Share News

AP Govt: పేదల ఇళ్లకు రూ.3,220 కోట్ల అదనపు సాయం

ABN , Publish Date - Apr 02 , 2025 | 07:05 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5.99 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ గిరిజన లబ్ధిదారుల పెండింగ్ ఇళ్లను పూర్తి చేయడానికి రూ. 3,220 కోట్లు మంజూరు చేసింది. ఈ సాయం నాలుగు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చొరవకు ఆర్థిక మద్దతు అందిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రాజబాబు వెల్లడించారు

AP Govt: పేదల ఇళ్లకు రూ.3,220 కోట్ల అదనపు సాయం

4 విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ: హౌసింగ్‌ ఎండీ

అమరావతి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో నిలిచిపోయిన 5.99 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ గిరిజన (పీవీజీటీ) లబ్ధిదారుల ఇళ్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం రూ. 3,220 అదనపు సాయం మంజూరు చేసింది. ఈ అదనపు సాయం నాలుగు విడతలుగా (బేస్మెంట్‌, రూఫ్‌ లెవెల్‌, స్లాబ్‌ లెవెల్‌, ఇల్లు పూర్తియిన తర్వాత) లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.రాజబాబు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘పీఎంఏవై (1.0), ప్రధాన మంత్రి జన్‌మన్‌ పథకాల కింద 2016-2024 మధ్య కాలంలో బడుగులకు మంజూరు చేసిన 7.32 లక్షల ఇళ్లను పూర్తి చేయాల్సిఉంది. గత వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల యూనిట్‌ విలువ రూ. 1.80 లక్షలుగా నిర్ణయించడం, గత ఐదేళ్లలో ఇంటి నిర్మాణ సామగ్రి, కూలీల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో లబ్ధిదారులు అప్పులపాలై ఇళ్లను మధ్యలోనే ఆపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని వివిధ దశల్లో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేయించి పేదవాడి పక్కా ఇంటి కలను నిజం చేయాలని సంకల్పించారు.


ఇంటి యూనిట్‌ విలువకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, ఆదివాసీ గిరిజన (పీవీటీజీ) లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 5.99 లక్షల పెండింగ్‌ ఇళ్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం రూ. 3,220 కోట్లు మంజూరు చేసింది’ అని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ రాజబాబు వివరించారు.

Updated Date - Apr 02 , 2025 | 07:07 AM