Share News

Yearender 2024: ఢిల్లీ మద్యం కుంభకోణం.. రాజకీయ ప్రకంపనలు

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:26 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ మళ్లీ సత్తా చాటి.. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటోందా? లేకుంటే అధికార పీఠాన్ని మరో పార్టీ హస్త గతం చేసుకోంటుందా?

Yearender 2024: ఢిల్లీ మద్యం కుంభకోణం.. రాజకీయ ప్రకంపనలు

ఈ ఏడాది ఢిల్లీ మద్యం కుంభకోణం... రాజకీయంగా పెను సంచలనమే సృష్టించింది. ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు వయా ఆంధ్రప్రదేశ్ వేదికగా సాగిన ఈ కుంభకోణం వ్యవహారం.. అధికార పార్టీల పీఠాలను కదిలించాయి. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆ పార్టీలోని కీలక నాయకుల నుంచి తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత, నాటి సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో నాటి అధికార పార్టీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు రాఘవరెడ్డితోపాటు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమీప బంధువు శరత్ చంద్రారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి.


mask.jpg

సిసోడియా అరెస్ట్‌తో మొదలు..

ఈ కుంభకోణం వ్యవహారంలో నాటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తొలుత అరెస్ట్ చేసింది. దీంతో ఈ వ్యవహారంలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ అరవింద్ కేజ్రీవాల్‌ను వివిధ రాజకీయ పార్టీలు ప్రధానంగా డిమాండ్ చేశాయి. ఇక మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన వెంటనే.. తన డిప్యూటీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం రాజీనామా చేయలేదు. ఇంతలో ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. అనంతరం వీరంతా బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. కానీ వీరికి బెయిల్ మాత్రం లభించ లేదు.


సార్వత్రిక ఎన్నికలు..

women.jpg

ఇంతలో సార్వత్రిక ఎన్నికలు దూసుకొచ్చాయి. ఈ ఎన్నికల్లో తన పార్టీ తరఫున ప్రచారం నిర్వహించుకోవాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌.. కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు షరతులో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం నిర్వహించుకొని.. చివర విడత పోలింగ్ ప్రచారం ముగిసిన వెంటనే తీహాడ్ జైల్లో లొంగిపోవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. తిరిగి తీహాడ్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం లోక్ సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. దీంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ వైపు ఓటర్లు మొగ్గు చూపలేదన్నది సుస్పష్టం.


ఢిల్లీ సీఎం పదవికి గుడ్ బై..

arvind.jpg

ఆ కొద్ది నెలలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిలు కోర్టు మంజూరు చేసింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. అనంతరం ఈ పదవికి కేజ్రీవాల్ కేబినెట్‌లోని సీనియర్ మంత్రి అతిషిని పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. దీంతో ఆమె ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు.. ఆ కొద్ది రోజులకే ఆప్ నేత మనీష్ సిసోడియాకు సైతం బెయిల్ మంజూరు అయింది. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఎంపీ తనయుడు రాఘవరెడ్డితోపాటు విజయసాయిరెడ్డి సమీప బంధువు శరత్ చంద్రారెడ్డిలకు కూడా బెయిల్‌పై విడుదలయ్యారు.


ఎల్జీ సూచన మేరకు..

LG.jpg

ఢిల్లీ మద్యం విక్రయాల్లో మార్పులు చేర్పులు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. అందుకు సంబంధించిన ఫైల్‌ ఆమోదం కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాకు పంపింది. ఈ ఫైల్‌లోని పలు అంశాల పట్ల ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో దీనిపై విచారణ జరపాలంటూ ఈడీకి ఆయన సూచించారు. అలా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ మద్యం కుంభకోణం కేసులో రూ.100 కోట్ల మేర ముడుపులు చేతులు మారాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అలా ఈ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగింది.


అందుకే రాజీనామా..

athishi.jpg

ఇంకోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతానంటూ.. ఆ పదవికి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసే సమయంలో ప్రకటించారు. మరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ మళ్లీ సత్తా చాటి.. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటోందా? లేకుంటే అధికార పీఠాన్ని మరో పార్టీ హస్త గతం చేసుకోంటుందా? అంటే.. ఎన్నికల ఫలితాల వెలువడే వరకు ఆగాల్సిందే.


మరికొద్ది రోజుల్లో మోగనున్న అసెంబ్లీ ఎన్నికల నగారా..

Delhi assembly.jpg

ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజుల్లో నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థుల జాబితాలను ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే విడుదల చేశారు. ఇంకోవైపు.. ఈ మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా అనుమతి ఇచ్చారంటూ ఓ ప్రచారం అయితే దేశ రాజధానిలో జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఘాటుగా స్పందించింది. ఆమ్ ఆద్మీ పార్టీని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకొందంటూ బీజేపీపరై ఆ పార్టీ అగ్రనేతలు కారాలు మిరియాలు నూరుతోన్నారు. ఏదీ ఏమైనా ఈ ఏడాది మాత్రం ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహరం మాత్రం.. రాజకీయంగా ప్రాంతీయ పార్టీల్లో తీవ్ర అలజడినే రేపాయన్నది సుస్పష్టం.

For Rewind 2024 News కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

For National News And Telugu News

మరిన్నీ తెలుగు వార్తలు కోసం.

Updated Date - Dec 23 , 2024 | 04:29 PM