మూడోవారంలో టెన్త్ ఫలితాలు!
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:15 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ గురువారం నుంచి ఏలూరు సెయింట్ గ్జేవియర్ హైస్కూలులో ప్రారంభమవుతుంది.

రేపటి నుంచి జవాబుపత్రాల మూల్యాంకన
ముగిసిన పదో తరగతి పరీక్షలు
7నుంచి ఇంటర్ ‘ప్రథమ’ బ్రిడ్జి క్లాసులు
ఏలూరు అర్బన్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ గురువారం నుంచి ఏలూరు సెయింట్ గ్జేవియర్ హైస్కూలులో ప్రారంభమవుతుంది. స్పాట్ వాల్యూ యేషన్ ఈనెల 9న ముగియనుం డగా, తదుపరి ప్రక్రియలను పూర్తిచేసి ఫలితాలను ఈ నెల 20–25 తేదీల మధ్య ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చి 17 నుంచి ప్రారంభమైన టెన్త్ పరీక్షలకు రెగ్యులర్, వన్స్ ఫెయిల్డ్ విభాగాల్లో కలిపి మొత్తం 25,179 మంది దరఖాస్తు చేసుకోగా, సార్వత్రిక విద్యా పీఠం దూరవిద్య విభాగంలో మరో 793 మంది అభ్యాసకులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నా రు. పరీక్షల నిర్వహణలో పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్ల సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన ఆరు హైస్కూళ్లతో సహా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా పరిశీలకుడు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, డీఈవో వెంకట లక్ష్మమ్మ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్ వివరించారు. కాగా మూల్యాంకన నిమిత్తం వివిధ జిల్లాల నుంచి మొత్తం 1.85 లక్షల జవాబు పత్రాలు అన్ని సబ్జెక్టుల నుంచి జిల్లాకు కేటాయించారు. స్పాట్ విధుల కోసం 140 మంది సీఈలు, 840 మంది ఏఈలు, 230 మంది స్పెషల్ అసిస్టెంట్లు, ఏడుగురు క్యాంపు ఆఫీసర్లను జిల్లా విద్యాశాఖ నియమించింది. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని మూల్యాంకన విధులకు హాజరయ్యే సిబ్బందికి సౌకర్యార్థం స్పాట్ క్యాంపు ప్రాంగణంలో సరిపడినన్ని ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు, మూడు పూటలా వాటరింగ్ చేయాలని ఆదేశించామని జిల్లా పరిశీలకుడు కృష్ణారెడ్డి వివరించారు. శానిటేషన్, వైద్య శిబిరం ఉంటాయని, విద్యాశాఖ జారీచేసిన ఫొటోగుర్తింపు కార్డులు లేకుండా మూల్యాంకన కేంద్రంలోకి ఎవరినీ అనుమతించబోరన్నారు. ఒక్కో ఎగ్జామినర్ రోజుకి 40 జవాబు పత్రాలను మాత్రమే మూల్యాంకన చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. చివరిరోజున మంగళవారం జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షకు జిల్లాలో మొత్తం 22,704 మంది దరఖాస్తు చేసుకోగా 22,244 మంది హాజరయ్యారని డీఈవో తెలిపారు.
7నుంచి ఇంటర్మీడియట్ బ్రిడ్జి క్లాసులు
పదో తరగతి పరీక్షలు ముగియడంతో తదుపరి ఇంటర్ చదువుకు ఆటంకం లేకుండా ఆయా గ్రూపులు, పాఠ్యాంశాలపై అవగాహన కోసం ఈనెల 7నుంచి అన్ని ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలల్లో బ్రిడ్జి క్లాసులను ప్రారంభించడానికి ఇంటర్మీడియట్ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ తరగతులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రథమ సంవత్సరం ఇంటర్‌లో చేరాలనుకునే విద్యార్థులు స్థానికంగా ఉండే కళాశాలలకు హాజరుకావచ్చు.