ఆన్‌లైన్ బాటలో సింగిల్‌విండోలు
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:51 AM
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(సింగిల్‌విండో) ల్లో కంప్యూటరీకరణ ప్రక్రియ దాదాపు కొలిక్కివచ్చినట్లే. దాంతో మాన్యువల్ విధానంలో లావాదేవీలను అంచెలంచెలుగా నిలిపివేస్తారు. విండోలవారీగా నగదు, లెడ్జర్ పుస్తకాలను సీజ్ చేసి.. బీరువాల్లో భద్రపరిచే చర్యలను అఽఽధికారులు చేపట్టారు. ఈ ప్రక్రియను పూర్తిచేసిన సింగిల్‌విండోల కార్యాలయాల వద్ద ఈ-ప్యాక్స్ కింద ఏప్రిల్ ఒకటో తేదీనుంచి ఆన్‌లైన్ సేవలు అందించనున్నట్లు నోటీసులు అంటిస్తున్నారు.

- జోరుగా కంప్యూటరీకరణ ప్రక్రియ
- ఇప్పటివరకు 55 విండోల్లో పూర్తి
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(సింగిల్‌విండో) ల్లో కంప్యూటరీకరణ ప్రక్రియ దాదాపు కొలిక్కివచ్చినట్లే. దాంతో మాన్యువల్ విధానంలో లావాదేవీలను అంచెలంచెలుగా నిలిపివేస్తారు. విండోలవారీగా నగదు, లెడ్జర్ పుస్తకాలను సీజ్ చేసి.. బీరువాల్లో భద్రపరిచే చర్యలను అఽఽధికారులు చేపట్టారు. ఈ ప్రక్రియను పూర్తిచేసిన సింగిల్‌విండోల కార్యాలయాల వద్ద ఈ-ప్యాక్స్ కింద ఏప్రిల్ ఒకటో తేదీనుంచి ఆన్‌లైన్ సేవలు అందించనున్నట్లు నోటీసులు అంటిస్తున్నారు.
సీబీఎస్ మాడ్యూల్‌లో..
పుస్తకాలతో పనిలేకుండా బ్యాంకుల తరహాలో సింగిల్‌విండోల్లోనూ ఆన్‌లైన్‌లోనే ఎంట్రీలు నమోదు చేస్తారు. డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు, పద్దులవారీగా బకాయిల వసూళ్లు, బంగారం కుదువ, ఎరువుల అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆప్కాబ్, డీసీసీబీ బ్రాంచీల తరహాలోనే కోర్ బ్యాకింగ్ సొల్యూషన్(సీబీఎ్‌స) మాడ్యూల్‌లో సాగనున్నాయి. ఉమ్మడి జిల్లా పరిఽధిలో 75 విండోలు ఉన్నాయి. రోజువారీ ప్రత్యక్ష పర్యవేక్షణ ప్రక్రియను జేసీ విద్యాధరి చేపట్టి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ కారణంగా ఆదివారం నాటికి 55 విండోల్లో కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తవగా, అక్కడ అనధికారికంగా ఈ-సేవలు ప్రారంభమయ్యాయి. మిగిలిన 20 విండోల్లో సైతం ఈ ప్రక్రియను ఈనెల 25లోగా పూర్తి చేయాలని సహకార శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో డీసీసీబీ బ్యాంకు, విండోల అధికారులు, సీఈవోలు, సిబ్బంది, కంప్యూటర్ సహాయకులు, డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు.
సభ్యుల వివరాలిలా..
75 సింగిల్‌విండోల పరిధిలో 538834 మంది సభ్యుల వివరాలను ఆన్‌లైన్‌లోకి ఎక్కిస్తున్నారు. వీరిలో 461117 మంది సభ్యుల, 77717 మంది రుణగ్రహీతల వివరాలు ఉన్నాయి. ఈ వివరాలన్నింటినీ రాష్ట్ర సహకార శాఖ ఇచ్చిన పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఆన్‌లైన్ సేవల్లో భాగంగా సీఈవో చెక్కర్‌గా, కంప్యూటర్ సహాయకుడు మేకర్‌గా ఉంటారు. చాలాచోట్ల కంప్యూటర్ సహాయకులు లేకపోవడంతో పొరుగుసేవల సిబ్బంది ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. దీంతో ఇతర బ్యాంకుల్లో రుణాలు పొందిన, బినామీ రుణాలన్నీ బయటపడుతున్నాయి. పైగా విండోల్లో ఎంత నిల్వ ఉంది, ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పర్యవేక్షణ ఎక్కువగా ఉండటం వల్ల అక్రమాలకు తావుండదు.
డీసీసీబీతో అనుసంధానం
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సింగిల్‌విండోలను కంప్యూటరీకరించి డీసీసీబీతో అనుసంధానం చేస్తున్నాం. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సర లావాదేవీల వివరాలన్నీ సహకార పోర్టల్‌లో నమోదు చేస్తున్నాం. ఈనెల 25లోగా కంప్యూటీకరణ ప్రక్రియ పూర్తి చేసి.. ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని విండోల్లో ఈ-సేవలు అందుబాటులోకి తెస్తాం.
- శంకర్‌బాబు, సీఈవో, డీసీసీబీ, చిత్తూరు