Agriculture Department : వ్యవసాయ డీలర్లకు డిజిటల్ లైసెన్స్‌లు
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:05 AM
రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్ నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారానికి జారీ చేసే లైసెన్స్‌ల ప్రక్రియలో డిజిటల్ ఆన్‌లైన్ లైసెన్స్ విధానాన్ని వ్యవసాయ శాఖ తీసుకొస్తోంది.

అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్ నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారానికి జారీ చేసే లైసెన్స్‌ల ప్రక్రియలో డిజిటల్ ఆన్‌లైన్ లైసెన్స్ విధానాన్ని వ్యవసాయ శాఖ తీసుకొస్తోంది. గతంలో ఓఎల్‌ఎంఎస్ ఆన్‌లైన్ లైసెన్సు విధానం ఉండగా, 2019 నుంచి ఈ-ఆఫీస్ విధానంలో లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. ఈ రెండు విధానాల్లో లోటుపాట్లను సవరించి, డిజిటల్ ఆన్‌లైన్ నిర్వహణ వ్యవస్థను తెస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కృత్రిమ మేథ, డీప్ టెక్ సాంకేతికను వినియోగించి డిజిటల్ లైసెన్స్ విధానాన్ని అమలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు శుక్రవారం తెలిపారు. కొత్త విధానంలో వ్యాపారుల లైసెన్సుల కాలపరిమితి, వారి దరఖాస్తు ఏ దశలో ఉన్నదో సూచించడం, రెన్యువల్ వంటి విషయాలను సంక్షిప్త సమాచారం ద్వారా దరఖాస్తుదారునికి తెలియజేస్తామని చెప్పారు. డిజిటల్ ఆన్‌లైన్ నిర్వహణ ద్వారా ఎరువులు, పురుగు మందుల నమూనాలు సేకరించి, నాణ్యతను నిర్ధారించే ఇన్సైట్ యాప్‌తో జోడిస్తామన్నారు.