కాంగ్రెస్‌లో అసమ్మతి గళం
ABN , Publish Date - Dec 19 , 2024 | 01:30 AM
అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుంటోంది. జిల్లా రాజకీయాలకు ఆయువు పట్టు కరీంనగర్ నియోజకవర్గంలోనే పార్టీని పట్టించుకునేవారే లేరని, నియోజకవర్గ ఇన్‌చార్జికి తెలియకుండా, కార్యకర్తల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిధులు కేటాయించడంలో, ఇతర కార్యక్రమాలు చేపట్టడంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుంటోంది. జిల్లా రాజకీయాలకు ఆయువు పట్టు కరీంనగర్ నియోజకవర్గంలోనే పార్టీని పట్టించుకునేవారే లేరని, నియోజకవర్గ ఇన్‌చార్జికి తెలియకుండా, కార్యకర్తల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిధులు కేటాయించడంలో, ఇతర కార్యక్రమాలు చేపట్టడంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ ఈ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్ డీసీసీ కార్యాలయంలోనే నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి తన అసంతృప్తి వెళ్లగక్కడం పార్టీలో కలకలం సృష్టిస్తున్నది. ఇంతకాలం మంత్రి పొన్నం ప్రభాకర్ వెన్నంటి ఉంటూ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న పురుమల్ల శ్రీనివాస్ పేరు చెప్పకుండానే పలు ఆరోపణలు చేస్తూ సమావేశంలో మాట్లాడడంతో అసమ్మతి ఇక రోడ్డున పడే సమయం వచ్చిందనే మాటలు వినవస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పురుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఆ సమయంలో పురుమల్ల శ్రీనివాస్ ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుని అండదండలతో అభ్యర్థిత్వాన్ని సాధించుకున్నారని ప్రచారం జరిగింది. ప్రస్తుత సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు కూడా ఆనాడు టికెట్ ఆశించగా నరేందర్‌రెడ్డికి ప్రస్తుత మంత్రి శ్రీధర్‌బాబు అండగా నిలిచారు. అయితే అధిష్టానవర్గం మాత్రం పురుమల్లకే అవకాశం కల్పించింది. ఆ ఎన్నికల్లో పురుమల్ల ఓడిపోవడంతో నియోజకవర్గ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. ఏడాదికాలంగా ఆయన మంత్రి పొన్నం వెంట తిరుగుతూ కార్యక్రమాలు చేపడుతూ వచ్చి ఏ రోజు కూడా ఏ విషయంలోనూ అసంతృప్తి వ్యక్తం చేయకుండా వచ్చారు. అయితే ఆయన బుధవారం డీసీసీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి తన అసంతృప్తిని వెళ్లడించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తుండగా ఈ పరిధిలోనే మంత్రులుగా పొన్నం ప్రభాకర్, డి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీధర్‌బాబు ఈ నియోజకవర్గ కేంద్రానికి వచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా దూరంగా ఉంటూ వస్తు న్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇన్‌చార్జిగా ఉన్నా పెద్దగా కార్యక్రమాలకు వచ్చి సమీక్షలు నిర్వహించింది లేదు. ఒకేసారి మాత్రమే ఆయన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రమే జిల్లా రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. ఆయన అనుచరునిగా ఉంటూ వస్తున్న పురుమల్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా మరో రెండు సమావేశాలు కూడా జరుగుతాయని ప్రకటించడంతో ఆయన అసంతృప్తి ప్రభుత్వంపైనా లేక మంత్రి పైనా అనే చర్చ జరుగుతున్నది. దీనిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలా స్వీకరిస్తారు అనే విషయం కూడా కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.
కార్యకర్తలకు న్యాయం చేయాలి
పురుమల్ల శ్రీనివాస్ సమావేశంలో తాను కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జి అయినప్పటికీ తనకు తెలియకుండానే నియోజకవర్గంలో నిధుల కేటాయిస్తూ తనను అవమానపరుస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న తనను సంప్రదించకుండానే 3 కోట్ల 9 లక్షల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధి నిధులలో 2 కోట్ల 70 లక్షలు నగరశివారులోని పీవీఆర్ గార్డెన్ ఎదురుగా సీసీ రోడ్‌కు పెట్టారని, అవే నిధులలో స్థానిక కార్యకర్తల సూచన మేరకు ఆయా ప్రాంతాల్లో 10 లక్షల రూపాయల చొప్పున పనులను కేటాయిస్తే పార్టీని అంటిపెట్టుకుని కష్టపడిన వారికి న్యాయం చేసినట్లు ఉండేదని ఆయన వాపోయారు. ఉజ్వలపార్క్ నిర్వహణ టెండర్‌ను, రూరల్ మండలంలోని ఒక ఇసుక క్వారీతోపాటు మానకొండూర్‌లో మరో ఇసుక క్వారీని పెద్ద నాయకుడు తన బంధువులకే ఇప్పించుకున్నారని పురుమల్ల సమావేశంలో ఆరోపించడం కలకలం సృష్టించింది. పార్టీకి, నాయకులకు కార్యకర్తలే బలమని, అటువంటి కార్యకర్తలను నాయకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్నప్పటికీ కరీంనగర్‌కు వచ్చే మంత్రుల పర్యటనల వివరాలు, కార్యక్రమాలు, నిధుల కేటాయింపు, వివిధ పదవుల నియామకాల కనీస సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నియోజకవర్గంలో తాను కార్యకర్తలకు ఏ సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నానని అన్నారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ, సుడా డైరెక్టర్ పదవులు, గ్రంథాలయ డైరెక్టర్ పదవులను భర్తీ చేయడం లేదని, అలాగే జిల్లాలోని ఆలయాలకు కమిటీలను ఏడాదైనా ఏర్పాటు చేయటంలేదని, ఈ నియామకాలు జరిగితే కనీసం 50, 60 మంది కార్యకర్తలకు అవకాశం లభించేదని అన్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు తనపై ఏ అస్ర్తాలు ప్రయోగించినా పర్వాలేదని, తాను గెలిచి వస్తానని అన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మల్లిఖార్జున రాజేందర్, పడిశెట్టి భూమయ్య, మహ్మద్ ఆరిఫ్, నాయకులు ఎండీ తాజ్, మోహనాచారి, దన్నా సింగ్, మనిగంటి అనిల్ తదితర వందమంది నాయకులు, కార్యకర్తలు పాల్గొనడంతో నియోజకవర్గ అసమ్మతి రాజకీయాలు బాహాటంగానే తెరపైకి వస్తున్నాయి.