Share News

AP Land Storm: క్రమబద్ధీకరణ చేద్దామా

ABN , Publish Date - Apr 06 , 2025 | 03:43 AM

జగన్‌ ప్రభుత్వ హయాంలో ఫ్రీహోల్డ్‌ పేరుతో 5.74 లక్షల ఎకరాల భూమిని అక్రమంగా పంచివేసిన ఘటనపై కొత్త ప్రభుత్వం సమీక్ష ప్రారంభించింది. ఇప్పుడు ఆయా భూములను క్రమబద్ధీకరించే విధానంపై అధికారులు, నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు

AP Land Storm: క్రమబద్ధీకరణ చేద్దామా

ఫ్రీహోల్డ్‌ భూమి సమస్యకు పరిష్కారమిదే

మార్కెట్‌ ధర వసూలు చేస్తే సరిపోతుంది

పేదలకు కష్టం కలగకుండా చర్యలు

ప్రభుత్వానికి అందుతున్న సూచనలు

జగన్‌ హయాంలో ప్రహసనంలా ఫ్రీహోల్డ్‌

రికార్డులే లేని భూములకూ ‘విముక్తి’

వాటిని క్రమబద్ధీకరిస్తే ఖజానాకు ఆదాయం

ఫీజు కట్టించుకుని కొన్నవారికే రెగ్యులరైజ్‌

17న కేబినెట్‌ ఉపసంఘం సమావేశం

అన్నిరకాల సూచనలు, సలహాలపై దృష్టి

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వం అక్రమంగా ఫ్రీ హోల్డ్‌ చేసిన భూమి 5.74 లక్షల ఎకరాలు. ఈ భూమి విలువ కనీసం 90వేల కోట్లపైనే. ఇందులో రికార్డులు లేకుండానే ఫ్రీహోల్డ్‌ చేసిన భూమి 2.69 లక్షల ఎకరాలు. దీని విలువ కనీసం 35వేల కోట్లపైనే ఉంటుందని రెవెన్యూ శాఖ అంచనా. ఇంత విలువైన భూమిని అక్రమంగా, అడ్డదిడ్డంగా ఫ్రీహోల్డ్‌ చేసిన జగన్‌ సర్కారు ఎవరికి పంచి పెట్టాలని చూసింది? ఎవరి ఖాతాలో ఆ భూములను వేయాలనుకుంది? ఎవరికి దోచిపెట్టాలనుకుంది? ఇవి తెలుసుకునే అవకాశం లేకుండానే జగన్‌ సర్కారు ప్రజాగ్రహానికి బలయింది. ఇప్పుడు ఈ భూముల అక్రమాలను ఏం చేయాలి? ఎలా పరిష్కరించాలో కూటమి సర్కారుకు బోధపడటం లేదు. జగన్‌ సర్కారు అక్రమాల పరంపరను నిలువరించగలిగినా, ప్రభుత్వం మారే నాటికే జరిగిన అక్రమాలను ఎలా సక్రమం చేయాలో ఓ పట్టాన అంతుచిక్కడం లేదు. ఇప్పటికే మార్గాన్వేషణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు రాష్ట్రంలో రెవెన్యూ నిపుణులు, మేధావులు, రిటైర్డ్‌ అఖిల భారత సర్వీసు అధికారులు, భూములపై అవగాహన ఉన్న పెద్ద మనుషుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రెవెన్యూశాఖను ఆదేశించారు. మరోవైపు జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, రెవెన్యూ నిపుణులు వేర్వేరు మార్గాల ద్వారా తమ సూచనలు, సలహాలు ప్రభుత్వానికి పంపిస్తున్నారు. రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం తొలిదఫా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది.


ఈనెల 17న మరోసారి భేటీ కానుంది. అసైన్డ్‌ భూముల చట్టం-1977కు విరుద్ధంగా గత ప్రభుత్వం జీవో 596 తెచ్చింది. దీని ప్రకారం, 20 ఏళ్ల గడువు తీరిన అసైన్డ్‌ భూములను నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించాలి. ఆ తర్వాత ఆ భూముల యజమానులకు ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్‌ అందించాలి. వాటి ఆధారంగా రైతులు తమ భూములను ఇతరులకు అమ్ముకోవచ్చు. అయితే, ఈ ప్రక్రియ సజావుగా సాగలేదు. 13.59 లక్షల ఎకకాలను ఫ్రీహోల్డ్‌ చేస్తే అందులో 5.74 లక్షల ఎకరాలను అక్రమంగా ఫ్రీహోల్డ్‌ చేశారని రెవెన్యూశాఖ నిర్ధారించింది. ఫ్రీహోల్డ్‌, అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసింది. కొత్తగా అక్రమాలు జరగకుండా నిరోధించింది. కానీ, అప్పటికే గుర్తించిన అక్రమాల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి. అందులో కొన్ని..


ఇలా చేద్దామా?

  • అక్రమంగా ఫ్రీహోల్డ్‌ చేసిన భూముల్లో, పేదల ఆధీనంలో లేని వాటి విషయంలో క్రమబద్ధీకరించాలి. అంటే, నిజమైన పేదల్లో ఎకరం, రెండు ఎక రాల లోపు భూమి ఉన్నవారే ఎక్కువ. భూములను ఉన్నపళంగా ఫ్రీహోల్డ్‌ చేయించి అమ్ముకోవాల్సిన అవసరం వారికి ఉండదని ఓ కీలక మంత్రి ఇప్పటికే ఉపసంఘంలో సూచన చేసినట్లు తెలిసింది.

  • రికార్డులే లేకుండా ఫ్రీహోల్డ్‌ చేసిన 2.69 లక్షల ఎకరాలతోపాటు, పేదలు, సామాన్యులతో సంబంధం లేని భూములను ఆ ప్రాంతంలో ఉన్న భూముల రేట్ల ఆధారంగా క్రమబద్ధీకరించాలని మరో సీనియర్‌ మంత్రి ప్రతిపాదించినట్లు సమాచారం.

  • జగన్‌ సర్కారు అసైన్డ్‌ చట్టసవరణ చేయడానికి ముందే లక్షల ఎకరాలు చేతులు మారాయని రెవెన్యూశాఖ గుర్తించింది. ఇలా చేతులు మారిన భూములు ఇప్పటికీ రిజిస్ట్రేషన్‌ కాలేదు. ఈ కోవలోకి వచ్చే భూములను గుర్తించి కొనుగోలు చేసిన వారి దగ్గర మార్కెట్‌ ఫీజు వసూలు చేసి రెగ్యులరైజేషన్‌ చేయాలి. దీని వల్ల భారీ ఆదాయం వస్తుందని రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఒకరు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది.

  • చట్టప్రకారం, జీఓ నం. 596 మార్గదర్శకాల మేరకు ఒరిజినల్‌ అసైనీలు పొజిషన్‌లో ఉన్న భూములను గుర్తించి వాటి వరకే ఫ్రీ హోల్డ్‌ చేయాలి. ఈ ప్రక్రియ కొంత సమయం తీసుకున్నా ఇదే అసలైన చట్టబద్ధమైన స్ఫూర్తిగా ఉంటుందని రెవెన్యూశాఖకు లిఖితపూర్వకంగా సూచనలు వచ్చాయి.

  • పొజిషన్‌లో ఉన్న రైతులను గుర్తించి వారి భూములను ఫ్రీ హోల్డ్‌ చేసి, వారి పేరిటే రిజిస్ట్రేషన్‌ చేస్తే సరిపోతుందని, అప్పుడు భూ కబ్జాదారులెవరో సులువుగా కనిపెట్టవచ్చని రైతు కూలీ సంఘం నుంచి సూచన వచ్చింది.

  • మొత్తంగానే ఫ్రీ హోల్డ్‌ విధానాన్ని రద్దుచేయాలని రిటైర్డ్‌ రెవెన్యూ అధికారి సురేంద్రనాథ్‌ ప్రభుత్వానికి సూచించారు.


ఇవి కూడా చదవండి

YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో

Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 03:45 AM