Madaram: మేడారంలో ఇద్దరు మంత్రుల పర్యటన నేడు..
ABN , Publish Date - Jan 17 , 2024 | 08:07 AM
ములుగు జిల్లా: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో బుధవారం మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించనున్నారు. మహాజాతర ఏర్పాట్లను వారు పరిశీలించనున్నారు.
ములుగు జిల్లా: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో బుధవారం మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించనున్నారు. మహాజాతర ఏర్పాట్లను వారు పరిశీలించనున్నారు. అనంతరం మంత్రులు ఇద్దరూ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. సంక్రాంతి పండుగకి వరస సెలవులు కావటంతో పెద్ద సంఖ్యలో తల్లులను దర్శించుకుంటున్నారు. భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకుని దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కాగా ఫిబ్రవరి 21వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను విజయవంతంగా జరిపించాలని, మొత్తం పది జోన్లుగా పనులను విభజించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. రూ.75 కోట్ల నిధులతో మొదలుపెట్టిన పనులను ఈనెల 31లోగా పూర్తి చేయాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా చర్యలు చేపట్టాలని సూచించారు.