Share News

Flight Service: విజయవాడ దుబాయ్‌ ఫ్లైట్‌ నడపండి

ABN , Publish Date - Apr 02 , 2025 | 07:12 AM

ఏపీ చాంబర్స్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు విజయవాడ నుంచి దుబాయ్‌కు నేరుగా విమాన సర్వీసు ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. విజయవాడ విమానాశ్రయ సామర్థ్యం బాగా పెరిగినట్లు ఎమిరేట్స్ బృందం తెలిపింది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 80% ఆక్యుపెన్సీతో నేరుగా విమానం నడపాలని ఆహ్వానించింది.

 Flight Service: విజయవాడ దుబాయ్‌ ఫ్లైట్‌ నడపండి

ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ చైర్మన్‌కు ఏపీ చాంబర్స్‌ లేఖ

విజయవాడ, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు నేరుగా సర్వీసును ప్రారంభించాల్సిందిగా ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌కు ఏపీ చాంబర్స్‌ విజ్ఞప్తి చేసింది. ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌, సీఈవో షేక్‌ అహ్మద్‌ బిన్‌ సయాద్‌ అల్‌ మక్తూమ్‌కు ఈ మేరకు అధికారికంగా మంగళవారం లేఖ రాసింది. విజయవాడ నుంచి దుబాయ్‌కు ఉన్న డిమాండ్‌ రీత్యా గత ఐదేళ్లుగా నేరుగా విమానం నడపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఏపీ చాంబర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు పేర్కొన్నారు. ఎమిరేట్‌ ఎయిర్‌లైన్స్‌ బృందం ఇటీవల విజయవాడ వచ్చి అధ్యయనం చేసిందని, విమానాశ్రయ సామర్థ్యంపై సంతృప్తి వ్యక్తం చేయటం మంచి పరిణామన్నారు.


విజయవాడ, అమరావతి, గుంటూరులను కలుపుతూ సుమారు 20 మిలియన్ల క్యాచ్‌మెంట్‌ జనాభా పరిధిలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి 5 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారని, వీరంతా తరచూ యూరప్‌, మధ్య ప్రాచ్యదేశాలు, యూఎ్‌సలకు ప్రయాణిస్తుంటారని తెలిపారు. దుబాయ్‌కు నేరుగా విమాన సర్వీసు లేకపోవటం వల్ల దేశంలోని ఇతర ఎయిర్‌పోర్టుల మీదుగా ప్రయాణించాల్సి వస్తోందని చెప్పారు. విజయవాడ నుంచి దుబాయ్‌కు నేరుగా విమానం నడపగలిగితే 80 శాతం కంటే ఎక్కవ ఆక్యుపెన్సీ ఉంటుందని, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని డైరెక్ట్‌ ఫ్లైట్‌ నడపాల్సిందిగా భాస్కరరావు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 02 , 2025 | 07:12 AM