Share News

రూ.161 కోట్లతో తుడా వార్షిక బడ్జెట్‌

ABN , Publish Date - Mar 30 , 2025 | 02:32 AM

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.161 కోట్లకు ఆమోదం తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధ్యక్షతన, వీసీ మౌర్య, ఎంఏయూడీ ఓఎస్డీ వెంకటసుబ్బయ్య, ఆర్డీ శ్రీనివాసులు సమక్షంలో తొలి బోర్డు సమావేశం నిర్వహించారు.

రూ.161 కోట్లతో తుడా వార్షిక బడ్జెట్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, పక్కన కమిషనర్‌ మౌర్య

- 2023-24 జమా ఖర్చులు అకౌంటెంట్‌ జనరల్‌ చేత ఆడిట్‌ చేయాలి

- విలీన ప్రాంతాల మాస్టర్‌ ప్లాన్‌ తయారీ టెండర్‌

- తుడా పాలకమండలి సమావేశంలో నిర్ణయం

తిరుపతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.161 కోట్లకు ఆమోదం తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధ్యక్షతన, వీసీ మౌర్య, ఎంఏయూడీ ఓఎస్డీ వెంకటసుబ్బయ్య, ఆర్డీ శ్రీనివాసులు సమక్షంలో తొలి బోర్డు సమావేశం నిర్వహించారు. తుడా ఆధ్వర్యంలో చేపట్టే పలు అభివృద్ధి పనులు, గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. 2023-24ఆర్థిక సంవత్సరం ఖాతా నివేదికలను రాష్ట్ర ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌తో ఆడిట్‌ చేయాలని, రేణిగుంట మండలం సూరప్పకశంలో గల 145 ఎకరాల పద్మావతి నగర్‌ లేఔట్‌లో సీసీ డ్రెయిన్స్‌ నిర్మాణానికి, విద్యుదీకరణ పనులు చేయడానికి, మహిళా యూనివర్సిటీలో విద్యార్ధుల సౌకర్యార్థం రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. తుడా టవర్స్‌ నివాసయోగ్యమైన 2, 3, 4 బెడ్‌ రూమ్‌ ప్లాట్ల విక్రయాలపై ఆరా తీశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌లో వాణిజ్య గదులను, 2, 3, 4 ఫ్లోర్లలో కార్యాలయ గదులను విక్రయం లేదా అవసరమైతే లీజుకు కూడా ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. నెల్లూరు-తడ, తడ-శ్రీకాళహస్తి, పుత్తూరు-కడూరు వరకు ఉన్న మూడు ప్రధాన రహదారులకు రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్లను, కన్సల్టెన్సీ ద్వారా చేయటానికి, తుడాలో విలీనమైన ప్రాంతాల మాస్టర్‌ ప్లాన్‌ తయారీపై టెండర్లను ఆహ్వానించేందుకు, ఎస్వీయూ పరిధిలో ఆమోదించిన ప్రతిపాదిత మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లను తొలగించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని తీర్మానించారు. చంద్రగిరి నియోజకవర్గం మామండూరు వద్ద ఎంఐజీ లేఔట్‌ను అభివృద్ధి చేయడంలో సవరణ లేఔట్‌ ప్లాన్‌ను డీటీసీపీ ఆమోదం కోసం పంపాలని నిర్ణయించారు. రుయాస్పత్రిలో రోడ్లు అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అభివృద్ధి పనుల కేటాయింపులో నియమ నిబంధనలు పాటించాలన్నారు. తుడా వీసీ మౌర్య మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేపట్టేందుకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసినట్టు చెప్పారు. ఈ సమావేశంలో తుడా ఇన్‌చార్జి సెక్రటరీ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, పీవో దేవికుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 02:32 AM