Education Policy : ఇక 6వ తరగతిలో బ్రిడ్జి కోర్సు
ABN , Publish Date - Feb 04 , 2025 | 05:12 AM
బ్రిడ్జి కోర్సు ప్రవేశ పెట్టాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఆరో తరగతిలో మొదటి రెండు నెలలు బ్రిడ్జి కోర్సు అమలు చేయనుంది.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మొదటి రెండు నెలలు బోధన
ప్రత్యేకంగా కరిక్యులమ్.. ఆగస్టు నుంచి సాధారణ పాఠ్యాంశాలు
విద్యార్థుల మధ్య అంతరం తగ్గేలా పాఠశాల విద్యా శాఖ నిర్ణయం
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): వివిధ పాఠశాలల నుంచి ఆరో తరగతికి వచ్చే విద్యార్థుల మధ్య అభ్యసనంలో అంతరాన్ని తగ్గించేందుకు బ్రిడ్జి కోర్సు ప్రవేశ పెట్టాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఆరో తరగతిలో మొదటి రెండు నెలలు బ్రిడ్జి కోర్సు అమలు చేయనుంది. ఏటా జూన్ 12న బడులు తెరుచుకుంటాయి. అదే రోజు నుంచి అన్ని తరగతులు ప్రారంభమవుతాయి. కానీ ఆరో తరగతికి కొంత విరామం లభించనుంది. 5 వరకు ప్రాథమిక పాఠశాలలలో చదివి, ఆరో తరగతికి ఉన్నత పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు తరగతులు ఆగస్టులో ప్రారంభమవుతాయి. 5 నుంచి 6వ తరగతిలోకి వచ్చే మార్పును విద్యార్థులు అర్థం చేసుకోవడానికి ఆ రెండు నెలలు (జూన్-జూలై) బ్రిడ్జి కోర్సు మాత్రమే బోధిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం పాఠశాల విద్యా శాఖ ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సు కరిక్యులమ్ రూపొందిస్తోంది. వివిధ రకాల పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థుల మధ్య అంతరాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఈ మార్పులపై నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు నుంచి ఆరో తరగతి పాఠ్య పుస్తకాల బోధన ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఉన్నత పాఠశాలలకు వచ్చే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ సింగిల్ టీచర్ స్కూళ్ల నుంచి వచ్చేవారికి, ఎక్కువ మంది టీచర్లు, వసతులు ఉన్న పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు అభ్యసన సామర్థ్యాల్లో తేడాలు ఉంటున్నాయి.
ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఎక్కువ మంది టీచర్లున్న ప్రభుత్వ బడుల నుంచి వచ్చిన విద్యార్థులు వేగంగా సబ్జెక్టులను అర్థం చేసుకుంటున్నారు. సింగిల్ టీచర్, ఇద్దరు టీచర్లు ఉండే ప్రాథమిక పాఠశాలల్లో చదివి ఉన్నత పాఠశాలలకు వచ్చినవారు వెనకబడిపోతున్నారు. విద్యార్థుల మధ్య ఏర్పడుతున్న ఈ వ్యత్యాసం పై తరగతులకూ కొనసాగుతోంది. దీంతో ఇకపై అందరూ ఒకేవిధంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రిడ్జి కోర్సు విధానం తెస్తున్నారు. మొదటి రెండు నెలల పాటు ఆరో తరగతిలోని ప్రాథమిక అంశాలపైనే బ్రిడ్జి కోర్సు ఉంటుంది. ప్రైవేటు పాఠశాలల్లో ఈ తరహా బ్రిడ్జి కోర్సులు అమలు చేస్తున్నారు. విద్యార్థులకు తొలుత ప్రాథమిక అంశాలు నేర్పించి, ఆ తర్వాత వేగంగా సిలబస్ పూర్తి చేస్తున్నారు. దీంతో విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి వచ్చినా పాఠ్యాంశాలు, బోధన అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఈ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి తీసుకొస్తున్నారు.