Hyderabad: తెలంగాణకు కీలక శాఖలు!
ABN, Publish Date - Jun 11 , 2024 | 03:38 AM
కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు రెండు కీలక పదవులు దక్కాయి. కేంద్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే బొగ్గు, గనుల శాఖను కిషన్‌రెడ్డికి కేటాయిస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించే హోంశాఖకు సహాయ మంత్రిగా బండి సంజయ్‌ని నియమించారు.
కేబినెట్ మంత్రి కిషన్‌రెడ్డికి బొగ్గు, గనుల శాఖ.. హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్
రాష్ట్రానికి మూడోసారి హోం
రెండోసారి బొగ్గు శాఖ నిర్వహించేచాన్స్
కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటల భేటీ
హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు రెండు కీలక పదవులు దక్కాయి. కేంద్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే బొగ్గు, గనుల శాఖను కిషన్‌రెడ్డికి కేటాయిస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించే హోంశాఖకు సహాయ మంత్రిగా బండి సంజయ్‌ని నియమించారు. కాగా, దేశ అభివృద్ధిలో బొగ్గు ఉత్పత్తి కీలకంగా మారడం, సింగరేణి వంటి సంస్థలు ఇక్కడే కొనసాగుతున్న నేపథ్యంలో కిషన్‌రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించడం రాష్ట్రాభివృద్ధికి మరింత దోహదపడుతుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ శాఖను గతంలో దివంగత నేత దాసరి నారాయణరావు కూడా నిర్వహించారు. తొలుత 2004లో సహాయ మంత్రి హోదాలో ఈ శాఖను నిర్వహించగా, ఆ తర్వాత ఇండిపెండెంట్ మంత్రిగా వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ ప్రాంతం నుంచి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. తాజాగా కిషన్‌రెడ్డిని ఈ శాఖ వరించింది.
మోదీ 2.0 ప్రభుత్వంలో కిషన్‌రెడ్డి తొలుత హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు పర్యాటకం-సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కేబినెట్ హోదా కల్పించారు. ఇక తెలంగాణలో అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం.. అందులో భాగంగానే బండి సంజయ్‌కి హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సంజయ్ డూకుడుగా వ్యవహరించడం తెలిసిందే. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన పలు సందర్భాల్లో ఆయన పోలీసు నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఒకటి రెండు సందర్భాల్లో ఎస్పీ స్థాయి అధికారులు ఆయనపై చేయి కూడా చేసుకున్నారు.
అప్పట్లో ఈ ఘటనపై సంజయ్ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా.. సదరు అధికారి ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో.. సంజయ్‌కి హోంశాఖ సహాయమంత్రి పదవిని కేటాయిస్తే.. రాష్ట్ర పోలీసులు మునుపటిలా ఆయన విషయంలో దురుసుగా ప్రవర్తించే అవకాశాలుండవని బీజేపీ సీనియర్ నేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో వ్యాఖ్యానించారు. కాగా, గతంలో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు 1999లో వాజపేయి కేబినెట్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవిని చేపట్టారు. మోదీ 2.0లో కిషన్‌రెడ్డి కూడా తొలుత ఈ శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా బండి సంజయ్‌కి దక్కడంతో గడచిన రెండున్నర దశాబ్దాల్లో తెలంగాణ వ్యక్తులకు ఈ శాఖ మూడోసారి దక్కినట్లయింది.
అమిత్ షాతో ఈటల భేటీ
మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఎన్నికైన ఈటల రాజేందర్ సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖకు నూతన అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌ను నియమిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: బండి సంజయ్
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నూటికి నూరుపాళ్లు నిలబెట్టుకుంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని, తన శాఖ ద్వారా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.
Updated Date - Jun 11 , 2024 | 03:38 AM