Share News

Deputy Mayor: డిప్యూటీ మేయర్‌గా మునికృష్ణ ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Feb 21 , 2025 | 01:42 AM

తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా ఆర్సీ మునికృష్ణ ప్రమాణ స్వీకారం గురువారం అట్టహాసంగా జరిగింది.

Deputy Mayor: డిప్యూటీ మేయర్‌గా మునికృష్ణ ప్రమాణస్వీకారం
సైకిల్‌పై వస్తున్న ఆర్సీ మునికృష్ణ

తిరుపతి, ఫిబ్రవరి20(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా ఆర్సీ మునికృష్ణ ప్రమాణ స్వీకారం గురువారం అట్టహాసంగా జరిగింది. ఇటీవల జరిగిన డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన 35వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మేయర్‌ డాక్టర్‌ శిరీష, కమిషనర్‌ మౌర్య నేతృత్వంలో డిప్యూటీ మేయర్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ముందు కూటమి నాయకులతో కలిసి టౌన్‌క్లబ్‌ సర్కిల్లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. తెలుగు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి జ్యోతిరావ్‌ పూలే విగ్రహం, ఎస్వీయూ ప్రధాన గేటు ఎదురుగా గల అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అక్కడి నుంచి సైకిల్‌పై ఎస్వీయూ సెనేట్‌ హాలుకు చేరుకుని డిప్యూటీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేటర్లను కలుపుకుని నగరాభివృద్ధికి శ్రమిస్తానని చెప్పారు. తనను అభ్యర్థిగా నియమించిన కూటమి నాయకత్వానికి, ఓట్లు వేసిన కార్పొరేటర్లకు, గెలుపునకు కృషిచేసిన నాయకులు, కార్యకర్తలకు ఽకృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయనను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నరసింహ యాదవ్‌, నాయకులు బీఎల్‌ సంజయ్‌, జేబీ శ్రీనివాస్‌, ఊకా విజయకుమార్‌, శ్రీధర్‌ వర్మ, పుష్పావతి, దంపూరి భాస్కర్‌, ఊట్ల సురేంద్ర నాయుడు, మన్నెం శ్రీనివాసుల నాయుడు, చినబాబు, మహేష్‌ యాదవ్‌, పాటకం వెంకటేష్‌, కృష్ణ యాదవ్‌, సుబ్బు యాదవ్‌ పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.

Updated Date - Feb 21 , 2025 | 01:42 AM