ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DS No More : డీఎస్‌ కన్నుమూత..

ABN, Publish Date - Jun 30 , 2024 | 04:03 AM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు.

  • కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ మృతి

  • హైదరాబాద్‌లోని నివాసంలో గుండెపోటు

  • ఉమ్మడి ఏపీలో రెండుసార్లు పీసీసీ చీఫ్‌

  • పార్టీని అధికారంలోకి తేవడంలో విశేష కృషి

  • మూడుసార్లు ఎమ్మెల్యే.. మంత్రిగా బాధ్యతలు

  • 2015లో బీఆర్‌ఎస్‌లోకి.. రాజ్యసభకు..

  • చివరి రోజుల్లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరిక

  • నేడు నిజామాబాద్‌లో అంత్యక్రియలు

  • హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు

నిజామాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు. ఆయన వయసు 75 ఏళ్లు. ఆయనకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌ గతంలో నిజామాబాద్‌ మేయర్‌గా పనిచేశారు. చిన్న కుమారుడు అర్వింద్‌, బీజేపీ పార్టీ తరఫున రాజకీయాల్లో ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి మరోసారి ఎంపీగా గెలుపొందారు. డీఎస్‌ తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం కాంగ్రె్‌సలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రత్యేకించి మలి విడత తెలంగాణ ఉద్యమం రోజుల్లో ప్రజల్లో ఉన్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను పార్టీ అధిష్ఠానం వద్ద గట్టిగా వినిపించారు. ‘ట్రబుల్‌ షూటర్‌’గా పేరున్న డీఎస్‌, ఉమ్మడి రాష్ట్రంలో 2004, 2009లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకుకావడంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో కలిసి విశేషంగా కృషిచేశారు.


సోనియా గాంధీకి విధేయుడిగా కొనసాగిన ఆయన 2004లో బీఆర్‌ఎ్‌సతో కాంగ్రెస్‌ పొత్తు కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు. నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూర్‌లో 1948 సెప్టెంబరు 27న డీఎస్‌ జన్మించారు. హైదరాబాద్‌ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. కొంత కాలం రిజర్వ్‌ బ్యాంకులో పనిచేశారు. అప్పట్లో నిజామాబాద్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజీ మంత్రి అర్గుల్‌ రాజారాం శిష్యుడిగా 1981లో డీఎస్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు. నిజామాబాద్‌ అర్బన్‌ స్థానం నుంచి 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్‌ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2011లో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 2013-15 మధ్య మండలిలో విపక్ష నేతగా కొనసాగారు. 2015 జూలై 2న ఆయన బీఆర్‌ఎ్‌సలో చేరారు. అప్పటి సీఎం కేసీఆర్‌ ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. బీఆర్‌ఎస్‌ తరఫున 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. నిరుడు ఆయన బీఆర్‌ఎస్‌ను వీడి మళ్లీ కాంగ్రె్‌సలో చేరారు. తీవ్ర అనారోగ్య కారణాలతో పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.


నిజామాబాద్‌ అభివృద్ధిలో కీలకపాత్ర

నిజామాబాద్‌ అభివృద్ధికి డీఎస్‌ కృషిచేశారు. నిజామాబాద్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలోనే కార్పొరేషన్ల ఏర్పాటుకు, నిజామాబాద్‌లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తిచేయించారు. ఉద్యమ రోజుల్లో జిల్లాలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటులో కీలకపాత్ర వహించారు. నిజామాబాద్‌లో రాజారాం స్టేడియం ఏర్పాటు చేయించడంతోపాటు వేలాది మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. నగరం పరిధిలో ఆయన పేరు మీద ధర్మపురి హిల్స్‌కాలనీ ఏర్పాటైంది.


పార్టీకి విశేష సేవలందించారు: రేవంత్‌

డీఎస్‌ మృతిపట్ల గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ దిగ్ర్భాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం డీఎస్‌ అవిశ్రాంతంగా పోరాడారని, ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. డీఎస్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌గా పనిచేసిన ఆయన, కాంగ్రెస్‌ పార్టీకి విశేష సేవలు అందించారని, తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని కొనియాడారు. డీఎస్‌ అంత్యక్రియలు ఆదివారం నిజామాబాద్‌లోని బైపా్‌సరోడ్డు పక్కన వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. డీఎస్‌ పార్థివ దేహాన్ని శనివారం హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ ప్రగతినగర్‌లోని ఆయన ఇంటికి తరలించారు. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ శాంతికుమారికి సూచించారు. డీఎస్‌ అంత్యక్రియలకు రేవంత్‌ హాజరుకానున్నారు. డీఎస్‌ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన హుందాతనంతో కూడిన రాజకీయాలు చేశారని.. మంత్రి, ఎంపీగా తనదైన ముద్రవేశారని పేర్కొన్నారు.


బంజారాహిల్స్‌లోని డీఎస్‌ ఇంట్లో ఆయన పార్థివదేహం వద్ద కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి, జూపల్లి, ఎంపీలు బలరాం నాయక్‌, ఈటల, విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, రఘునందన్‌ రావు, మాజీ ఎంపీలు వీహెచ్‌, కేకే, మాజీ స్పీకర్‌ పోచారం, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, తలసాని, జగదీశ్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, ప్రొఫెసర్‌ కోదండరాం నివాళులర్పించారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుయాష్కీ, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌ మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా నివాళులర్పించారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతలు మల్లు రవి, రేణుకాచౌదరీ, మధుయాష్కీ, జితేందర్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఓ మంచి నాయకుడిని కోల్పోయిందని వెంకయ్యనాయుడు అన్నారు. పార్టీలు వేరైనా అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో డీఎస్‌ చెప్పేవారని కిషన్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో డీఎస్‌ అజాతశత్రువులా మెలిగారని కేటీఆర్‌ అన్నారు. తమ కుటుంబానికి డీఎస్‌ సన్నిహితులని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.


శీనన్న ఇక లేడు: అర్వింద్‌

తన తండ్రి మృతిపై ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తీవ్ర ఆవేదనతో సోషల్‌ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్టు పెట్టారు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘అన్న అంటే నేనున్నానని ఏ ఆపదలోనైనా ఆదుకునే శీనన్న ఇకలేడు. ఐ విల్‌ మిస్‌యూ డాడ్‌’ అని పోస్టులో పేర్కొన్నారు. ఆయన తనకు తండ్రి, గురువుతోపాటు రాజకీయాల్లో అన్ని నేర్పారని చెప్పారు. ప్రజల కోసం ఎలా పనిచేయాలో ఆయనను చూసి నేర్చుకున్నానని, ఆయన ఎప్పుడు తనవెంటే ఉంటాడని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన తండ్రి మృతివార్త తెలియగానే హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు.


డీఎస్‌ కోరికను తీర్చిన కాంగ్రెస్‌

డీఎస్‌ చివరి కోరికను తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తీర్చింది. తనకు రాజకీయ జీవితాన్ని, అత్యున్నత పదవులను ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని, భూమి మీద నుంచి తాను వెళ్లేటప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వాడిగానే వెళ్లాలన్నది తన కోరికని సన్నిహుతుల వద్ద డీఎస్‌ చెప్పేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లిన ఆయన.. తిరిగి సొంత గూటికి చేరాలని 2018 ఎన్నికల సమయం నుంచీ ప్రయత్నించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత.. ఆయనను కాంగ్రె్‌సలోకి తీసుకువచ్చే ప్రయత్నాలూ జరిగాయి. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ కాంగ్రె్‌సకు దగ్గరయ్యారు. శనివారం డీఎస్‌ ఇంటికి వెళ్లి ఆయన పార్థివదేహంపై మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు, టీపీపీసీ సీనియర్‌ ఉపాఽధ్యక్షుడు నిరంజన్‌ కాంగ్రెస్‌ జెండాను కప్పారు. ఆయన మరణానికి సంతాప సూచకంగా గాంధీభవన్‌లో పార్టీ పతాకాన్ని అవనతం చేశారు. ఫలితంగా డీఎస్‌ చివరి కోరికను కాంగ్రెస్‌ తీర్చినట్లయింది.

Updated Date - Jun 30 , 2024 | 06:00 AM

Advertising
Advertising