Share News

‘ట్యాపింగ్‌’ తేలితే కఠిన చర్యలే!

ABN , Publish Date - Apr 20 , 2024 | 07:37 AM

తెలంగాణలో కేసీఆర్‌ పదేళ్ల పాలనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ చెప్పారు. కాళేశ్వరం మొదలుకొని ఫోన్‌ ట్యాపింగ్‌ వరకు అన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ నిజమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

‘ట్యాపింగ్‌’ తేలితే కఠిన చర్యలే!

- తెలంగాణలో టెలిగ్రాఫ్‌ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవు

- కేసీఆర్‌ పదేళ్ల పాలనపై అనేక ఆరోపణలు

- తెలంగాణలో బీజేపీకి 10 సీట్లు పక్కా

- ‘ఆంధ్రజ్యోతి’తో అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కేసీఆర్‌ పదేళ్ల పాలనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ చెప్పారు. కాళేశ్వరం మొదలుకొని ఫోన్‌ ట్యాపింగ్‌ వరకు అన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ నిజమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా దేశంలో ఒకరి ఫోన్‌ను మరొకరు ట్యాప్‌ చేయడం కుదరదని చెప్పారు. తెలంగాణలో టెలిగ్రాఫ్‌ చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్లయితే, కేంద్రం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేకనే ప్రతిపక్షాలు ఈవీఎంల విషయంలో అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు.ఎన్నికల బాండ్ల విషయంలోనూ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలోని తన నివాసంలో ఠాకూర్‌ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. తెలంగాణలో పది లోక్‌సభ సీట్లకు తగ్గకుండా గెలుస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ హవా కొనసాగుతోందని.. తెలంగాణలోనూ ఆ ప్రభావం బలంగా ఉందని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకున్నామని.. ఈ సారి అది రెండు నుంచి మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు కేసీఆర్‌ నియంతృత్వ పోకడలతో ప్రజలు విసిగిపోయారని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా కాంగ్రె్‌సకు ఓటేశారని తెలిపారు. కాంగ్రెస్‌ ఆకర్షక హామీలను చూసి ప్రజలు మోసపోయారన్నారు. కానీ, ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ప్రజలు ఈ సారి బీజేపీకి ఓటెయ్యబోతున్నారని తెలిపారు.

మద్యం కేసులో కవితది కీలకపాత్ర

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్‌ కుమార్తె కవితది కీలకపాత్రని ఠాకూర్‌ అన్నారు. దేశంలో అవినీతిపై పదేళ్ల నుంచి ప్రధానిమోదీ యుద్ధం చేస్తున్నారని తెలిపారు. కవిత జైల్లో ఉండి దర్యాప్తు సంస్థలపై, కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. ఇక ఇదే కుంభకోణంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నిజాయతీ ముసుగు తొలగిపోయిందని ఠాకూర్‌ తెలిపారు. పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలకే అక్కడి వైద్యారోగ్య శాఖ మంత్రి అవినీతి ఆరోపణలతో రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో ఆప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి దారుణంగా మారిందన్నారు.

ఏపీలో ఎన్డీయేదే విజయం..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోందని ఠాకూర్‌ చెప్పారు. ఏపీలో జగన్‌ పరిపాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 110 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని చెప్పారు. జూన్‌లో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలోనూ అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే శక్తిమంతమైన నేత నరేంద్ర మోదీ అని ఠాకూర్‌ తెలిపారు. ‘‘పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. మోదీ సారథ్యంలో దేశ కీర్తి ఎన్నో రెట్లు పెరిగింది. ఒకప్పుడు ప్రతి చిన్న దానికి భారత్‌ ప్రపంచ దేశాల వైపు చూడాల్సి వచ్చేదని.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఏ సహాయం కావాలన్నా భారత్‌ వైపు చూస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే దేశాన్ని పాకిస్థాన్‌, చైనా వంటి దేశాలకు అప్పగించినట్టేనని.. ఈ విషయాన్ని దేశమంతా గ్రహించిందన్నారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల ప్రజలు సైతం మోదీయే ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచాక అసెంబ్లీ సాక్షిగా జై పాకిస్థాన్‌ నినాదాలు విన్నామని.. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సారి అత్యధిక స్థానాలను బీజేపీ కేౖవసం చేసుకోబోతుందని తెలిపారు. ఏపీ, తెలంగాణలోనే సుమారు 30 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. దేశమంతా మోదీ నాయకత్వాన్ని కోరుకుంటోందని, అందుకే ‘మోదీ కా గ్యారెంటీ’ పేరిట మేనిఫెస్టోను తీసుకొచ్చామని తెలిపారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి, జమిలి ఎన్నికలు ఎంతో అవసరమని.. బీజేపీతోనే ఇవన్నీ సాధ్యమని స్పష్టం చేశారు.

Updated Date - Apr 20 , 2024 | 07:37 AM