Share News

Seethakka : పప్పు, ఉప్మా అంటేనే విరక్తి!

ABN , Publish Date - Sep 23 , 2024 | 04:06 AM

‘పేద గిరిజన కుటుంబంలో పుట్టాను.. నా చిన్నతనం నుంచి ఇంట్లో పప్పు ఎక్కువ వండే వారు.. ఆ తర్వాత హాస్టల్లోనూ పప్పే ఎక్కువ వడ్డించేవారు..

Seethakka :  పప్పు, ఉప్మా అంటేనే విరక్తి!

  • ఐదేళ్లకు ముందు నేనూ రక్తహీనతతో బాధపడ్డా

  • బాలికలు రక్తహీనత బారిన పడకుండా గిరిజన పోషణ మిత్ర అమలు.. భేష్‌

  • త్వరలోనే అన్ని ఆశ్రమ స్కూళ్లలో అమలు: సీతక్క

ఉట్నూర్‌, సెప్టెంబరు 22: ‘పేద గిరిజన కుటుంబంలో పుట్టాను.. నా చిన్నతనం నుంచి ఇంట్లో పప్పు ఎక్కువ వండే వారు.. ఆ తర్వాత హాస్టల్లోనూ పప్పే ఎక్కువ వడ్డించేవారు.. అజ్ఞాతంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ ఉప్మా తినే వాళ్లం. దీంతో పప్పు భోజనం, ఉప్మా అంటేనే నాకు విరక్తి వచ్చింది’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఐదేళ్లకు ముందు తానుకూడా రక్తహీనతతో బాధపడ్డానని, ప్రస్తుతం దాన్నుంచి బయట పడ్డానని తెలిపారు. 12 శాతం హిమోగ్లోబిన్‌ ఉండాల్సి ఉండగా.. తనలో ఎప్పుడూ 8 శాతమే ఉండేదని తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లోని బాలికలు చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించి.. ఉట్నూర్‌ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్భుగుప్తా మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 60 ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన పోషణ మిత్ర అమలు చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల పరిధిలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలల్లో విస్తరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో గిరిజన పోషణ మిత్రను ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నతాధికారులు తమ ఆలోచనలతో బాలికల సంక్షేమం కోసం కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాను మంత్రి సీతక్కతోపాటు జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా, ఎస్పీ గౌస్‌ఆలం, ఎమ్మెల్యే బొజ్జుపటేల్‌, ఎమ్మెల్సీ దండేవిఠల్‌ అభినందించారు.

Updated Date - Sep 23 , 2024 | 04:06 AM