అట్టహాసంగా నూకాంబిక జాతర
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:40 AM
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను ప్రభుత్వం రాష్ట్రస్థాయి పండుగగా ప్రకటించడంతో అధికారులు ఆ మేరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, చేతివృత్తుల స్టాళ్లు వంటివి ఏర్పాటు చేయడానికి ఆలయం వద్ద తగినంత స్థలం లేకపోవడంతో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించారు.

రాష్ట్రస్థాయి పండుగగా ప్రకటించడంతో ఎన్టీఆర్ స్టేడియంలో భారీఎత్తున ఏర్పాట్లు
ప్రత్యేక ఆకర్షణగా 12 అడుగుల అమ్మవారి ఉత్సవ విగ్రహం
చేతివృత్తులు, హస్తకళల స్టాల్స్ ఏర్పాటు
రోజూ పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలు
అనకాపల్లి టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను ప్రభుత్వం రాష్ట్రస్థాయి పండుగగా ప్రకటించడంతో అధికారులు ఆ మేరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, చేతివృత్తుల స్టాళ్లు వంటివి ఏర్పాటు చేయడానికి ఆలయం వద్ద తగినంత స్థలం లేకపోవడంతో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించారు. మరో రెండు రోజుల్లో కొత్త అమావాస్య జాతర ప్రారంభం కానుండడంతో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచనల మేరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లు మొదలుపెట్టారు. స్టేడియం ప్రవేశ మార్గం వద్ద రాజగోపురం సెట్టింగ్ వేశారు. పెవిలియన్ భవనం వద్ద భారీ స్టేజీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నూకాంబిక అమ్మవారి 12 అడుగుల ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. వేదికపై నెల రోజులపాటు ప్రతి రోజూ కోలాటాలు, జానపద నృత్యాలు, సంకీర్తనలు, భరతనాట్యం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కళాకారులను రప్పిస్తున్నారు. స్టేడియంలో చేతివృత్తులు, హస్తకళలు, పిల్లల ఆటవస్తువులు, తదితర వాటి ప్రదర్శన/ అమ్మకాల కోసం స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోజూ రాత్రిపూట అమ్మవారికి పెద్దఎత్తున హారతి ఇస్తారు.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు ఆహ్వానం
కొత్తూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): నూకాంబిక అమ్మవారి ఉత్సవానికి రావాలంటూ స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బుధవారం అమరావతిలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజులను కలిసి ఆహ్వానించారు. వీరిని శాలువాలతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. ఇదే సమయంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, మండలి బుద్దప్రసాద్, విష్ణుకుమార్‌రాజు, పితాని సత్యనారాయణ, బ్రహ్మానందరెడ్డి, అదితి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.