Share News

CM Chandrababu : మభ్యపెట్టే నేతలకు వాతలు!

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:38 AM

ప్రజలను మభ్యపెట్టలేరని... మొన్న ఏపీ, నేడు ఢిల్లీ ఓటర్లు ఈ విషయాన్ని రుజువు చేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

CM Chandrababu : మభ్యపెట్టే నేతలకు వాతలు!

  • నాడు ఏపీ, నేడు ఢిల్లీ ఫలితాలే నిదర్శనం

  • ప్యాలెస్‌లు కట్టుకుని.. ఓడిపోయారు..

  • మద్యంలో అవినీతికి పాల్పడితే బాగుపడరు

  • ఢిల్లీ, పంజాబ్‌లలోనూ విధ్వంసమే

  • ఏపీలో ఐదేళ్లలోనే అదే స్థాయి వైపరీత్యం

  • ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను నేనెలా ఇస్తాను?:చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): అవినీతిపరులైన నాయకులు ఎల్లకాలం ప్రజలను మభ్యపెట్టలేరని... మొన్న ఏపీ, నేడు ఢిల్లీ ఓటర్లు ఈ విషయాన్ని రుజువు చేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ, ఢిల్లీ మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయన్నారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడారు. ‘సంక్షేమం పేరిట బటన్‌ నొక్కి ప్రజలను మోసం చేశారు. దీనిపై ప్రశ్నిస్తే సామాజిక మాధ్యమాల ద్వారా దుమ్మెత్తి పోయడం, వ్యక్తిగత దూషణలు చేయడం, అరెస్టులు చేయడం, గర్వంతో నోటికొచ్చినట్లు మాట్లాడటం చేశారు. ఇలాంటి రాజకీయ కాలుష్యాన్ని ప్రజలు ఎక్కువ కాలం భరించలేక ఓటుతో బుద్ధి చెప్పారు. ఢిల్లీలోనూ అద్భుతమైన విద్యా వ్యవస్థను తీసుకొచ్చామని చెబుతూ ఉన్నత విద్యను నాశనం చేశారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ఊసే మరిచిపోయారు. ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోయారు. ఢిల్లీని చెత్త నగరంగా మార్చేశారు. వాయు కాలుష్యానికి చిరునామాగా చేశారు. అందుకే ఢిల్లీ మోడల్‌ పూర్తిగా విఫల నమూనా అని చెబుతా. పంజాబ్‌లోనూ ఢిల్లీలాంటి పరిస్థితే ఏర్పడింది. ఒకప్పుడు దేశానికి కావాల్సిన సైన్యాన్ని, ఆహారాన్ని సమకూర్చే పంజాబ్‌ ఇప్పుడు డ్రగ్స్‌ కేంద్రంగా మారిపోయింది. పంజాబ్‌ నుంచి రోజూ ఓ రైలు నిండా ప్రజలు క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం ఢిల్లీకి వచ్చే పరిస్థితిని అక్కడి పాలకులు తీసుకొచ్చారు. ఢిల్లీ, పంజాబ్‌ల్లో విధ్వంసానికి సమయం పడితే, ఏపీలో ఐదేళ్లలోనే విధ్వంసాన్ని సృష్టించారు. ఏపీలో నాయకులు గర్వంతో నోటికి వచ్చింది మాట్లాడేవారు. అలాంటి వారి పరిస్థితి ఇప్పుడు ఏమైందో చూస్తున్నాం’ అని పేర్కొన్నారు.


ప్యాలెస్‌ల్లోకి వెళ్లకుండానే...

‘మద్యం ద్వారా అవినీతి చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చూసిన కుటుంబాలేవీ బాగుపడిన దాఖలాల్లేవు. అది పాపిష్టి సొమ్ము. టీడీపీ హయాంలో ప్రజల ఆరోగ్యం దెబ్బతినకూడదని ఎక్స్‌స్ట్రా న్యూట్రల్‌ ఆల్కాహాల్‌ ఇచ్చే వాళ్లం. కానీ వైసీపీ హయాంలో డబ్బుల కోసం రా లిక్కర్‌ అమ్మి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. ఢిల్లీలోనూ లిక్కర్‌ స్కాం చేసిన వాళ్లు ఓటమి పాలయ్యారు. విశాఖ రుషికొండను పవిత్ర ప్రదేశంగా చూస్తారు. దేవతలు ధ్యానం చేసిన అలాంటి ప్రదేశంలో ప్యాలెస్‌ కట్టుకోవాలన్న ఆలోచన చేసిన నాయకులు, ఢిల్లీలో శీష్‌మహల్‌ అనే విలాసవంతమైన ప్యాలెస్‌ కట్టిన నాయకులు ఇప్పుడు ఓటమి పాలయ్యారు. రెండుచోట్లా ఇద్దరు నాయకులు ప్యాలె్‌సల్లోకి పోకుండానే అధికారాన్ని కోల్పోయారు. రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి.. మేం సంక్షేమం ఇచ్చాం, మీరు ఇవ్వలేదని అంటున్నారు. ఓటేసిన పాపానికి కాటేసినవారు, ఇప్పుడు సంక్షేమం పేరుతో గగ్గోలు పెట్టడం దారుణం. అసమర్థులకు ఓటేస్తే విలువైన కాలాన్ని పోగొట్టుకోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. సంపద సృష్టించలేని వారు, ఆదాయం పెంచలేని వ్యక్తులు బటన్‌ నొక్కుడు పేరుతో డబ్బులు పంచడానికి అనర్హులు. ఆదాయం పెంచాలి. ప్రజల జీవన ప్రమాణాలను, తలసరి ఆదాయాన్ని పెంచాలి. అప్పుడు సంక్షేమం ఇవ్వాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో అభివృద్ధి

‘చరిత్రలో ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాల ప్రభావంతో ఇప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఈ రోజు తీసుకున్న నిర్ణయాల ప్రభావం భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేసినవాడే సరైన నాయకుడు. ఏపీలో 2047కి 42వేల డాలర్ల తలసరి ఆదాయం తీసుకురావాలన్నది లక్ష్యం. ఇది సాకారం కావాలంటే 15ు వృద్ది రేటు ఉండాలి. 2014-19లో వృద్ధి రేటు 13.5ు ఉండేది. వైసీపీ హయాంలో 10 శాతానికి పడిపోయింది. దీనివల్ల రాష్ట్రం వెనుకబడిపోయింది. మోదీ నాయకత్వంలో 2047 నాటికి దేశం నంబర్‌ వన్‌గా నిలుస్తుంది. అప్పటికి ఏపీని నం.1 చేయాలన్నది నా ఆలోచన. రాష్ట్రంలో, దేశంలో ఒకే ప్రభుత్వం ఉంటే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో అభివృద్ధి వేగవంతంగా ఉంటుంది’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

జగన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌

జగన్‌ 2.0తో వస్తానన్న వ్యాఖ్యలపై విలేకరుల ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. గర్వంతో మాట్లాడే వ్యక్తులతో రాజకీయాలు చేయాలంటే బాధవేస్తుందన్నారు. సభలో సీఎంకు ఇచ్చే సమయం తనకు ఇస్తే అసెంబ్లీకి వస్తానన్న జగన్‌ వ్యాఖ్యలపై విలేకరుల ప్రశ్నకు స్పందించారు. ‘ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. నేనెలా ఇస్తాను? అలాంటి వితండ వాదనకు ఎవరూ సమాధానం చెప్పలేరు. మనం విలువలు పాటించకుండా విలువల గురించి చెప్పడం హాస్యాస్పదం’ అని అన్నారు.


సుస్థిర ప్రభుత్వాలతో స్థిరమైన వృద్ధి

గుజరాత్‌ దీనికి స్పష్టమైన ఉదాహరణ: చంద్రబాబు

ఒకే పార్టీ, ఒకే నేత ఎక్కువ కాలం అధికారంలో ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి సాధించాయని చంద్రబాబు అన్నారు. గుజరాత్‌లో ఐదుసార్లు బీజేపీ గెలిచిందని, స్థిరమైన పాలన వల్ల అక్కడ 15రెట్లు జీఎ్‌సడీపీ పెరిగిందని, ప్రస్తుత తలసరి ఆదాయం 4,500 డాలర్లని వివరించారు. ఏపీలో 2019లో తాను గెలిచి ఉంటే గుజరాత్‌తో సమానంగా రాష్ట్ర జీఎ్‌సడీపీ ఉండేదన్నారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ అని, కొంతమందికి ఇష్టమున్నా లేకున్నా వాస్తవం ఇదేనన్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటే అభివృద్ధి బాగుంటుందనే మోడల్‌ను మోదీ తయారు చేశారని, దాన్ని ఢిల్లీ ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. దేశంలో గడిచిన 35ఏళ్ల పాటు జరిగిన అభివృద్ధిపై చర్చ జరగాలన్నారు. ‘ఏ రాష్ట్రం.. ఏ సమయంలో, ఎవరి పాలనలో ఉంది. అప్పుడు జరిగిన అభివృద్ధిపై చర్చ జరగాలి. నీతి ఆయోగ్‌ ఈ బాధ్యతను తీసుకోవాలి’ అని కోరారు. ‘దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి 34ఏళ్లు అయింది. మన తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. వాటిని అందిపుచ్చుకుని మంచి పాలసీలు అమలు చేసిన రాష్ట్రాలు అభివృద్ధి బాట పట్టాయి. సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నచోట మరింత అభివృద్ధి జరిగింది’ అని తెలిపారు. 1995 నుంచి 2024 వరకు ఏ రాష్ట్రంలో జీఎ్‌సడీపీ ఎన్ని రెట్లు పెరిగిందో ఆయన వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..

Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..

Updated Date - Feb 09 , 2025 | 06:23 AM