Share News

KTR: అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ మంత్రుల మాటల యుద్ధం

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:32 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజూ వాడీవేడీగానే ప్రారంభమయ్యాయి. మంగళవారం లాగే.. ఇవాళ కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. దవ్య వినిమయ బిల్లుకుపై చర్చ జరుగుతోంది.

KTR: అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ మంత్రుల మాటల యుద్ధం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజూ వాడీవేడీగానే ప్రారంభమయ్యాయి. మంగళవారం లాగే.. ఇవాళ కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. దవ్య వినిమయ బిల్లుకుపై చర్చ జరుగుతోంది. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,91,159 కోట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చ ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి కేటీఆర్ వర్సెస్ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో కోతలు, ఎగవేతలతో మసిబూసి మారేడుకాయ చేశారు. రైతు భరోసాకు బడ్జెట్ ఏదని ప్రశ్నించారు. పెన్షన్ డబుల్ చేసే కేటాయింపులు ఎక్కడని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు ఎన్నికల ముందు రజినీకాంత్, తర్వాత గజినీకాంత్‌లా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.


తెలంగాణ పోరాటాల గడ్డ.. మభ్యపెడితే ఊరుకోదని కేటీఆర్ అన్నారు. చార్జిషీట్లు, రికవరీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయాలన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్ ఒకటి విసిరారు. అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి వెళదామని.. ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చినట్లు యువకులు చెబితే అక్కడే రాజీనామా చేయడమే కాదు.. రాజకీయ సన్యాసం చేస్తానంటూ కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. పైగా రేవంత్, భట్టికి పౌర సన్మానం కూడా చేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు ఒక్కొకటి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. మేము చేయకపోతే ప్రజలే మాకు బుద్ది చెబుతారన్నారు. కొంచెం ఓపికగా ఉండాలని తెలిపారు. దీనికి తిరిగి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.


ఓపికగా ఉండాల్సింది మంత్రులు అని.. తాము కాదని కేటీఆర్ పేర్కొన్నారు. వంద రోజులలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ఎవరు చెప్పమన్నారని ప్రశ్నించారు. పోస్టులు పెంచమంటే పోలీస్‌లతో దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. సన్నాసులు గ్రూప్ 2 వాయిదా వేయమంటున్నారని సీఎం రేవంత్ అవమానిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. జీవో 46సవరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సత్యదూరంగా మాట్లాడుతున్నారని.. బీఆర్ఎస్ కూడా మాకు పోటీగా హామీలు ఇచ్చిందన్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదన్నారు. కాంగ్రెస్ తోనే మార్పు సాధ్యం అని ప్రజలు నమ్మారన్నారు. మమ్మల్ని గెలిపించారని.. మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. దళితుడిని సీఎం చేస్తామని చెప్పి ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. వారికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు ఉందా? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మొదటి బడ్జెట్‌కే ఇంత భయపడితే.. మరో నాలుగు బడ్జెట్‌లు ప్రవేశ పెడితే ఎంత భయపడతారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి...

‘ఎనీవేర్‌’.. భూముల చోర్‌!

Congress Government : మూడో విడత రుణమాఫీ.. రెండు దఫాల్లో!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 31 , 2024 | 11:52 AM