Share News

Khammam: ‘సీతారామ’ ట్రయల్‌ రన్‌ విజయవంతం

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:19 AM

భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో గోదావరిపై నిర్మించిన సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. గురువారం బీజీ కొత్తూరు వద్ద ఉన్న మొదటి లిఫ్ట్‌ పంప్‌ హౌస్‌లోని ఆరు మోటార్లలో ఒకదానికి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, సీతారామ ఎత్తిపోతల చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరెడ్డి స్విచాన్‌ చేశారు.

Khammam: ‘సీతారామ’ ట్రయల్‌ రన్‌ విజయవంతం

  • బీజీ కొత్తూరు పంప్‌హౌస్‌ నుంచి 9 వేల క్యూసెక్కుల పంపింగ్‌

  • త్వరలో సీఎం రేవంత్‌ చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు

  • నా రాజకీయ ఆకాంక్ష నెరవేరబోతోంది: మంత్రి తుమ్మల

  • ఎన్ని ఆటంకాలున్నా రైతుల రుణమాఫీ చేసి తీరుతాం

  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి..

  • కొత్తగూడెంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన

  • సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభం

  • నా ఆకాంక్ష నెరవేరబోతోంది: తుమ్మల

ఖమ్మం, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/కొత్తగూడెం, అశ్వాపురం: భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో గోదావరిపై నిర్మించిన సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. గురువారం బీజీ కొత్తూరు వద్ద ఉన్న మొదటి లిఫ్ట్‌ పంప్‌ హౌస్‌లోని ఆరు మోటార్లలో ఒకదానికి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, సీతారామ ఎత్తిపోతల చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరెడ్డి స్విచాన్‌ చేశారు. దీంతో.. గోదావరి నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా పంప్‌హౌ్‌సకు చేరిన నీరు ప్రధాన కాలువలోకి దుంకింది. ఈ దృశ్యాన్ని చూసి మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. తన ఆకాంక్ష నెరవేరబోతోందన్నారు. అధికారులను అభినందించి భూ మాత, గోదావరి జలాలకు, సీతారామచంద్రస్వామికి నమస్కరించారు. సీతారామకు భూములిచ్చిన రైతుల త్యాగాన్ని కొనియాడారు.


వారికి పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ పంప్‌హౌస్‌ ద్వారా 9 వేల క్యూసెక్కుల గోదావరి జలాలను ఎత్తిపోస్తామన్నారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఏన్కూరు లింక్‌ కెనాల్‌ ద్వారా వైరా ప్రాజెక్టుకు అనుసంధానం చేసి సాగర్‌ ఆయకట్టుకు నీరిస్తామని చెప్పారు. సాగునీటి శాఖ, జిల్లా మంత్రుల సహకారంతో రెండేళ్లలో సీతారామను పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలో 10లక్షల ఎకరాలకు నీరిస్తామని వివరించారు. ఆగస్టు నాటికి ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం లిఫ్ట్‌లనూ అందుబాటులోకి తెస్తామన్నారు. ఏన్కూర్‌ లింక్‌ కెనాల్‌ పూర్తి చేసి చెరువులను నింపుతామని తెలిపారు. ఇల్లెందుకూ సాగునీరిచ్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.


ఫలించనున్న మంత్రి తుమ్మల కృషి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7.88 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా దుమ్ముగూడెం (సీతారామ) నుంచి గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించడం తుమ్మల దశాబ్దాల కల. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడే దీనికి కృషి చేశారు. అప్పట్లో సాకారం కాకున్నా, తెలంగాణ ఏర్పడి ఆర్‌అండ్‌బీ మంత్రి అయ్యాక మళ్లీ ప్రయత్నం చేశారు. నాటి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మూడు భారీ లిఫ్ట్‌లతో రూ.13,500 కోట్లతో సీతారామ పనులు చేపట్టారు. మూడేళ్లు పనులు వేగంగా జరిగినా 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమి, గత ప్రభుత్వం కాళేశ్వరంపై దృష్టిసారించడంతో సీతారామకు నిధుల కొరత ఏర్పడింది. ఇటీవలి ఎన్నికల్లో గెలిచి మంత్రి అయిన తుమ్మల.. సీఎం రేవంత్‌ భద్రాచలం వచ్చినప్పుడు సీతారామ కు కొద్దిమొత్తంలో నిధులు కేటాయిస్తే ఈ ఏడాదే గోదావరి జలాలను సాగుకు అందించవచ్చని తెలిపారు. సీఎం అంగీకరించడంతో పనులు వేగిరమయ్యాయి. వైరా రిజర్వాయర్‌కు రూ.72 కోట్లు మంజూరు చేయించి ఏన్కూర్‌ లింక్‌ కెనాల్‌ పనులను ప్రారంభించారు. వీటిని ఆగస్టు 15కే పూర్తి చేయనున్నారు. పూసుగూడెం, కమలాపురం పంప్‌హౌస్‌ల ట్రయల్‌ రన్‌కు చైనాకు చెందిన ఇంజనీర్లను రప్పిస్తున్నారు. ప్రజా ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ ఫలితమే సీతారామ ప్రాజెక్టుకు గోదావరి జలకళ అని కాంగ్రెస్‌ పేర్కొంది. జనవరి 7న సీఎం రేవంత్‌ ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారని గుర్తు చేసింది. ఆరు నెలల్లో పూర్తయ్యేలా మంత్రి తుమ్మల కృషి చేశారని వివరించింది.


కొత్తగూడెంలో రూ.130 కోట్లతో పనులు

కొత్తగూడెంలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు అమృత్‌ పథకం కింద రూ.125కోట్లతో చేపట్టనున్న పథకానికి ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు. బైపాస్‌ రోడ్డు నుంచి పోస్టాఫీస్‌ సెంటర్‌ వరకు రూ.4 కోట్లతో డ్రైనేజీ నిర్మాణానికి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. భట్టితో పాటు మంత్రులు మాట్లాడుతూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు. ‘రైతు భరోసా’పై అసెంబ్లీలో చర్చించి సాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2024 | 04:19 AM