Share News

BC Welfare: రూ.255 కోట్లతో బీసీ మహిళలకు స్వయం ఉపాధి

ABN , Publish Date - Mar 03 , 2025 | 03:09 AM

ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 నెలల్లోనే మిగతా సంక్షేమ శాఖల కంటే ముందుగా స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించింది.

 BC Welfare: రూ.255 కోట్లతో బీసీ మహిళలకు స్వయం ఉపాధి

  • లక్ష మందికి కుట్టు శిక్షణ

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రారంభం

  • శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో స్వయం ఉపాధి పథకాల ద్వారా బీసీల అభివృద్ధికి కూటమి సర్కార్‌ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 నెలల్లోనే మిగతా సంక్షేమ శాఖల కంటే ముందుగా స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బీసీ మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ అందజేసి ఉచితంగా కుట్టుమిషన్లు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లబ్ధిదారులకు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.

లక్ష మంది లబ్ధిదారుల ఎంపిక

రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఈడబ్ల్యూఎస్‌, కాపు సామాజికవర్గానికి చెందిన 1.02 లక్షల మహిళా లబ్ధిదారులకు కుట్టుమిషన్లు అందజేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.255 కోట్లను ఖర్చు చేయనుంది. బీసీ సంక్షేమ కార్పొరేషన్‌ ద్వారా 46,044 మందికి, ఈడబ్ల్యూఎస్‌ సామాజిక వర్గాలకు చెందిన వారికి 45,772 మందికి, కాపు కార్పొరేషన్‌ ద్వారా కాపు సామాజికవర్గానికి 11,016 మందిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. మహిళల భవిష్యత్తుపై భరోసా లభించేలా టైలరింగ్‌లో నిష్ణాతులైన వారితో 90 రోజుల పాటు శిక్షణ అందించనున్నారు. శిక్షణ అనంతరం లబ్ధిదారులకు ఉచితంగా కుట్టుమిషన్లు అందజేయనున్నారు. కేవలం టైలరింగ్‌ శిక్షణతోనే సరిపెట్టకుండా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్ల ఏర్పాటులోను మహిళలకే ప్రాధాన్యమిస్తున్నారు. వాటితో పాటు బీసీ, ఈడబ్ల్యూఎస్‌, కాపు కార్పొరేషన్ల ద్వారా అమలు చేసే స్వయం ఉపాధి పథకాల అమల్లోను మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. డెయిరీ, గొర్రెల వంటి యూనిట్లతో జనరిక్‌ మెడికల్‌ షాపుల ఏర్పాటుకు ముందుకొచ్చిన మహిళలకూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.


చంద్రబాబు పాలనలోమహిళా సంక్షేమం: సవిత

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్ముతారని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. చిల్లర దుకాణాలు, కుట్టుశిక్షణ, అగరుబత్తీ, పామాయిల్‌ తదితర చిన్నపాటి వ్యాపారాల వైపు నడిపిస్తూనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు, మంగళగిరి, ధర్మవరం చీరలు, పూతరేకులు, చెక్క బొమ్మలు, పిల్లల ఆటబొమ్మల తయారీలో భాగస్వాములను చేస్తోందన్నారు. దీనిలో భాగంగా 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష మందికి పైగా టైలరింగ్‌ శిక్షణ అందజేసి కుట్టుమిషన్‌లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 03 , 2025 | 03:10 AM