Share News

రెండో ఉచిత సిలిండర్‌కు బుకింగ్స్‌

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:57 AM

నాలుగు నెలల వ్యవధిలో పొందే సౌలభ్యం

రెండో ఉచిత సిలిండర్‌కు బుకింగ్స్‌

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): దీపం-2 కింద రెండో విడత ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి జూలై ఒకటవ తేదీ వరకు ఈ ఉచిత రెండో సిలిండర్‌ను బుక్‌ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4,92,302 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. అక్టోబరు 29 నుంచి మార్చి 31వ తేది వరకు తొలి ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించగా.. దాదాపు 4.74 లక్షల మంది వినియోగించుకున్నారు. వారిలో ఇప్పటి వరకు 4.58 లక్షల మందికి మాత్రమే సిలిండర్‌ రాయితీ నగదు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ఇక, రెండో సిలిండర్‌ బుకింగ్‌ మంగళవారం మొదలవగా.. తొలిరోజే దాదాపు 700 సిలిండర్లు బుక్‌ అయినట్లు సమాచారం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలకు ఒకటి చొప్పున.. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను ఇస్తోంది. రేషన్‌ కార్డు ఉన్న వారందరూ అర్హులే. కాగా, వినియోగదారులు నగదు చెల్లించి సిలిండరును తీసుకున్న 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లోకి ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే మొదటి సిలిండర్‌కు సంబంధించి జిల్లాలో ఇంకా దాదాపు 16 వేల మందికి నగదు జమ కాలేదు. దీనికి కారణం చాలా మంది ఈకేవైసీ చేసుకోక పోవడం, మరికొందరు బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం కాకపోవడమేనని అధికారులు అంటున్నారు. అలాగే, ఒకే కార్డుపై రెండు గ్యాస్‌ సిలిండర్లు ఉన్నా డబ్బులు పడవని అంటున్నారు. వీటిని అధిగమిస్తే వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెబుతున్నారు. వీటికి సంబంధించి అనుమానాలుంటే 1967 టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి సమాచారం పొందవచ్చు.

Updated Date - Apr 02 , 2025 | 12:57 AM