ఎస్పీ ఆదేశాలు బేఖాతర్
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:17 AM
జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేస్తున్నారు. పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 264 మంది పోలీసులను బదిలీ చేస్తూ ఎస్పీ పది రోజుల కిందట ఉత్తర్వ్యులు జారీ చేశారు.వెంటనే బదిలీ చేసిన స్థానాల్లో చేరాలని ఆదేశాలిచ్చారు.

బదిలీ ప్రాంతాల్లో చేరని పోలీసులు
చిత్తూరు అర్బన్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేస్తున్నారు. పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 264 మంది పోలీసులను బదిలీ చేస్తూ ఎస్పీ పది రోజుల కిందట ఉత్తర్వ్యులు జారీ చేశారు.వెంటనే బదిలీ చేసిన స్థానాల్లో చేరాలని ఆదేశాలిచ్చారు. అయితే దాదాపు 70 శాతం మంది పోలీసులు ఇంకా బదిలీ చేసిన స్థానాల్లో చేరలేదు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న పోలీసుశాఖలో ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది. బదిలీ అయిన వారిలో కొంత మంది పోలీసులు ఆరోగ్య, కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరికొంత మంది పదవీ విరమణకు దగ్గరలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బదిలీలపై ఎస్పీ పునరాలోచించాలని పోలీసులు మొదట్లో విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు ఎస్పీ మణికంఠ ససేమిరా అన్నట్లు సమాచారం. పుంగనూరు ప్రాంతంలో మాత్రం గంగజాతర నేపథ్యంలో అక్కడ పనిచేసే సిబ్బందికి కొన్ని సడలింపులు ఇచ్చారు. జాతర ముగిసిన తరువాత వారు కూడా బదిలీ స్థానాల్లో చేరాలని ఆదేశించారు. పుంగనూరే కాకుండా జిల్లా వ్యాప్తంగా బదిలీ అయిన పోలీసుల్లో సుమారు 50 మంది మాత్రమే కొత్త స్థానాల్లో చేరినట్లు సమాచారం. మిగిలిన వారు మునుపటి స్టేషన్లలోనే కొనసాగుతుండడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఫ కౌన్సెలింగ్ ద్వారా జరిగివుంటే....
గతంలో పోలీసుశాఖలో బదిలీలను కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించేవారు. ఇలా చేయడం వల్ల పోలీసులు తమకు అనుకూలంగా ఉన్న స్టేషన్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది. అయితే పుంగనూరు ఘటన నేపథ్యంలో ఎస్పీ ఈ నిబంధన పాటించలేదు. రాజకీయ నేతల విమర్శల నేపథ్యంలో ఎస్పీ రాత్రికి రాత్రే కానిస్టేబుళ్లను, కొంత మంది ఎస్‌ఐలను బదిలీ చేశారు. వీరిలో ఎస్‌ఐలు మాత్రం బదిలీ చేసిన స్థానాలకు వెళ్లారు. పోలీసులు మాత్రం చాలా మంది అలాగే ఉన్నారు. కౌన్సెలింగ్ నిబంధన ఇక్కడ కూడా పాటించి ఉంటే కానిస్టేబుళ్లు కూడా బదిలీ అయిన స్థానాలకు వెళ్లేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.