ఉద్యోగుల సిఫార్సులకు ‘సుపథం’ ద్వారా శ్రీవారి దర్శనం
ABN , Publish Date - Mar 25 , 2025 | 01:39 AM
టీటీడీ శాశ్విత ఉద్యోగుల సిఫార్సు లేఖలపై మూడు నెలలకోసారి సుపథం ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని తీర్మానించినట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.

టీటీడీ కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కమిటీ
తిరుపతిలో స్పోర్స్ట్ కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.కోటి
తిరుమల, మార్చి24(ఆంధ్రజ్యోతి): టీటీడీ శాశ్విత ఉద్యోగుల సిఫార్సు లేఖలపై మూడు నెలలకోసారి సుపథం ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని తీర్మానించినట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్యాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. బోర్డులో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వెల్లడించారు.
తమకొచ్చే రూ.43 వేల జీతంలో జీఎస్టీ పేరుతో రూ.4,800 కోత విఽధిస్తున్నారని, మొత్తం జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని పోటు కార్మికులు కోతల్లేకుండా జీతాలు అందించాలని తీర్మానించాం.
తిరుమలకు వచ్చే వీఐపీ, నాన్ వీఐపీలకు మంచి వసతి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో 12 బ్లాకుల్లోని 1,875 గదుల మరమ్మతులకు రూ.26 కోట్లు కేటాయించాం. మరికొన్నింటిని పూర్తిగా తొలగించి తిరిగి నిర్మించాల్సి ఉంది. మొత్తం 424 బ్లాకుల్లోని గదులను ఆధునికీకరిస్తాం.
తిరుమలలో లైసెన్సు లేకుండా ఉన్న దుకాణాలు, తట్టలను తొలగించేలా రెవెన్యూ, విజిలెన్స్ విభాగాలతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం.
టీటీడీ కళాశాల్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్న 151 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్య పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులకు రూ. కోటి మంజురు చేయాలని ఆమోదం తెలిపాం.
జాతీయ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లపై మరోసారి బోర్డులో చర్చించాం. అధిక వడ్డీలు వచ్చేలా గుర్తింపు కలిగిన బ్యాంకుల్లోనే డిపాజిట్లు పెట్టే అంశంపై పరిశీలిస్తున్నాం.
తిరుమలలో స్థలాక్రమణలకు పాల్పడుతున్న మఠాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. త్వరలో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జీ అంశంపై పరిశీలించాలని అధికారులను బోర్డు కోరింది.
కాశి మఠానికి నిత్యహారతులకు అనుమతివ్వాలని తీర్మానించాం.