మూడు క్లస్టర్లుగా జిల్లా
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:41 AM
జిల్లాను భౌగోళికంగా మూడు క్లస్టర్లుగా విభజించి అన్ని రంగాల్లో సమాన అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలను రూపొందించినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండో రోజైన బుధవారం ఆమె 2025-26లో జిల్లా అభివృద్ధి ప్రణాళిక (విజన్ డాక్యుమెంట్‌ను) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

మొదటి క్లస్లర్‌లో ఆరు మండలాలతో పారిశ్రామిక జోన్
రెండో క్లస్టర్‌లో గిరిజన, అటవీ ప్రాంత మండలాలు
మూడో క్టస్టర్‌లో వ్యవసాయ ఆధారిత మండలాలు
వ్యవసాయ రంగంలో 39 శాతం వృద్ధి లక్ష్యం
అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధే ధ్యేయం
కలెక్టర్ల సదస్సులో విజయకృష్ణన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
అనకాపల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాను భౌగోళికంగా మూడు క్లస్టర్లుగా విభజించి అన్ని రంగాల్లో సమాన అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలను రూపొందించినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండో రోజైన బుధవారం ఆమె 2025-26లో జిల్లా అభివృద్ధి ప్రణాళిక (విజన్ డాక్యుమెంట్‌ను) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు. మొదటి క్లస్టర్ కింద జిల్లాలో ఆరు మండలాలను పారిశ్రామిక జోన్‌గా పరిగణించి కార్యాచరణ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గిరిజనులు, అడవులు అధికంగా వున్న ఎనిమిది మండలాలను రెండో క్లస్టర్‌గా, పూర్తిగా వ్యవసాయ ఆధారితంగా వున్న ఎనిమిది మండలాలను మూడో క్లస్టర్‌లో చేర్చినట్టు కలెక్టర్ వివరించారు.
తలసరి ఆదాయం మైదాన ప్రాంత మండలాల్లో సంతృప్తికరంగా వుండగా, గిరిజన ప్రాంతాల్లో తక్కువ వుందని కలెక్టర్ విజయకృష్ణన్ గణాంకాలతో వివరించారు. ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 24 శాతం వృద్ధి నమోదైందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 39 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేయనున్నామని పేర్కొన్నారు. సేవా రంగంలో 23.51 శాతం వృద్ధి నమోదైందని, దీనిని 24.51 శాతానికి పెంచాలని ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది పారిశ్రామిక రంగంలో 52 శాతం వృద్ధి నమోదైందని, రానున్న ఏడాదిలో పారిశ్రామిక రంగ వృద్ధి 46 శాతం లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ తెలిపారు.