Nellore : సీఎంలా గాక.. సగటు మనిషిలా...!
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:50 AM
నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని దూబగంట గ్రామంలో శనివారం పర్యటించిన సీఎం .. ఓ ముఖ్యమంత్రిలా కాకుండా సగటు మనిషిలా ప్రజలతో కలిసిపోయారు.

భద్రతా వలయాన్ని దాటుకుని ప్రజలతో మమేకం
వారితో మాటామంతీ.. సెల్ఫీలు
(నెల్లూరు-ఆంధ్రజ్యోతి)
గంభీర వదనం.. ముక్తసరి సమాధానం.. పొరపాటున కూడా చిరునవ్వు కనిపించేది కాదు.. అధికారంలో ఉన్నా.. లేకున్నా చంద్రబాబు తీరు ఇలాగే ఉండేది. నాలుగోసారి సీఎం అయ్యాక మాత్రం ఆయన పూర్తిగా మారిపోయారు. నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని దూబగంట గ్రామంలో శనివారం పర్యటించిన సీఎం .. ఓ ముఖ్యమంత్రిలా కాకుండా సగటు మనిషిలా ప్రజలతో కలిసిపోయారు. తన బొమ్మ గీసి చేతికిచ్చిన విద్యార్థినిని నవ్వుతూ దగ్గరకు తీసుకున్నారు. ‘మంచి పెయింటర్‌వు అవుతావు.. ఏం చదువుతున్నావు.. నీ పేరేంటి..’ అని అడిగి తెలుసుకున్నారు. ఆ చిన్నారితో ఫొటో దిగారు. తమ తోటలో పండిన అరటి గెలతో స్వాగతం పలికిన దంపతులను ఆత్మీయంగా పలుకరించారు. వారి ప్రేమను కాదనలేక గెల నుంచి ఒక పండు తుంచుకున్నారు. పక్షవాతంతో చక్రాల కుర్చీకి పరిమితమైన తన తండ్రి పరిస్థితిని ఓ రైతు వివరించాడు. దివ్యాంగుల పింఛను ఇప్పించాలని కోరాడు. వచ్చే నెల నుంచే పింఛను అందేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. డ్వాక్రా మహిళలు రీసైక్లింగ్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన బెంచీలను చూసి ముచ్చట పడ్డారు. ఒక బెంచ్‌పై కాసేపు కూర్చున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు. సార్.. మీతో ఒక ఫొటో .. అని భయం భయంగా అడిగిన డ్వాక్రా మహిళలను.. నవ్వుతూ రండమ్మా అని ఫోటోలు దిగారు.
వీడూ దేవాన్షే..!
‘మీ దేవాన్ష్ పుట్టినరోజే పుట్టాడు సార్, వీడి పేరు కూడా దేవాన్షే’ అని ఒక తల్లి తన బిడ్డను పరిచయం చేసింది. సీఎం ఆ బాబును ఆశీర్వదించి ముందుకు కదిలారు. హెలిప్యాడ్ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, దగుమాటి కృష్ణారెడ్డి తదితరులను చంద్రబాబు నవ్వుతూ పలుకరించారు. మిమ్మల్నెవరినీ రావద్దన్నాను కదా అని అనగా.. ‘మా నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ముగించుకునే వచ్చాం సార్’ అని నవ్వుతూనే బదులిచ్చారు.