Tech Savvy Teacher Inspiring Journey: ఆమే ఒక స్ఫూర్తిమంత్రం
ABN , Publish Date - Mar 27 , 2025 | 02:15 AM
ఒక వైకల్యంతో జీవితం ప్రారంభించిన శారద, తన ఆత్మవిశ్వాసంతో బోధనా రంగంలో అసాధారణమైన ప్రయోగాలు చేస్తూ, విద్యార్థుల ప్రగతికి తోడ్పడింది. సాంకేతికతను బోధనలో పరిగణనలోకి తీసుకుని, 2 వేల పైగా ఆడియో బుక్స్ తయారుచేసి, సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు ఉత్తమమైన బోధన అందించింది. ఆమె ఈ విజయాలను జాతీయ పురస్కారాల రూపంలో పొందింది.

వృత్తి అంటే ప్రాణం, విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలనే తపన... వీటికి సృజనాత్మకత తోడైతే గొప్ప ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు 36 ఏళ్ల కె.శారద. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆమె చిన్న వయసులోనే వైకల్యానికి గురైనా... ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. బోధనలో కొత్త ప్రయోగాలు చేసి, ఉత్తమ ఉపాధ్యాయినిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న శారద పయనం గురించి ఆమె మాటల్లోనే...
‘‘మనకు మనమే పరిమితులు విధించుకుంటే ఏ పనీ చెయ్యలేం. అసాధ్యాలను సుసాధ్యం చెయ్యలేక పోవచ్చు. కానీ మనం చెయ్యగలిగే పనులను కూడా ఏదో వంకతో తప్పించుకోకూడదు. దానివల్ల మన శక్తి సామర్థ్యాలు వృథా అవుతాయి. ఏడాది వయసులో పోలియో వచ్చి, నడుము నుంచి కిందిభాగం చచ్చు బడిపోయింది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరో ఒకరి సాయం తప్పనిసరి.ఆ సమయంలో నా తల్లిదండ్రులు నన్ను కంటికి రెప్పలా కాపాడారు. బాగా చదువుకో వాలనే ఆకాంక్ష నాలో కలిగేలా చేశారు. బడిలో చేరిన తరువాత... నా సోదరుడు నన్ను మోసుకుంటూ బడికి తీసుకువెళ్ళేవాడు. రాకపోకలకు, తోటి విద్యార్థులతో కలిసిపోవడానికి కాస్త ఇబ్బందులు ఎదురైనా... చదువులో ఎప్పుడూ ముందుండేదాన్ని.
కొత్త పద్ధతుల కోసం...
మాది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భిలాయ్. చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి నాకు ఎక్కువ. నా జీవితంలో నా కుటుంబం తరువాత ముఖ్యపాత్ర పోషించింది ఉపాధ్యాయులే. అందుకే టీచర్ కావాలని బాల్యంలోనే నిర్ణయించుకున్నాను. ఆ లక్ష్యం దిశగా నన్ను నేను నడిపించుకున్నాను. గణితం, ఆర్థిక శాస్త్రాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ కూడా పూర్తి చేశాను. గణిత ఉపాధ్యాయినిగా వృత్తి జీవితం మొదలుపెట్టాను. బోధనా పద్ధతులు విద్యార్థులకు అర్థమయ్యేలా లేవనే సంగతి కొద్దిరోజుల్లోనే గ్రహించాను. సిలబస్ పూర్తి చేయడం మీద టీచర్ల దృష్టి ఉంటే, పాఠాలపై అవగాహన పెంచుకోవడానికి బదులు ఎలా పాసవ్వాలా? అనే ఆలోచనలో విద్యార్థులు ఉంటున్నారు. బట్టీ పట్టాల్సిన అవసరం లేకుండా వారికి పాఠాలు గుర్తుండిపోవాలంటే బోధన లో కొత్త పద్ధతులు అనుసరించాలి. అందుకోసం సాంకేతికతను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకు న్నాను. మొదట్లో ఆడియో పాఠాలు రూపొందించాను. ఆ తరువాత వివిధ అంశాలపై వీడియోలు తీశాను. వాటిని తరగతి గదుల్లో ప్రదర్శించడానికి అనుమతి కోరినప్పుడు... మొదట్లో పాఠశాల యాజమాన్యం, ఉన్నతాధికారులు సంకోచించినా, చివరకు ఒప్పుకు న్నారు. కంటెంట్ అంతా నా సొంత ఖర్చులతోనే తయారు చేశాను. విద్యార్థుల నుంచి మంచి స్పందన రావడంతో... నాకు ఉత్సాహం కలిగింది. ఆడియో, వీడియో పాఠాల రూపకల్పనను కొనసాగించాను.
2 వేల ఆడియో బుక్స్
కొవిడ్ విజృంభణ అన్ని రంగాల్లోనూ పెను మార్పులను తీసుకొచ్చింది. ప్రజలు సాంకేతికత గురించి అంతకుముందు కన్నా చాలా ఎక్కువ తెలుసుకున్నారు. ఆన్‌లైన్... నేర్చుకోవడానికి చక్కటి, సమర్థవంతమైన మాధ్యమం. బోధనా వృత్తిలో ఉన్నవారికి అది మరింత ప్రయోజనకరమైనదని నా నమ్మకం. విద్యాబోధనలో వీలైనంత ఎక్కువ సాంకేతికతను ఉపయోగించుకోవాలన్న నా ఆలోచనను ఆ పరిస్థితులు మరింత బలోపేతం చేశాయి. మొదట్లో ఆడియో పాఠాలు తయారు చేశాను. పాఠాలను వివిధ భాషల్లోకి తర్జుమా చేసే యాప్‌లను ఉపయోగించుకున్నాను.
వివిధ రంగాల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్-ఏఐ)ను ఉపయోగించే విషయంలో అభ్యంతరాలు వినిపిస్తు న్నాయి. కానీ సరైన రీతిలో వినియోగిస్తే మంచి ఫలితాలు వస్తాయనేది నా అనుభవం. ఇప్పటివరకూ ఏఐని, కార్టూన్ పాత్రలను ఉపయోగించి నేను 2 వేలకు పైగా ఆడియో బుక్స్ తయారు చేశాను. ఇ-కంటెంట్, ఇతర వనరులతో ఒక వెబ్‌సైట్ సృష్టిం చాను. అలాగే ఆరు నుంచి పన్నెండు తరగతుల విద్యార్థుల కోసం 270 టీచింగ్ వీడియోలు రూపొందించి, పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాను. విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తిని ప్రోత్సహించడానికి లెక్కలు, జనరల్ నాలెడ్జ్ సైన్స్ తదితర అంశాలపై ఇరవైకి పైగా పుస్తకాలు రాశాను. వాటిని మా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పిల్లకు బోధిస్తున్నారు. అలాగే లెక్కల పుస్తకాన్ని క్యూఆర్ కోడ్‌లో తయారు చేశాను. విద్యార్థులు దాన్ని స్కాన్ చేసి, కోరుకున్న పాఠాన్ని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరంగా తెలుసుకోవచ్చు. బస్తర్‌లోని విద్యార్థుల కోసం హల్బీ భాషలో ఒక పుస్తకాన్ని, అలాగే గోధీ బాషలో మరొకటి రాశాను. పిల్లల్లో నైతికతను పెంపొందించడం కథల ద్వారానే సాధ్యమ వుతుంది. అందుకే ఇంగ్లీష్, హిందీ, హల్బీ భాషల్లో యాభైకి పైగా కథలు రాశాను. నా ప్రయత్నాలు అన్నిటికీ నా కుటుంబం, తోటి ఉపాధ్యాయులు, అధికారుల ప్రోత్సాహం ఎంతో ఉంది.
అదే ప్రేరణ
దుర్గ్‌లో నిర్వహించిన ఒక జాతీయ సదస్సులో... ముఖ్యమంత్రి తదితరుల సమక్షంలో నా కృషిని వివరించే అవకాశం దొరికింది. ఎందరో ప్రముఖులు నన్ను ప్రశంసించారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి 2021లో ‘ముఖ్యమంత్రి గౌరవ అలంకరణ్ జ్ఞానదీప్ పురస్కార్’, 2023లో ‘గవర్నర్ అవార్డు’, కిందటి ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్’... ఇలా ఎన్నో గౌరవాలు, పురస్కారాలు అందుకు న్నాను. వీటితోపాటు... కొన్ని వేల మంది విద్యార్థుల పురోగతికి కాస్తయినా తోడ్పడ్డాననే సంతృప్తిని సంపాదించుకున్నాను. బోధనలో మరిన్ని కొత్త పద్ధతులు రూపొందించడానికి అదే నాకు ప్రేరణగా నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..
Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో