Seethakka: ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Aug 10 , 2024 | 03:18 AM
ఆదివాసీ, గిరిజన జాతులను అభివృద్ధి పథంలో నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
వారి కోసం 17 వేల కోట్లకు పైగా బడ్జెట్.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఆదివాసీ, గిరిజన జాతులను అభివృద్ధి పథంలో నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఎస్టీల సంక్షేమం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌లో రూ.17 వేల కోట్లకు పైగా కేటాయించామని చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమరం భీం ఆదివాసీ భవన్‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు మంత్రి సీతక్క హాజరయ్యారు. ఆదివాసీ గూడేలకు అభివృద్ధి ఫలాలు అందినపుడే సమాజం పురోగమిస్తుందని ఈ సందర్భంగాన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీలకు అటవీ భూముల మీద హక్కులు కల్పిస్తూ అటవీ హక్కుల చట్టం తీసుకొస్తే.. దానికి తూట్లు పొడిచేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. గ్రామ సభల అనుమతులు లేకుండానే ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ చేసేలా కేంద్రం చట్ట సవరణ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. తనకు 8 మంది అక్కా చెల్లెళ్లు ఉన్నారని.. సీతక్క తొమ్మిదో సోదరి అని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ, గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.