించారు. కాకతీయుల కాలం అనగానే తెలంగాణ ప్రజలకు సమ్మక్క-సారలమ్మ దేవతలే గుర్తుకువస్తారని, కాకతీయులతోనే సమ్మక్క-సారలమ్మలు పోరాడారనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఇక చార్మినార్ అనగానే సామాన్యులను అణచివేసిన నవాబులు గుర్తుకువస్తారని, అందుకే రాష్ట్ర చిహ్నంలో ఈ రెండు గుర్తులను తొలగించాలని నిర్ణయించారు.
అదే సమయంలో కొన్ని కొత్త అంశాలను చిహ్నంలో చేర్చనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లో తొలిదశ ఉద్యమం జరిగిందని, నిజానికి తెలంగాణ అనే భావానికి తొలిదశ ఉద్యమమే బీజమని, కానీ.. ఆ ఉద్యమ స్ఫురణకు ఆనవాళ్లు ప్రస్తుత చిహ్నంలో కనిపించడంలేదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. అందుకే నాటి ఉద్యమ స్మృతులను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉండాలని నిర్ణయించారు. అదే విధంగా సర్వమతాలకు చిహ్నంలో ప్రాధాన్యం కల్పించారు. తెలంగాణ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రజల జీవనాధారం పాడి పంటలు అయినందున.. చిహ్నంలో రైతాంగం ప్రతిబింబించేలా కూడా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో దీనిని కూడా చేర్చాలని నిర్ణయించారు. ఇక దేశానికి గర్వకారణమైన అశోకచక్రాన్ని యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రునాయక్, గండ్ర సత్యనారాయణ, శాసనమండలి సభ్యుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బలరాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.
రెండు వెర్షన్‌లతో రాష్ట్ర గీతం ఖరారు..!
తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పనపైనా కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, రాష్ట్రఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ప్రతిరోజూ పాఠశాలల్లో విద్యార్థులు ప్రార్థనా గీతంగా, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రారంభ గీతంగా ఆలపించేందుకు అనువుగా 2.30 నిమిషాల నిడివితో ఒక వెర్షన్, 13:30 నిమిషాల నిడివితో రూపొందించిన రెండో వెర్షన్ రికార్డును సంగీత దర్శకుడు కీరవాణి వినిపించారు. ఇంతకుముందు సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి సూచలనకు అనుగుణంగా రెండు వెర్షన్‌లలో చేసిన మార్పులు, చేర్పులతో గీతాన్ని రూపొందించారు. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతాన్ని జూన్ 2న నిర్వహించబోయే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు.
రాజముద్రపై రగడ
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు, రాష్ట్ర గీతం ఆవిష్కరణపై రగడ మొదలైంది. అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర చిహ్నంలో ప్రజల ఆలోచనలు, ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఆ మేరకు పలు మార్పులు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేసినా, తెలంగాణ గీతాన్ని ఆంధ్రకు చెందిన సంగీత దర్శకునితో స్వరకల్పన చేయించినా సహించేదిలేదని బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. చిహ్నంలో కాకతీయ కళాతోరణం గుర్తును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ తదితరులు బుధవారం వరంగల్‌లో నిరసనకు దిగారు. ఓరుగల్లు పౌరుషమేంటో చూపిస్తామని హెచ్చరించారు.
ఇక అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని తెలంగాణ వారితోనే స్వరకల్పన చేసి పాడించాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్ విమర్శలపై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. 2004లో తొలిసారి ఈ పాటను గాయకుడు రామకృష్ణతో కేసీఆర్ రికార్డు చేయించారని, రామకృష్ణ ఆంధ్రాకు చెందిన వ్యక్తే కదా? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా.. యాదగిరిగుట్ట పునరుద్ధరణ పనులను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయికి అప్పగించారని, ఆయన కూడా ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే కదా? సచివాలయ నిర్మాణ పనులను కూడా మధ్యప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టు కంపెనీకి అప్పగించారు కదా? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా వేరే ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్‌తో చేయించారు కదా? అని కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. పాట రికార్డు అయ్యాక చివరలో ఈ రాద్ధాంతం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణాన్ని తొలగిస్తే కదనమే..
బీఆర్‌ఎస్ నేతలు వినోద్, సారయ్య, రాకేశ్
కాకతీయ తోరణం వద్ద నిరసన
మట్టెవాడ (వరంగల్): రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణాన్ని తొలగిస్తే ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్ నేతలు బి.వినోద్‌కుమార్, బస్వరాజు సారయ్య, ఏనుగుల రాకేశ్ హెచ్చరించారు. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని.. అవసరమైతే న్యాయపోరాటానికి దిగుతామన్నారు. బుధవారం సాయంత్రం వరంగల్ తూర్పు నియోజక వర్గం పరిధిలోని ఖిలావరంగల్‌లో కాకతీయ కళాతోరణం వద్ద వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డితో పాటు స్థానిక నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన రాష్ట్ర చిహ్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. కళాతోరణాన్ని తొలగిస్తే కాకతీయ పౌరుషాన్ని చూపుతామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సమైక్యవాదని, సమైక్య శక్తులు ఆడించినట్లు ఆడుతున్నారని మండిపడ్డారు. సుపరిపాలన, పాడిపంటలకు, ప్రజా సంక్షేమానికి కాకతీయుల పరిపాలన పెట్టింది పేరన్నారు. స్థానిక పురావస్తు శాఖ అధికారుల ఫిర్యాదుతో వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు ఖిలావరంగల్‌కు చేరుకొని నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ నేతలను బయటకు పంపారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఆందోళన చేసినందుకు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు.